-ఉద్యోగుల పర్సనల్ డేటాకు రక్షణ ఉండదు
-ముఖ ఆధారిత హాజరుకు స్మార్టుఫోన్లు తయారుచేయండి
-ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డిని కలిసిన ఏపీ జేఏసీ నేత బొప్పరాజు
ఉద్యోగుల హాజరు కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ముఖ హాజరుపై అమరావతి జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మేరకు వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని కలసి తమ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక వినతిపత్రం సమర్పించారు. వారి సమస్యలు విన్న సీఎస్ జవహర్‌రెడ్డి.. ఈ విషయంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘ నేతలు జవహర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన అంశాలివే.
AP జేఏసీ అమరావతి పక్షాన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా|| కె యస్ జవహర్ రెడ్డి ని రాష్ట్ర సచివాలయం ఒకటవ బ్లాక్ లోని వారి కార్యాలయం నందు కలసి… ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం జనవరి 1 వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమలు చేయాలని తేదీ 27/12/2022 న ప్రభుత్వం ఇచ్చిన G.O Ms No.159 అమలు, పై ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన, ముఖ ఆధారిత హాజరు వల్ల కలిగే ఇబ్బందులు, ప్రధానంగా క్షేత్ర స్థాయిలో ఉన్న ఫీల్డ్ స్టాఫ్ ఎదుర్కొనే సమస్యలు వివరిస్తూ ఏపీ జేఏసీ అమరావతి పక్షాన గౌ|| సిఎస్కి మెమొరాండం సమర్పించడం జరిగింది.
ఈ మెమొరాండంలో ప్రధానంగా ఈ క్రింద అంశాలు ప్రస్తావించడమైనది
1 . ప్రస్తుతమున్న బయో మెట్రిక్ విధానం బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. ఈ విధానం వల్ల ఉద్యోగుల వ్యక్తిగత గోప్యత దెబ్బతినే అవకాశం లేదు.
2 . ముఖ ఆధారిత హాజరు విధానాన్ని స్వాగతిస్తున్నాము, కానీ ఈ విధానం అమలు వలన పర్సనల్ డేటా కు రక్షణ వుండదు అని ఉద్యోగులందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
3 .అన్నీ శాఖలలో పనిచేసే ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది చిరు ఉద్యోగులే. ప్రధానంగా నాల్గవ తరగతి ఉద్యోగులు, వాచ్మెన్, ఆర్టీసీ, రికార్డ్ అసిస్టెంట్ స్థాయి మెజారిటీ ఉద్యోగులకు స్మార్ట్ ఫోన్లు ఉండే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ వాళ్ల పిల్లలు ద్వారా వచ్చిన ఫోన్లు ఉన్నా, వాటిని ఉపయోగించడం తెలియదు కనుక ప్రభుత్వమే, ముఖ ఆధారిత హాజరు కొరకు ప్రత్యేకంగా డివైజ్లు / స్మార్ట్ ఫోన్లు ఏర్పాటు చేయాలి.
4 . ప్రధానంగా క్షేత్ర స్థాయిలో పనిచేసే ఫీల్డ్ స్టాఫ్ ఉదయాన్నే 7 గంటల లోపే ఫీల్డ్ కి వెళ్లి, ఎక్కువ సమయం ఫీల్డ్ లోనే గడిపే అవకాశం ఉన్నందున, ఫీల్డ్ స్టాఫ్ ఎక్కడ ఉంటే అక్కడ నుండే ముఖ ఆధారిత హాజరు వేసే విధంగా డివైజ్ లో తగిన ఏర్పాట్లు చేయాలి.
5 . ఆన్ డ్యూటీ/ డిప్యూటేషన్ లో ఉన్న ఉద్యోగులకు కూడా వారు పని చేసే ప్రాంతం నుండే ముఖ ఆధారిత హాజరు వేసుకునే వెసులుబాటు కల్పించాలి.
6 . ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులకు ప్రభుత్వం కల్పించిన 21 రోజుల ప్రత్యేక సెలవులు యాప్ లో పొందు పరచాలి.
7 . మహిళా ఉద్యోగినులు ఇచ్చిన ప్రత్యేక సెలవులు యాప్ లో పొందుపరచాలి.
8 .జిల్లాలో పనిచేసే ఉద్యోగులకు ఆరు రోజులు పని దినాలు కనుక, వారికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 10.30 నుండి 5 గంటలకు వరకు ఆఫీసు టైమింగ్స్ ఉండే విధంగా యాప్ లో మార్పులు చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతులు కార్యాలయ ఉద్యోగులకు అయిదు రోజుల పని దినాలు కనుక వారికి 10 గంటల నుండి 5.30 గంటల వరకు ఆఫీస్ టైమింగ్స్ ఉన్నాయి, అదే విధానం యాప్ లో లోడ్ చేసి ఉంది.
9 . ముఖ ఆధారిత హాజరు యాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలంటే, రీఛార్జ్ చేయాల్సి ఉన్నందున, ఉద్యోగులకు అదనపు ఖర్చు అవుతుంది.
ఇటువంటి ఉద్యోగులకు సంబంధించిన విషయాలలో, ఫీల్డ్ స్థాయిలో ఎంతో అనుభవం ఉన్న ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి.
కనుక, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , ముఖ ఆధారిత హాజరు అమలులో పైన తెలిపిన సమస్యలు/ఇబ్బందులు పరిష్కారం అయ్యేవరకు ప్రధానంగా క్షేత్ర స్థాయిలో పనిచేసే ఫీల్డ్ స్టాఫ్ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు, అలాగే డివైజ్/ఫోన్లు ప్రభుత్వం సప్లయ్ చేసేవరకు, ప్రస్తుతం ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని కొనసాగించాలని AP JAC అమరావతి మెమొరాండం ద్వారా కోరడమైనది.
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఫీల్డ్ స్టాఫ్ విషయంలో తప్పకుండా న్యాయం చేస్తామని, అలాగే ముఖ ఆధారిత హాజరు ఆప్ డౌన్లోడ్ పట్ల ఉన్న సందేహాలు కూడా నివృతం చేస్తామని, ముఖ ఆధారిత హాజరు అమలు విషయంలో ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు/బాధలు l కలుగకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
సి ఎస్ ని కలిసిన వారిలో రాష్ట్ర నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం అధ్యక్షుడు యస్.మల్లీశ్వర రావు, మునిసిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీ. ఈశ్వర రావు, లేబర్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.