– తెలుగుదేశం జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు
హైదరాబాద్: మాల, మాదిగలకు ఆశ్రమపాఠశాలలను మొట్ట మొదట ప్రారంభించిన నాయకుడు ఎన్‌టిఆర్. పరిపాలన, రాజకీయ రంగాలలో పెను మార్పులు తెచ్చిన మహనీయుడు ఎన్‌టిఆర్. అటువంటి మహోన్నత నాయకుడి స్మృతికి చిహ్నమైన ఎన్‌టిఆర్ ఘాట్‌లో అసెంబ్లీని కట్టాలనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం మంచి సాంప్రదాయం కాదు. కోట్ల మంది అభిమానులు కలిగిన నాయకునిపై రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడటం సరికాదు.
గత ప్రభుత్వం ఉన్న సచివాలయాన్ని ఏమైనా చిన్నచిన్న రిపేర్లు చేసే బదులు మొత్తానికి మొత్తం కూల్చివేసి కట్టారు. ప్రజల డబ్బు ఎందుకు వృధా చేస్తారు? రాజగోపాల్ రెడ్డి మాటలు కాంగ్రెస్ విధానమా? లేక రాజగోపాల్ రెడ్డి విధానమా? రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం మంచిది కాదు. పోరాటాల గడ్డ నల్లగొండ నుంచి శాసనసభ్యునిగా నందమూరి తారక రామారావుని ప్రజలు ఎన్నుకున్నారు. భూమి కోసం, భుక్తికోసం పోరాడిన నల్లగొండ ప్రజలు ఎన్‌టిఆర్‌కు ఓట్లు వేసి గెలిపించుకున్నారు. ఎన్‌టిఆర్ ఘాట్‌లో శాసనసభ భవనాన్ని నిర్మించాల్సిన పని ఏమి ఉన్నది? రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకు పరిణామాలు ఏవిధంగా ఉంటాయో ఆయన ఆలోచించుకోవాలి.