Suryaa.co.in

Political News

వ్యవస్థలు మేనేజ్ అవుతున్నాయా!?

‘ వ్యవస్థలను మేనేజ్ చేసి….’
ఈ పదం వినడానికి బాగుంది. అనడానికి కూడా చాలా బాగుంటుంది. చదువు వంటబట్టని వారికి కూడా… నోరు సులభం గా తిరుగుతుంది.
దానితో, ఈ వాక్యం గత నాలుగేళ్ళల్లో బహుళ ప్రచారం లోకి వచ్చింది. ఈ వాక్యం లో ఇమిడివున్న అంతరార్ధం ఏమిటో తెలియక పోయినా, ఈ వాక్యాన్ని పదే పదే పలకడానికి…. రాజ్యాంగ పరమైన, నైతికానైతిక పరమైన ఆంక్షలు ఏమీ లేవు.

‘ వ్యవస్థలను మేనేజ్ చేసి….’ అని ఎవరైనా…. ఎప్పుడైనా…. ఏ కారణం తో అయినా అనవచ్చు. అలా అనే వారినీ ఎవరూ ఖండించరు, తప్పు పట్టరు కూడా. ఎందుకంటే…. ఇది – గాలి లోకి విసిరే రాయి. కడుపులో ఒకటి పెట్టుకుని, పైకి ఇంకోటి మాట్లాడే మాట. ఎదుటి వారిని ఉద్దేశించి జల్లే పేడ కళ్ళాపు.

వైసీపీ (జగన్ ) పాలన మొదలైన తరువాత, ” వ్యవస్థలను మేనేజ్ చేసి…. ” అనే డైలాగ్ బాగా వాడుక లోకి, బహుళ ప్రచారం లోకి వచ్చినట్టు కనపడుతున్నది. అంతకు ముందు నాటి రాజకీయాలలో ఈ వాక్య ప్రయోగం అంతగా వినియోగం లోకి వచ్చిన జ్ఞాపకం లేదు.

వైసీపీ పార్టీ – ప్రభుత్వ నిర్వహణ పగ్గాలు చేపట్టిన తరువాత, ఏదో ఒక జీ. ఓ (గవర్నమెంట్ ఆర్డర్ ను జీ ఓ అంటుంటాం ) ఇవ్వడం, దాన్ని బట్టుకుని ఎవరో ఒకరు హై కోర్టు కు వెళ్లడం, అక్కడ దాన్ని కొట్టేయడం అనే పరిణామాలు…. మొదటి మూడు…. మూడున్నర సంవత్సరాలలో రోజు వారి న్యూస్ గా మారిపోయాయి.

‘ హై కోర్టు లో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు… ” అనే శీర్షిక ను వార్తా పత్రికల్లో ఎన్ని సార్లు పెట్టారో…. జనం ఎన్ని సార్లు చదివారో లెక్కే లేదు. ఏదైనా హై కోర్టు లో కేసు కు సంబంధించిన తీర్పు కు సంబంధించి , ఈ శీర్షిక వార్తా పత్రికల్లో కనిపించక పోతే కొంచెం ఆశ్చర్యం కూడా వేసేది.

ఈ తీర్పులను జీర్ణం చేసుకోవడం వైసీపీ పాలిత ప్రభుత్వ పెద్దలకు కొంచెం కష్టం అయ్యేది. నేరుగా, కోర్టులను తప్పు పట్టేంతగా మన ప్రజాస్వామ్యం ఇంకా అభివృద్ధి చెందక పోవడం తో ( ఆ ముచ్చట తీరడానికీ ఎక్కువ కాలం పట్టక పోవచ్చు!), ఎవరో ” వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు… ” అనే థియరీ పురుడు పోసుకుంది. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ థియరీ కి మంచి ప్రచారం కల్పించారు అనే చెప్పాలి.

ఈ ప్రచారానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ను లక్ష్యం గా చేసుకుని ఆయన తృప్తి పడేవారు. ఆయనను ఆదర్శం గా తీసుకుని, వైసీపీ లోని ఇతరులు కూడా ఇదే మాట మాట్టాడే వారు. దీనితో, “…… వ్యవస్థలను మేనేజ్ చేసి….” అనే మాట ఇంటింటికీ పాపులర్ అయిపోయింది. అసలు ‘వ్యవస్థలు ‘ ఎన్నో లేవు. మూడో…., నాలుగో ఉన్నాయి. అవి కూడా మేనేజ్ అయిపోతున్నాయి అనేది ఆరోపణలు.

ఈ ఆరోపణలు చేస్తున్నవారు… సందర్భాన్ని బట్టి ఆయా వ్యవస్థలను నిందిస్తున్నారో…, మేనేజ్ చేసే వారిని నిందిస్తున్నారో, ఈ రెండింటికీ అవకాశం ఇచ్చిన మన ప్రజాస్వామిక ప్రక్రియ లోని లోపాన్ని ఎత్తి చూపుతున్నారో, వ్యవస్థలను తాము మేనేజ్ చేసుకోలేక పోతున్నామనే తమ నిస్సహాయతను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారో తెలియదు.

175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలలో గెలిచి ; ప్రభుత్వ నిర్వహణను మొదటి సారిగా చేపట్టినందున, వ్యవస్థలను మేనేజ్ చేయలేక పోతున్నామనే భావన కూడా ఈ విమర్శ / ఆరోపణ / ఆక్రోశం లో ఇమిడి ఉన్నదేమో అనిపిస్తుంటుంది.

చంద్రబాబు నలభై ఏళ్లకు పైబడి రాజకీయాలలో కొనసాగుతూ ఉండడం, మూడుసార్లు ముఖ్యమంత్రి పదవిని నిర్వహించి ఉండడం తో, ‘ వ్యవస్థలను మేనేజ్ చేయడం ‘ లో ఆయనకు అపారమైన అనుభవం ఉండి ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి గానీ, ఇతర వైసీపీ నేతలు గానీ అభిప్రాయపడ్డారేమో తెలియదు.

కానీ, 151 సీట్లతో సర్వ బలాధ్యులైన ప్రభుత్వ పాలక పెద్దలను కాదని ; 23 సీట్లతో అత్యంత బలహీనం గా ఉన్న వారికి…. వ్యవస్థలను మేనేజ్ చేసే శక్తి ఉంటుందా? వ్యవస్థలు మేనేజ్ అవుతాయా? ఇది…. ఎవరికైనా కలిగే సింపుల్ కామన్ సెన్స్ పాయింట్.

అసలు ఎన్ని ‘వ్యవస్థలు ‘ ఉన్నాయి మనకు అని అడిగితే….. ప్రధానం గా ఓ నాలుగు అని చెప్పవచ్చు.
1. శాసన వ్యవస్థ,
2. అధికార వ్యవస్థ,
3. న్యాయ వ్యవస్థ,
4. రాజకీయ వ్యవస్థ. ఎన్నికల సంఘం, కంట్రోలర్ & ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వంటి (ఉత్తుత్తి )రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి గానీ, ప్రభుత్వాధికారం చేతిలో ఉన్న రాజకీయ వ్యవస్థల కనుసన్నల్లోనే ఇవి నడుచుకుంటూ ఉంటాయని మన అనుభవం లో కనపడుతుంది.

ఇక ‘శాసన వ్యవస్థ’ అంటే…. పార్లమెంటు, శాసన సభ (శాసన మండలి ని కూడా కలుపుకుని ). ఇవి స్వతంత్రం గా పనిచేసే ప్రశ్నే లేదు కదా!
కేంద్ర ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ చేతుల్లో ఉంటే ; పార్లమెంట్ కూడా వారి చేతుల్లోనే ఉంటుంది కదా! రాష్ట్రాలలో శాసన సభల దీన స్థితి మరింత దారుణం గా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఈ ‘వ్యవస్థ’ లను అధికార పార్టీ ఎలా కావాలంటే…. అలా మేనేజ్ చేసుకోవచ్చు.

గతం నుంచీ చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు చేసుకుంటున్నాయి. భవిష్యత్ లోనూ మేనేజ్ చేసుకుంటాయి. అసలు అవి ఉన్నదే…. అధికార పక్షం మేనేజ్ చేసుకోడానికి అన్నట్టుగా ప్రభుత్వ నిర్వాహకులు వ్యవహరిస్తుంటారు !

ఇక, మిగిలింది,’ న్యాయ వ్యవస్థ ‘. ఇది మేనేజ్ చేయడం పైనే…. సజ్జల రామకృష్ణారెడ్డి గానీ, ఇతర వైసీపీ నేతలు గానీ మొదటి మూడున్నరేళ్ళల్లో మాట్టాడింది. చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారు అని. అయితే, ఒక ఏడెనిమిది నెలలుగా చంద్రబాబు పై ఈ ఆరోపణ వినపడడం లేదు.
ఇప్పుడు తెలుగుదేశం నేతలు…. ఇదే ఆరోపణను సీ ఎం జగన్మోహన్ రెడ్డి పై ప్రయోగిస్తున్నారు.

వ్యవస్థలను మేనేజ్ చేసి, చంద్రబాబు నాయుడు ను అక్రమ కేసుల్లో జైలు కు పంపి అక్కడే ఉంచుతున్నారని టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు మొన్న గవర్నర్ ను కలిసి వచ్చాక ఆరోపించారు.

వైసీపీ వారు ఈ ఆరోపణలు చేసినంతకాలమూ టీడీపీ నేతలు నోరు మెదపలేదు. ఇప్పుడు టీడీపీ వారు అదే ఆరోపణ చేస్తుంటే…. వైసీపీ వారు స్పందించడం లేదు. నిజానికి, ఈ రెండు పార్టీల నేతలు… పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటుంటున్నట్టు కనబడుతున్నప్పటికీ ; ఇద్దరూ కలిసి తీస్తున్నది మాత్రం – న్యాయ వ్యవస్థ పరువునే.

న్యాయ వ్యవస్థ వ్యవహార శైలి ని మేనేజ్ చేయవచ్చని రెండు పార్టీల వారూ అభిప్రాయపడుతున్నారని…వారు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణను బట్టి ఎవరైనా ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం లేక పోలేదు. కొద్దో… గొప్పో…. జనానికి ఇప్పటికీ కొంచెం నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ అని అంటారు. మిగిలిన వ్యవస్థలను మేనేజ్ చేయడమంత సులభం కాదు, న్యాయ వ్యవస్థ అనే అభిప్రాయం కూడా ఉంది.

ఇప్పుడు, రాజకీయాలలో ఉన్నవారి పరస్పర ఆరోపణలను బట్టి, ఆ వ్యవస్థను కూడా మిగిలిన వ్యవస్థల లాగానే మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదా అనే భావం ఎవరికైనా కలగడం సహజం. కాకపోతే, ‘పట్టు’ దొరకాలి. అది దొరికితే, ఇక తిరుగు లేదు.

మూడున్నరేళ్లుగా…. వైసీపీ ఆరోపణలకు స్పందించని టీడీపీ నేతలు ; ఇప్పుడు వైసీపీ పై అదే ఆరోపణలు చేస్తున్నారు అంటే….; వైసీపీ కి ‘ పట్టు ‘ దొరికిందా అనే అనుమానాలు కలగడం సహజం. న్యాయ వ్యవస్థ లో కూడా ఉండేది మన సమాజం లోని మనుషులే కదా! సమాజపు రంగు, రుచి, వాసన….బలాలు, బలహీనతలు వారిలోనూ ప్రతిఫలిస్తూ ఉంటాయి కదా!

వాటిని దృష్టిలో పెట్టుకునే అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి బృందం గానీ ; ఇప్పుడు టీడీపీ బృందం గానీ న్యాయ వ్యవస్థ పరువుకు భంగకరం గా వ్యాఖ్యనాలు చేస్తున్నారేమో అనిపిస్తున్నది. వీరు కూడా సమాజం లోని సమస్త రంగు, రుచి, వాసన, బల, బలహీనతలను ప్రతిబింబించే వారే కదా! వారూ…. వీరూ ఆరోపస్తున్నట్టుగా – ఇక న్యాయ వ్యవస్థ కూడా మేనేజ్ అయిపోతుంటే – ఇక, దేముడే దిక్కు.

నిజానికి, రాజకీయ ప్రత్యర్థులపై ఈ తరహా ఆరోపణ చేసేవారికి…. న్యాయ స్థానమే సూమోటో గా నోటీసులు జారీ చేయాలి. ‘ ఈ ఆరోపణ చేయడం లో మీ ఉద్దేశం ఏమిటి? ఏ వ్యవస్థ ను మేనేజ్ చేశారు? ఎలా చేశారు? మీ దగ్గర రుజువులు ఉన్నాయా? ఏమిటి అవి? ‘ అని నిలదీస్తే, ఈ ఆరోపణల కాలుష్యం రాజకీయాల్లో కొంత తగ్గి, న్యాయ వ్యవస్థ బలహీనతలు పబ్లిక్ డొమైన్ లోకి రాకుండా చూడవచ్చు.

కానీ, న్యాయవ్యవస్థ కూడా ఈ ఆరోపణలను లైట్ తీసుకుంటున్నట్టు ఉంది. కందకు లేని దురద పెండలానికి ఎందుకనే సామెత చందంగా…. తమ ప్రతిష్ఠ కాపాడుకోవడం పట్ల న్యాయ వ్యవస్థ కే లేని ఆసక్తి…. ఇతరులకు మాత్రం ఎందుకుంటుంది?

భోగాది వేంకట రాయుడు
medhomadhanam@gmail.com

LEAVE A RESPONSE