ఆదిలాబాద్ లోని సీసీఐ యూనిట్ ను పునరుద్ధరించండి

-రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని వెల్లడి
-వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందన్న కేటీఆర్
-పీయూష్‌ గోయల్‌కు కేటీఆర్ విజ్ఞప్తి

కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఓ విన్నపం చేశారు. ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ ను సమీక్షించి, దాన్ని పునరుద్ధరించాలని కోరారు. దీనికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. యూనిట్ పునరుద్ధరణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సహకారం అందిస్తామని చెప్పారు. ఈ యూనిట్ పునరుద్ధరింపబడితే… ఆదిలాబాద్ కు చెందిన వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.

మరోవైపు యూనిట్ కు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన ట్వీట్ ను, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను షేర్ చేశారు. ‘ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పరిశ్రమను పునరుద్ధరించాలని, జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం శాయశక్తులా పోరాడుతుంటే.. మరోవైపు పరిశ్రమ తొలగింపునకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది’ అంటూ జోగు రామన్న ట్వీట్ చేశారు.

Leave a Reply