Suryaa.co.in

Editorial

సాయిరెడ్డి నిష్క్రమణ వెనక?

  • కోటరీ పెత్తనంతో తగ్గిన ప్రాధాన్యం

  • తారకరత్న మృతి తర్వాత సాయిరెడ్డిపై జగన్ అపనమ్మకం

  • విజయవాడకు దూరంగా విజయసాయిరెడ్డి

  • మళ్లీ ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఇచ్చి బుజ్జగించిన జగన్

  • అయినా విజయసాయిలో తగ్గని అసంతృప్తి

  • కాకినాడ పోర్టును కెవిరావుకు ఇచ్చేసిన విజయసాయి బందువు కంపెనీ

  • పోర్టు అప్పగింత వ్యవహారం వ్యూహాత్మకమేనా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీలో ఒకప్పుడు అధినేత జగన్ తర్వాత బలంగా వినిపించిన పేరు వేణుంబాక విజయసాయిరెడ్డి. జైలులో జగన్ సహనిందితుడిగా కలసి ఉన్న విజయసాయిరెడ్డికి, పార్టీ అధినేత జగన్ తొలుత అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆ దన్నుతోనే ఆయన ఉత్తరాంధ్రను దున్నేశారు. కలెక్టర్లు, కమిషనర్లు, జేసీలు, ఐజీలు.. ఇలా విజయసాయి ఎవరిని సిఫార్సు చేస్తే వారికి పోస్టింగులిచ్చిన వైభవం ఆయనది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరిపై ఇష్టం వచ్చినట్లు ట్వీట్ చేసిన ఆయన వైసీపీకి అస్త్రంలా మారారు. అలాంటి విజయసాయి.. ఇప్పుడు రాజకీయాలపై వైరాగ్యం ఏర్పడి, పార్టీ-ఎంపీకి జమిలిగా రాజీనామా చేయడం వైసీపీ వర్గాలను విస్మయపరిచింది.

అయితే జగన్ చుట్టూ సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిధున్‌రెడ్డి, తలశిల రఘురాం ఎప్పుడైతే కోటరీగా ఏర్పడ్డారో.. అప్పటినుంచే పార్టీలో విజయసాయి ప్రభ మసకబారటం మొదలయింది. నియామకాలు-సలహాల విషయంలో విజయసాయి సిఫార్సులను పక్కనపెట్టి, జగన్ కోటరీ మాటలకే ప్రాధాన్యం ఇవ్వడంతో విజయసాయి విసిగిపోయారు.
నిజానికి సజ్జల-విజయసాయికి తొలినుంచీ వైరం ఉంది. విజయసాయి జై ల్లో ఉన్నప్పుడు, ఆయన న్యాయవాదులు కూడా జగన్‌తోపాటు ఢిల్లీ నుంచే వచ్చేవారు. అయితే అప్పుడు సాక్షి మీడియా వ్యవహారాలు, తెలంగాణ వైసీపీ వ్యవహారాలు చూసిన సజ్జల.. ఢిల్లీ నుంచి వచ్చే విజయసాయి న్యాయవాదులను వద్దని చెప్పి, హైదరాబాద్ న్యాయవాదులనే ఇచ్చిన వైనం, విజయసాయిని మనస్తాపానికి గురిచేసింది.

దానితో ఆయన అప్పట్లో జైలులో తనను కలిసేందుకు వచ్చిన సన్నిహితులతో.. ‘‘అన్నీ షిర్డిసాయిబాబానే చూసుకుంటారు. నేను ఎవరికోసం అయితే జైల్లోకి వచ్చానో ఆయన చుట్టూ ఇలాంటి మనుషులు చేరార’’ంటూ ఆవేదన వ్యక్తం చేసేవారన్న ప్రచారం జరిగింది.

తర్వాత ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఉన్న సమయంలో.. విజయసాయిపై ‘మానసిక బలహీనతలకు సంబంధించి’ పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. జగన్ భార్య భారతీరెడ్డి సిఫార్సుతో ఆయనను మార్చి, మళ్లీ సుబ్బారెడ్డికి ఇన్చార్జి పదవి ఇవ్వడం కూడా సాయిరెడ్డికి మనస్తాపం కలిగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేవదాయ శాఖ అధికారిణి శాంతి వ్యవహారం పార్టీని ఇబ్బందిపెట్టిన విషయం తెలిసిందే. తన భార్య శాంతికి పుట్టిన బిడ్డ తనది కాదని, ఆ బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అంటూ ఆమె భర్త చేసిన ఆరోపణ అటు సాయిరెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠను దారుణంగా దెబ్బతీసింది.

ప్రధానంగా ఒంగోలులో మాజీ మంత్రి, జగన్ బంధువయిన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి నిష్క్రమించేందుకు, విజయసాయిరెడ్డి కారణమంటూ.. సుబ్బారెడ్డి చేసిన ఫిర్యాదు కారణంగానే, విజయసాయిని అక్కడి నుంచి ఇన్చార్జిగా తప్పించారని పార్టీ నేతలు చెబుతున్నారు. తన జిల్లాల్లో విజయసాయి జోక్యం చేసుకోవడం, తన రాజకీయ ప్రత్యర్ధి బాలినేనికి విజయసాయి మద్దతునివ్వడమే సుబ్బారెడ్డి ఫిర్యాదుకు ప్రధాన కారణమంటున్నారు. ప్రకాశం జిల్లాలో పార్టీ నేతలను విజయసాయిరెడ్డే బయటకు వెళ్లిపొమ్మని ప్రోత్సహిస్తున్నారంటూ సుబ్బారెడ్డి, పార్టీ అధినేతకు ఫిర్యాదు చేశారన్న ప్రచారం జరిగింది.

కాగా నటుడు తారకరత్న చనిపోయిన సందర్భంలో విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరించినప్పటి నుంచే, విజయసాయి ప్రాధాన్యం తగ్గించడం మొదలయిందంటున్నారు. తర్వాత అప్పట్లో జగన్‌పై యుద్ధం ప్రకటించిన ఏబీఎన్ అధినేత రాధాకృష్ణతో, సాయిరెడ్డి సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని, ఫోన్లు లేకుండా ఒంటరిగా ఆటోలో వెళ్లి రాధాకృష్ణను కలసి.. సీఎంఓ, నాటి ఇంటలిజన్స్ అధికారిపై వార్తలు రాయిస్తున్నారన్న ఫిర్యాదు వెళ్లింది. ఆ సమయంలో సీఎంఓపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యతిరేక వార్తల వెనుక, విజయసాయి ఉన్నారంటూ అటు సీఎంఓ కూడా జగన్‌కు ఫిర్యాదు చేసింది. దానితో జగన్ ఆయనను అనుమానించడం ప్రారంభించారంటున్నారు. అయితే సీఎంఓకు సంబంధించిన కొన్ని వార్తలను నాటి సలహాదారు కూడా ఏబీఎన్‌కు లీక్ చేసేవారన్న ప్రచారం కూడా జరగకపోలేదు.

దానికి తోడు సజ్జల, సుబ్బారెడ్డి, మిధున్‌రెడ్డి, తలశిల రఘురామ్ కోటరీగా ఏర్పడి, జగన్‌ను ఆ అంశంలో తప్పుదోవపట్టించారన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరిగింది. అయితే కోటరీ పితూరీలు విని, పార్టీలో జరుగుతున్న వాస్తవాలు జగన్ తెలుసుకోలేకపోతున్నారని.. సాయిరెడ్డి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవారంటున్నారు.

అదీగాక సుబ్బారెడ్డికి రాజ్యసభ ఎంపి ఇచ్చిన తర్వాత, తన ప్రాధాన్యతను గణనీయంగా తగ్గించటం కూడా సాయిరెడ్డి అసంతృప్తికి ప్రధాన కారణమంటున్నారు. పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న తనను తొలగించి.. దానిని మిధున్‌రెడ్డికి అప్పగించడం, రాజ్యసభలో ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న తనను పక్కనపెట్టి, సుబ్బారెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని సాయిరెడ్డి జీర్ణించుకోలేపోయారన్న చర్చ అప్పట్లో పార్టీ వర్గాల్లో జరిగింది.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తనను కరివేపాకులా వాడుకున్న జగన్, కోటరీ మాటలు విని అధికారం కోల్పోయిన తర్వాత.. తనను పక్కనపెట్టడంపై, అనేకసార్లు తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవారంటున్నారు. జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఆయనపై ఈగవాలకుండా.. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసిన విజయసాయికి ప్రాధాన్యం తగ్గించడంపై, అటు సీనియర్ నేతలు కూడా అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదిలాఉండగా.. విజయసాయి నిష్క్రమణ వ్యూహాత్మకంగానే జరిగినట్లు కనిపిస్తోంది. కొద్దిరోజుల ముందే కాకినాడ పోర్టు అధిపతి కెవి రావును బెదిరించి తీసుకున్న షేర్లు, డబ్బును తిరిగి విజయసాయి బంధువు కంపెనీ అయిన అరబిందో తిరిగి ఇచ్చేసింది. ఈడీ కేసు నేపథ్యంలో కేంద్రంలోని ప్రముఖుల మధ్యవర్తిత్వంతోనే ఈ డీల్ జరిగిందన్న ప్రచారం జరిగింది. అది జరిగిన కొద్దిరోజులకే సాయిరెడ్డి తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు వె ల్లడించడం ప్రస్తావనార్హం. అంటే సమస్యలన్నీ పరిష్కరించుకున్న త ర్వాతనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

LEAVE A RESPONSE