పెట్టుబడులే లక్ష్యం..బంధం బలోపేతమే ధ్యేయం

– పశ్చిమ ఆస్ట్రేలియాతో ఒప్పందాల దిశగా ఆంధ్రప్రదేశ్
– పరిశ్రమలు, నైపుణ్యం, గనులు, ఖనిజాలు, విద్యుత్ రంగాలలో కలిసి పని చేయడానికి పరస్పర అంగీకారం
– జూలై 16న విశాఖ వేదికగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా, ఆంధ్రప్రదేశ్ “వ్యూహాత్మక భాగస్వామ్యం”
– పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్

అమరావతి, జూలై, 15 : పెట్టుబడులే లక్ష్యం…బంధం బలోపేతమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పశ్చిమ ఆస్ట్రేలియా భాగస్వామ్యం కాబోతున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. జూలై 16వ తేదీ శనివారం విశాఖపట్నంలోని ‘రాడిసన్ బ్లూ’ హోటల్ వేదికగా “వ్యూహాత్మక భాగస్వామ్యం” దిశగా ఏపీ, ఆస్ట్రేలియా కలిసి పని చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

పరిశ్రమలు, నైపుణ్యం, శిక్షణ , మెరైన్, ఫుడ్ ప్రాసెసింగ్, విద్యుత్, మైనింగ్ ,మాన్యుఫ్యాక్చరింగ్‌ సహా వివిధ రంగాల్లో తోడ్పాటుకు ఆంధ్రప్రదేశ్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరస్పర అంగీకారం ఒప్పందాలు చేసుకోనుందని మంత్రి స్పష్టం చేశారు. సోదర రాష్ట్ర ఒప్పందంలో భాగంగా గనులు, ఖనిజాలు, విద్య, శిక్షణ పశ్చిమ ఆస్ట్రేలియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకోనుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, వివిధ రంగాల్లో పెట్టుబడులకోసం రెండు ప్రభుత్వాలు “అవకాశాల మార్గం”లో కలిసి పని చేస్తాయన్నారు.

ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియాల మధ్య ఇప్పటికే సోదర రాష్ట్ర ఒప్పందం : పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్
ఆంధ్రప్రదేశ్ లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, సాంకేతిక సహకారం , నైపుణ్యం అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా సంసిద్ధతతో ఉందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, పశ్చిమ ఆస్ట్రేలియాల మధ్య సోదర రాష్ట్ర ఒప్పందం ఉందన్నారు. ఆ బంధం ఏపీతో మరింత బలోపేతం చేసుకునేందుకు ఆస్ట్రేలియా ప్రతినిధులు ఏపీకి వస్తున్నట్లు స్పష్టం చేశారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా నుంచి ఆ ప్రభుత్వ మంత్రులు సహా మరో 90మంది ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు కరికాల వివరించారు.

ఈ కార్యక్రమానికి విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక, నైపుణ్య శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమలు,ఐ.టీ,వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ , పశ్చిమ ఆస్ట్రేలియా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు.

Leave a Reply