– వ్యవసాయ చట్టాలు తేనె పూసిన కత్తులు
– బద్వేలు ఉప ఎన్నికల్లో రైతు వ్యతిరేక వైసీపీ, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పాలి
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి
వేంపల్లె : రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మోటర్లు బిగించాలని జగన్ ప్రభుత్వం 1-9-2020న జీఓ 22 జారీ చేయడం, ఆదిశలో ఏర్పాట్లు చేస్తుండడం శోచనీయమని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్య నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. గురువారం వేంపల్లెలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించిన రైతుల మెడలకు ఉరితాళ్ళు బిగించడమేనని అన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ సరఫరా ఎత్తివేసే పన్నాగమన్నారు. ఉచిత విద్యుత్తు సరఫరా పథకం కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అని తులసిరెడ్డి పేర్కొన్నారు.
ఆనాడు ప్రతిపక్షాల నుండి ఎన్ని విమర్శలు వచ్చినా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం 2004 మే 14 న ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. గత 17 సంవత్సరాలుగా ఈ పథకం అమలవుతున్నదని, ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ పథకం ఫైలు పైనే తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. అటువంటి పథకాన్ని మీటర్లు బిగించి ఎత్తివేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం దురదృష్టకరమన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు తేనెపూసిన కత్తులని, ఈ చట్టాలు రైతులకు, వినియోగదారులకు వ్యతిరేకమని, రిలయన్స్ లాంటి బడా వ్యాపారులకు అనుకూలమన్నారు. ఇటువంటి రైతు వ్యతిరేక దుర్మార్గమైన చట్టాలకు జగన్ పార్టీ మద్దతు ఇవ్వడం గర్హనీయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలో మూడవ స్థానంలో ఉందని, మీటర్లు బిగిస్తే ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి చేరుకుంటుందని తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రైతులందరూ మూకుమ్మడిగా వైసీపీ, బీజేపీ పార్టీలను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
తులసిరెడ్డిని పరామర్శించిన వీరశివారెడ్డి
ఇటీవల కాలు విరిగి శస్త్ర చికిత్స చేయించుకొని వేంపల్లెలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న తులసిరెడ్డిని కమలాపురం మాజీ శాసన సభ్యులు జీ. వీర శివారెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో, కడప జిల్లాలో ప్రత్యేకించి కమలాపురం నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు.