– ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
– బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ : ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ లంచాలకు అడ్డాగా మారింది. గతంలో కానిస్టేబుల్, ఎస్సై, సీఐ లంచాలు తీసుకోవాలంటే భయపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇటీవల కరీంనగర్ జమ్మికుంట పీఎస్ కు చెందిన సీఐ రూ. 3 లక్షల లంచం తీసుకున్నారంటూ ఓ బాధితుడి ఆడియో వైరల్ అయింద ’ ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు.
తన సొంత నియోజకవర్గం గోషామహల్ పరిధిలోని సాయినాథ్ గంజ్ పీఎస్ ఇన్స్ పెక్టర్ బాబూ చౌహాన్, ఒక కేసులో నిందితుడి పేరును తొలగించడానికి రూ. 50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారని తెలిపారు. ఈ ఏడాది ఎంతో మంది పోలీసు అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారన్నారు.
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన, సమాజానికి అండగా నిలవాల్సిన పోలీసులు ఇలా లంచాలు తీసుకుంటే ప్రజలకు న్యాయం ఎలా దొరుకుతుందని, లంచాలు తీసుకునే అధికారులను విధుల నుంచి శాశ్వతంగా తొలగించేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.