Suryaa.co.in

Andhra Pradesh

సాయిరెడ్డి..దోచేసిన నల్ల డబ్బుతో సేద్యం చేస్తావా?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం ప్రకటనపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పందించారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందన్నారు. సేద్యం చేస్తానంటున్నావ్ .. దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా ఏంటి? ఇప్పుడు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని ప్రశ్నించారు.

2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏ 2 గా సకల పాపాలు చేశావని, గత ఐదేళ్లు అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్‌గా నిలిచి ఏ 2 స్థానాన్ని కొనసాగించావని విమర్శించారు. పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్టా అని నిలదీశారు. ముందు అప్పుడు దోచుకున్న రూ.43 వేల కోట్లతో పాటు, మొన్న ఐదేళ్లలో జగన్‌తో కలిసి దోచేసిన లక్ష కోట్ల రూపాయల ప్రజల సొత్తు బయటపెట్టు. దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు. అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉందని అన్నారు.

చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అంతేనా.. లేక నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఈ రాజీనామాల పరంపర ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదని, రాత్రికో, రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కరలేదంటూ సోమిరెడ్డి ట్వీట్‌లో స్పందించారు.

జగన్ రెడ్డి, సాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా: మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందిస్తూ ఇది జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. జగన్ కు తెలిసే అంతా జరుగుతుందన్నారు. వీళ్లిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడుతున్న నాటకం ఇదంతా అని ఎక్స్ వేదికగా విమర్శించారు.

చంద్రబాబుతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవు అని విజయసాయి అంటే నమ్మేంత పిచ్చోళ్లు ప్రజలు కాదని, చంద్రబాబును విజయసాయి అన్న ప్రతి మాట తమకు ఇంకా గుర్తుందని అన్నారు. చేసినవి అన్నీ చేసి ఈ రోజు రాజీనామా చేసి వెళ్లిపోతా అంటే కుదరదన్నారు. మీరు చేసిన భూకబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో నువ్వు చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాలన్నారు. విజయసాయిరెడ్డికి దేశం విడిచి వెళ్లడానికి సీబీఐ అనుమతి ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబుని, ఆయన కుటుంబ సభ్యులను విజయసాయిరెడ్డి అన్న మాటలు ఎవరు మర్చిపోయినా, నేను మరచిపోనని బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయి ఎన్ని నాటకాలు ఆడినా ఎవరు క్షమించినా తాను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

విజయసాయిపై టీడీపీ నేతలు కుట్రలు: మాజీ మంత్రి కాకాణి

తమ పార్టీలో విజయసాయి రెడ్డి కీలక నేత అని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. జగన్ సీఎం కావాలని ఆయన కలలు కన్నారని, ఇప్పుడు రెండోసారి జగన్ ను సీఎం చేసేందుకు పని చేస్తున్నారని అన్నారు. విజయసాయిపై కొందరు టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారని ఆరోపించారు. విజయసాయిపై ఎన్ని కుట్రలు చేసినా, ఆయన చలించకుండా కుట్రలను ఎదుర్కొన్నారని కాకాణి తెలిపారు. విజయసాయి నిర్ణయంపై పూర్తి వివరాలు తెలుసుకున్నాక స్పందిస్తామని అన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయం తీసుకుని ఉంటే, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతామని చెప్పారు.

రాజీనామా చేయవద్దని విజయసాయిని తాను కోరా: వైసీపీ ఎంపీ గురుమూర్తి

రాజ్యసభ ఛైర్మన్ ను కలవడానికి ముందే విజయసాయి నివాసానికి వైసీపీ ఎంపీ గురుమూర్తి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో గురుమూర్తి మాట్లాడుతూ, రాజీనామా చేయవద్దని విజయసాయిని తాను కోరానని చెప్పారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పడం లేదని తెలిపారు. ఏవైనా చిన్నిచిన్ని లోపాలు, సమస్యలు ఉంటే చర్చించుకుని పరిష్కరించుకుందామని చెప్పానని వెల్లడించారు. 2029 ఎన్నికల్లో అందరం కలిసి పోటీ చేసేందుకు సమాయత్తమవుదామని చెప్పానని తెలిపారు. పార్టీలోకి తిరిగి రావాలని, రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని చెప్పారు.

 

LEAVE A RESPONSE