Suryaa.co.in

Andhra Pradesh

ఈ దుర్మార్గానికి నువ్వు కారణం కాదా జగన్?

-అంతా నేనే కట్టానంటూ సొల్లు కబుర్లు చెబుతావా?
– వైసీపీ నేతలు బుడమేరు అంతా ఆక్రమణలు చేసి, పందికొక్కుల్లా పంచుకుతున్నారు
– తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా

మైలవరం: ఐదేళ్ల వైసీపీ పాలనలో పనులు నిలుపుదల చేసి, ఇవాళ వరదలకు కారణమయ్యారు… ఈ దుర్మార్గానికి నువ్వు (జగన్) కారణం కాదా? అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నిలదీశారు.

శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ కవులూరు (శాంతి నగర్) వద్ద బుడమేరు కాలువ గండ్లను పూడ్చే పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఇంత నష్టం జరిగింది నీ తప్పుడు నిర్ణయాల వల్లే కాదా? నీ అహంకార పూరిత నిర్ణయాల వల్లే కాదా? నీ మూర్ఖపు నిర్ణయాల వల్లే కాదా? ప్రజలు ఏం పాపం చేశారని జరిగే పనులను ఆపేశావ్? అంటూ వైసీపీ పార్టీ నేతలు, జగన్, ధ్వజమెత్తారు.

జగన్ రెడ్డి కల్లబొల్లి ఏడుపులు ఏడుస్తూ.. విజయవాడ వచ్చి మాయ మాటలు చెప్తున్నాడన్నారు. బుడమేరు గేట్లు ఎవరో వచ్చి ఎత్తేసి పారిపోయారని..? అని జగన్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. విజయవాడ మహానగరంలో బుడమేరు ఛానల్ మొత్తం ఆక్రమణలు చేసి, బిల్డింగులు మీద బిల్డింగులు కట్టి లక్షల రూపాయలకు వైసీపీ నేతలు అమ్మేసారని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో సైకో ప్రభుత్వం వచ్చింది.. పనులు ఆగాయన్నారు.

విజయవాడ కరకట్ట గోడలు నువ్వు నిర్మాణం చేశావా? చంద్రబాబు ప్రభుత్వం నాడు 2.3 కిలోమీటర్ల మేర కరకట్ట గోడ నిర్మించింది. వందల కోట్లతో ఆ నిర్మాణం చేపట్టామని గుర్తు చేసారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలు ధర్నాలు చేస్తే మళ్లీ పనులు ప్రారంభించారన్నారు. గత ప్రభుత్వాలు రిటైనింగ్ వాల్ గురించి పట్టించుకోకపోతే చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కానీ నువ్వు… అంతా నేనే కట్టానంటూ సొల్లు కబుర్లు చెబుతావా?” అంటూ ఉమా నిప్పులు చెరిగారు.

స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే జిల్లా కలెక్టరేట్ లో బస చేసి యంత్రాంగాన్ని పరుగులు తీయిస్తున్నారని ఉమా వివరించారు. జేసీబీ పైనే 22 కిలోమీటర్లు ప్రయాణం చేసి బాధితులకు ధైర్యం చెప్పారని వెల్లడించారు. బుడమేరు శాశ్వత పరిష్కారానికి సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు

LEAVE A RESPONSE