– జగన్ కేసులో అప్రూవర్ కావాలని చాలామంది ఒత్తిడి చేశారు
– నా రాజీనామాతో కూటమికే లాభం
– న్యూస్ చానెల్ పెట్టే అంశం పై పునరాలోచన
– బీజేపీ నుంచి ఎలాంటి హామీ లేదు
– వివేకా హత్యపై గుచ్చిగుచ్చి అడగవద్దు
– వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా
– నాకెలాంటి వ్యాపారాలు లేవు
– మీడియాతో విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: పిల్లల సాక్షిగా కాకినాడ పోర్టు వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని ఎంపి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తన రాజీనామా కూటమికే లాభమని, వివేకానందరెడ్డి హత్య సమాచారం అందిన వెంటనే తాను అవినాష్‌రెడ్డికి ఫోన్ చేశాననన్నారు. అయితే ఆయన ఆ ఫోన్ మరెవరికో ఇచ్చారని, ఆ వ్యక్తి వివేకా గుండెపోటుతో మృతి చెందారని చెప్పారని, తాను కూడా మీడియాకు అదే చెప్పానన్నారు. ఇక దానిపై గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేయవద్దన్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఎంపి పదవికి రాజీనామా చేశారని, మరో రెండు రోజుల్లో పార్టీకి రాజీనామా చేస్తానన్నారు. రాజీనామాపై జగన్‌తో మాట్లాడానని, గవర్నర్, బీజేపీలో చేరికపై బీజేపీ నుంచి ఎలాంటి హామీ రాలేదని స్పష్టం చేశారు. తన ఎంపి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వైసీపీ అధినేత జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని తనపై ఎంతోమంది ఒత్తిడి చేశారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంలో తనపై కేసు నమోదు చేశారని, లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. కేవీ రావుతో తనకు సంబంధాలు లేవని చెప్పారు. విక్రాంత్ రెడ్డిని కేవీ రావు వద్దకు తాను పంపించలేదని అన్నారు. సీఐడీ తనను విచారణకు పిలవలేదని తెలిపారు. బీజేపీ ఎంపీ పదవి గురించి కానీ, గవర్నర్ పదవి గురించి కానీ తనకు ఎవరి నుంచి ఎలాంటి హామీలు లేవని చెప్పారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటే తాను బలహీనుడిగా మారుతానని, అలాంటప్పుడు రాజీనామా చేస్తే తనను కేసుల నుంచి ఎందుకు తప్పిస్తారని ప్రశ్నించారు. న్యూస్ ఛానల్ పెట్టే అంశంపై పునరాలోచన చేస్తా. బెంగళూరు, విజయవాడలో ఒక్కొక్క ఇల్లు, వైజాగ్ లో ఒక అపార్ట్ మెంట్. ఇవే తన ఆస్తులని తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే గుండెపోటుతో చనిపోయారని మీరెందుకు అబద్ధం చెప్పారని విజయసాయిని మీడియా ప్రశ్నించింది. దీనిపై విజయసాయి స్పందిస్తూ, వివేకా చనిపోయినట్టు ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి చెప్పాడని, వెంటనే తాను ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేశానని తెలిపారు.
అవినాశ్ రెడ్డి, పక్కన ఉన్న మరో వ్యక్తికి ఫోన్ ఇచ్చారని, వివేకా గుండెపోటుతో చనిపోయారని సదరు వ్యక్తి తనకు చెప్పారని, అదే సమాచారాన్ని తాను మీడియాకు తెలియజేశానని విజయసాయి తెలిపారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని అవినాశ్ రెడ్డి మీకు చెప్పారా? అని ప్రశ్నించగా, ఈ విషయంపై గుచ్చిగుచ్చి అడగొద్దని, తాను అవినాశ్ కు ఫోన్ చేసిన మాట నిజమని, అవినాశ్ పక్కనున్న వ్యక్తికి ఫోన్ ఇచ్చిన విషయం కూడా వాస్తవమని తెలిపారు.
పదవుల కోసమో, కేసుల మాఫీ కోసమో తాను ఎంపీ పదవికి రాజీనామా చేయలేదని మాజీ ఎంపీ, వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి కారణం పూర్తిగా వ్యక్తిగతమని తెలిపారు. దైవాన్ని నమ్మే వ్యక్తిగా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తనకు తెలియదన్నారు.కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానని, దేనికీ ఎవరికీ భయపడబోనని తేల్చిచెప్పారు. రాజీనామా గురించి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో ఫోన్ లో మాట్లాడా. అన్నీ వివరంగా మాట్లాడాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, విజయసాయి రెడ్డి తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబంతో తనకు మూడు తరాలుగా అనుబంధం ఉందని, తనకు ఎన్నడూ విభేదాలు లేవని, ఆ కుటుంబానికి తాను ఎన్నడూ వ్యతిరేకంగా మాట్లాడలేదని వివరించారు. నిరంతరం తాను పార్టీ కోసమే పనిచేశానని, తన రాజీనామాపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ఆపాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
కేవీ రావుతో తనకెలాంటి పరిచయం లేదని, ఎక్కడైనా ఎదురుపడితే నమస్కారం అంటే నమస్కారం అని పలకరించుకోవడం వరకేనని తెలిపారు. ‘నా పిల్లల సాక్షిగా చెబుతున్నా. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో నాకు సంబంధం లేదు’ అన్నారు. నేడో రేపో పార్టీకి కూడా రాజీనామా చేస్తానని విజయసాయి రెడ్డి వివరించారు.
తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన రోజులు వేరు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వేరని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి, పార్టీకి తాను న్యాయం చేయలేననే భావనతోనే రాజీనామా చేశానని తెలిపారు. తనకన్నా మెరుగ్గా పనిచేసే నేత తన స్థానంలోకి వస్తే, ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశమే తప్ప, వేరే కారణం లేదన్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో నమోదైన కేసులో ఈడీ తనను ఏ2 గా చేర్చించిందని, ఆ కేసును తాను చట్టపరంగానే డీల్ చేస్తానని విజయసాయి రెడ్డి వివరించారు.