Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ జ్ఞాపకాల్లో ‘ఏప్రిల్ 6’

– రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుల వర్షం
– భయం గుప్పెట్లో నాటి బెస్తవారిపల్లె
-నిరవధికంగా మూతపడిన ఆంధ్రాయూనివర్శిటీ
– ఆ చారిత్రాత్మక ఘటనకు 82 ఏళ్లు

( వి.ఉమామహేశ్వరరావు)

అప్పుడప్పుడే ఎదుగుతున్న నాటి బెస్తవారిపల్లెపై 82 ఏళ్ల క్రితం జరిగిన బాంబుల వర్షం నేటికీ విశాఖ వాసుల కళ్లముందు కదులాడుతూనే ఉంది. పోర్టు. కెజిహెచ్, షిప్ యార్డ్, ఆంధ్రాయూనివర్శిటీ వంటివి ఏర్పడి ప్రగతి చిత్రపటాన తనకంటూ స్థానం సంపాదించుకుంటున్న తరుణంలో పట్టణంపై జరిగిన ఆకస్మిక బాంబుల దాడి నుంచి కోలుకోవాడానికి సాగరతీర విశాఖకు చాలా ఏళ్లు పట్టింది. వివరాల్లోకి వెళితే…

అది రెండో ప్రపంచ యుద్ధకాలం. మూడేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా అశాంతి, అనిశ్చితి, ఆందోళన నెలకొని ఉంది. ఈ భీకర పోరుకు అనేక పట్టణాలు, నగరాలు భీతిల్లాయి. అదే సమయంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న దేశాలు, పట్టణాలుపై 1942లో జపాన్ సైన్యాలు మెరుపుదాడులు చేయడం మొదలపెట్టాయి. పలు దేశాలపై బాంబుల వర్షం కురిపించారు. ఇదే వేడిలో భారత్ పైనా ఆ దేశం దాడి చేసింది. ఆ దాడి సరాసరి కోస్తాతీర ప్రాంతంలోని కాకినాడతో పాటు విశాఖపట్నంపై జరగటంతో ఇక్కడ వారంతా తీవ్ర భయాందోళలకు గురి అయ్యారు.

1942 ఏప్రిల్ 6వ తేదీన ఈ దాడితో విశాఖవాసులను భయకంపితులను చేసింది. దీంతో అనకాపల్లి, విజయనగరం తదితర సుదూర ప్రాంతాలకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పలువురు వలస పట్టారు. తిరిగి తమ స్వస్థలమైన విశాఖకు రావడానికి వారికి ఎన్నో ఎళ్లు పట్టింది.

గుంటూరుకు తరలిపోయిన ఏయూ: మరోవైపు ఈ విపత్కర పరిస్థితికి ఆంధ్రవిశ్వవిద్యాలయం నిరవధికంగా మూతపడింది. అత్యవసర పరిస్థితిని విధించి ఏయూను బ్రిటీష్ సైన్యాలు స్వాధీనం చేసుకున్నాయి. గాయాలపాలైన సైనికులకు తక్షణ చికిత్సలు అందించేందుకుగాను యూనివర్శిటీలో అప్పటికి ఉన్న వినయ్ విహార్, అశోకవర్ధన్, సదర్మసదన్, హర్షవర్ధన్ తదితర హాస్టళ్లన్నీ బ్రిటీష్ మిలటరీతో నిండిపోయాయి. ఈ పరిస్థితిల్లో విద్యార్థులను ఖాళీ చేయంచక తప్పలేదు.

అంతేకాకుండా అప్పుడు జరుగుతున్న వార్షిక పరీక్షలను కూడా ఏయూ వాయిదా వేసింది. ఏయూలో కార్యాకలాపాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ఏప్రిల్ 16వ తేదీన వర్శిటీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. సురక్షితమైన ప్రదేశమని భావించి అక్కడికి వారంరోజుల్లో వర్శిటీ సామాగ్రి, ప్రయోగశాలల పరికరాలు వంటివన్నీ తాత్కాలికంగా రైళ్లలో గుంటూరుకు తరలించారు. అక్కడ ఉన్న పాత మెడికల్ కళాశాల ఆవరణలో తరగతులను, పరీక్షలను ప్రారంభించారు. రసాయనశాస్త్ర విభాగాలను మాత్రం మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ఏర్పాటు చేశారు.

రెండో ప్రపంచ యుద్ధమేఘాలు ఆవిరవుతున్న దశలో 1944 జూను 10వ తేదీన, పరిస్థితులను అంచనావేసి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడానికి ఏడుగురు సభ్యుల నిపుణులతో ఏయూ సిండికేటు ఒక కమిటీని ఏర్పాటే చేసింది. అప్పటి ఏయూ తాత్కాలిక వీసీ లక్కరాజు సుబ్బారావు చైర్మన్ గా, నాటి రిజిస్ట్రారు కె.వి.గోపాలస్వామి వైస్ చైర్మన్ గా ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ నివేదికతో పాటు అప్పటికీ పరిస్థితులు చల్లబడటం తన పాత ప్రదేశమైన విశాఖకు వచ్చేందుకు ఏయూ మొగ్గు చూపింది.

నాటి ఘటనకు గుర్తుగా గుంటూరు కేంద్రాన్ని తొలుతు ఏయూ పీజీ కేంద్రగా గుర్తించగా, తర్వాత అది విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. మరోవైపు గుంటూరుకు తరలిన ఏయూ పరోక్షకంగా కోస్తా జిల్లాల్లో విద్యాభివృద్ధికి తోడ్పడింది. గుంటూరులోని ఏయూకు అనుబంధంగా 1945లో మచిలీపట్నంలో న్యాయ విభాగాన్ని, 1946లో ఇంజినీరింగ్ కళాశాలను కాకినాడలోను ఏర్పాటు చేశారు. తర్వాత ఇవి 1949, 1955ల్లో విశాఖలో ప్రస్తుతమున్న ప్రదేశాలకు మార్చారు.

విశాఖ మ్యూజియంలో జ్ఞాపకాలు నిక్షిప్తం: విశాఖపై నాడు జరిగిన బాంబుదాడి ఘటన, మరణించిన వారి వివరాలు, వాడిన ఆయుధాలు, బాంబుల ఆనవాళ్లును సాగర తీరంలోని విశాఖ మ్యూజియంలో నేటికీ నిక్షిప్తమై ఉన్నాయి. ఈ బాంబుల వర్షంలో మరణించిన పి. అప్పలనరసయ్య, ఇ. పెద్దయ్య, షేక్ ఇబ్రహాం. వి. అప్పడు, ఈద్ అక్బర్, కె.ఆనందరావు, ఎన్. మాధవరావు త్యాగాలను, వివరాలను ఈ మ్యూజియంలో భద్రపరిచారు.

ఈ దాడి అనంతరం భారత రక్షణ శాఖ, విశాఖ-భీమిలి తీర మార్గాన ప్రత్యేక ఎయిర్ ఫీల్డు 1943లో ఏర్పాటు చేసింది. అది అంచెలంచెలుగా ఎదిగి నావికా దళానికి తూర్పుతీర ప్రధాన కేంద్రంగా మారింది. అందుకే, ఏప్రిల్ 6వ తేదీయే కాకుండా ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు… విశాఖ వాసులు, ఏయూ వర్గాలు ముందు ఆ చారిత్రాత్మక ఘటన కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. గిర్రున తిరిగే కాలం రీళ్లలో వారికి నేటికీ అది కనిపిస్తూనే ఉంటుంది

 

LEAVE A RESPONSE