Suryaa.co.in

Editorial

ఆంధ్రుల సాక్షిగా అంతా అబద్ధమే చెబుతాం… నిజం చెప్పం!

– తుస్సుమన్న జగన్ మేనిఫెస్టో
– మద్యనిషేధ హామీతోనే ఎత్తిపోయిన నమ్మకం
– మద్యనిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతానన్న జగన్
– భగవద్గీత-ఖురాన్-బైబిల్‌పై ప్రమాణం
– సీపీఎస్‌పై మొదలైన మోసం మద్యపాన నిషేధం వరకూ
– జగన్‌కు తెలియక సీపీఎస్‌పై హామీ ఇచ్చారన్న సజ్జల
– మెగా డీఎస్సీపై నాలుకమడతేసిన జగన్
– అటకెక్కిన అవుట్‌సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్
– పోలవరంపై పనిచేయని జగన్, మంత్రుల కాకిలెక్కలు
– మేనిఫెస్టోను జనం నమ్మరంటున్న వైసీపీ అభ్యర్ధులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘భగవద్గీతపై ఒట్టేసి అంతా నిజమే చెబుతా.అబద్ధం చెప్పను’ ఇది కోర్టులో ప్రమాణం చేసే సందర్భం.
‘భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా అంతా అబద్ధమే చెబుతాం. నిజాలు అసలు చెప్పం’
– ఇది వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తాజా తన పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన సందేశం.
తమ అధినేత జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో చూసి వైసీపీ శ్రేణులే పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే.. గతంలో ఇచ్చిన హామీలే 80 శాతం వరకూ నెరవేర్చలేదు కాబట్టి.

‘‘సంపూర్ణమద్యనిషేధం చేసిన తర్వాతనే మళ్లీ మిమ్మల్ని ఓట్లు అడుగుతా. కేవలం దానిని స్టార్‌హోటళ్లకే పరిమితం చేస్తా. నా అక్కషెల్లెమ్మలు షిక్కటి షిరునవ్వులు షిందించాలి’’ అని గత ఎన్నికల ముందు చేసిన జగన్ చేసిన వాగ్దానం. అటెకెక్కింది. మద్యపాన నిషేధం చేస్తానని భగవద్గీత-బైబిల్-ఖురాన్‌పై ఒట్టేసి, ఎన్నికలకు వెళుతున్న జగన్‌కు వాటిపై ప్రమాణం చేసే నైతక అర్హత ఎక్కడిదన్నది విపక్షాల ప్రశ్న.

పైగా గత ప్రభుత్వంలో కంటే రేట్లు పెంచి, నాసిరకం మద్యం జనంలోకి వదిలారు. తన పార్టీ ‘పెద్దరెడ్లకు’ డిస్టలరీస్ అప్పగించి, చెన్నై తమ్ముడు అనిల్‌రెడ్డి ఆధ్వర్యాన వేల కోట్ల ఆదాయం జేబులోకి మళ్లించారన్న విపక్షాల ఆరోపణకు, ఇప్పటిదాకా జవాబు ఇచ్చే ధైర్యం చేయలేకపోయారు. అదొక్కటే కాదు. సంక్షేమపథకాలకు మద్యం ఆదాయమే ప్రధాన మార్గంగా మార్చారు.

మద్యనిషేధం చేస్తామని హామీ ఇచ్చి.. మద్యం తాగాలని కోరిక లేకుండా షాక్ కొట్టేంత ధరలు పెంచామని అసెంబ్లీలో చెప్పి.. చివరకు మద్యనిషేధం లేకుండానే ఎన్నికలకు వెళుతున్న తమను, ప్రజలు ఎలా నమ్ముతారని వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ‘పైన జగన్ సార్ ఏవో హామీలిస్తారు. దాని అమలుకోసం ప్రతిపక్షాలు నిలదీస్తాయి. ఇవన్నీ కింద స్థాయిలో పనిచేసే మాకు శిక్షలాంటివి. వాటిని అనుభవించేది మేమే. ఇప్పుడు మహిళలు మద్యనిషేధం ఏమైందని మమ్మల్ని నిలదీస్తుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోంది’’ అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధులు వాపోతున్నారు.

గత ఎన్నికల ప్రచారంలో తామంతా అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను సమీకరించి.. వారిని పాదయాత్రకు వచ్చిన జగనన్న దగ్గరకు తీసుకువెళ్లిన రోజులను వైసీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. అప్పుడు వాళ్ల ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. వాళ్లు కూడా నిజమేననుకుని మాకు ఓట్లేశారు. ఇప్పడు ఐదేళ్లయింది. ఇంతవరకూ వాళ్లను పర్మినెంట్ చేయలేదు. వాళ్లేమో మేం ఎదురుపడినప్పుడల్లా మా సంగతేమిటని నిలదీస్తున్నారు. మరి వాళ్లు జగనన ఎన్ని కబుర్లు చెప్పినా, మళ్లీ మా పార్టీకి ఎందుకు ఓటేస్తారు’’ అని వైసీపీ కార్యకర్తలు తలపట్టుకుంటున్నారు.

గతంలో చంద్రబాబునాయుడు పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగులను చాలా గౌరవించారు. వారానికి ఐదురోజులే పని కల్పించారు. భయంతో పెద్దగా పనులు కూడా చెప్పలేదు. తెలంగాణ కంటే ఐఆర్ ఎక్కువ ఇచ్చారు. ఎప్పుడు కావాలంటే ఉద్యోగ సంఘాల నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అయినా సరే.. ఇంకా ఏదో చేస్తారన్న అత్యాశతో జగన్‌కు రెండుచేతులతో ఓట్లేసినందుకు తమ చెప్పుతో తామే కొట్టుకోవాలని ఉద్యోగ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి.

‘‘ జగన్ వచ్చిన తర్వాత మమ్మల్ని అసలు దేకడమే మానేశారు. మాకు మహా అయితే ఈ ఐదేళ్లలో నాలుగైదుసార్లు అపాయింట్‌మెంట్ ఇస్తే గొప్ప. సజ్జలతో మాట్లాడమనేవారు. మా సమస్యలు ఆలకించే దిక్కులేదు. ఇన్నేళ్ల చరిత్రలో ఉద్యోగులు-ఉద్యోగ సంఘ నాయకులను పురుగులకంటే హీనంగా చూసిన పరిస్థితి ఎప్పుడూ లేదు. చివరకు మేం అమ్ముడుపోయే నాయకులుగా ముద్రపడింది. దానివల్ల ఒకరిద్దరు నేతలు బాగుపడ్డారేమోకానీ, మిగిలిన నేతలంతా జగన్‌కు అమ్ముడుపోయారన్న అపవాదును మాత్రం మూటకట్టుకోవలసి వచ్చింది’’ అని ఓ ఉద్యోగ సంఘ నేత ఆవేదన వ్యక్తం చేశారు.

ఈసారి ఉద్యోగులలో 5 శాతం ఓట్లు కూడా తమకు రావని, వైసీపీ నేతలు ఖండితంగా చెబుతున్నారు. చంద్రబాబు 43 శాతం పీఆర్సీ అమలు చేస్తే, జగన్ కేవలం 23 శాతమే ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. బాబు సర్కారులో అంగన్వాడీలకు 6,300 పెంచితే, జగన్ కేవలం వెయ్యి రూపాయలే పెంచితే, మా పార్టీపై వారికి ఎలా కృతజ్ఞత ఉంటుందని వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు.

‘‘అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్ హామీ అమలుకాకపోవడంతో, ఉద్యోగవర్గాలన్నీ పార్టీకి దూరమయ్యాయి. దాని ఫలితం మేం అనుభవిస్తున్నాం. ఉద్యోగులను ధైర్యంగా ఓటు అడగలేని దుస్థితి. జగన్ సంగతి వదిలేయండి. మాకు ఓటేయండి అని అడుక్కోవలసి వస్తోంద’ని గుంటూరు జిల్లా వైసీపీ అభ్యర్ధి ఒకరు వాపోయారు. ఉద్యోగులు కూడా పోలింగ్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న కసి తమకు స్పష్టంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు వైసీపీ అభ్యర్ధులందరి మానసిక పరిస్థితి ఇదే.

ఇక తమ అధినేత జగన్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో.. ప్రధానమైనవి నెరవేర్చకుండానే కొత్త మేనిఫెస్టో విడుదల చేయడం వల్ల, ప్రజలు దానిని నమ్మే పరిస్థితి లేదని వైసీపీ అభ్యర్ధులే తెల్లముఖమేస్తున్నారు. గత ఎన్నికల ముందు 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ హామీ ఇచ్చి దానిని అటకెక్కించారు. పైగా బాబు హయాంలో నెలకు 200-300 రూపాయలొచ్చే కరెంట్ బిల్లు, ఇప్పుడు జగన్ జమానాలో 1500 నుంచి 2 వేలకు చేరి, షాక్ కొడుతున్న పరిస్థితిని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు.

ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని జగన్ మాట తప్పారు. ప్రత్యేకహోదాతో ఉద్యోగాల విప్లవం తీసుకువస్తానన్న జగన్, అది కూడా సాధించలేదన్న అసంతృప్తి నిరుద్యోగుల్లో ఉంది. 2021 లోగా రాయలసీమ ఉక్కుఫ్యాక్టరీ తెస్తామన్న హామీ, 2021 డిసెంబర్ లోగా పోలవరం పూర్తిచేస్తామన్న రెండు ప్రధాన హామీలు నెరవేర్చకపోవడం.. అటు రాయలసీమ వాసులు, ఇటు కోస్తా-ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయింది. ఇక సచివాలయ ఉద్యోగాలు కాకుండా, 2 లక్షల 30 వేల ఉద్యోగాలిస్తామన్న జగన్ హామీ నీరుగారిపోవడంతో నిరుద్యోగులు వైసీపీపై భగ్గుమంటున్న పరిస్థితి.

బస్సు చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చి దానిని నాలుగుసార్లు పెంచడం, 23 వేల పోస్టులతో మెగా డీఎస్పీ ఇస్తామన్న హామీ తప్పడం, కరెంటు చార్జీలు తగ్గిస్తానని 9 సార్లు పెంచడంతో, సామాన్య-మధ్య త రగతి వర్గాలు వైసీపీకి దూరమైన వైనం. ప్రధానంగా కరెంటు బిల్లులు సామాన్య-మధ్య తరగతి వర్గాలకు షాక్ కొడుతున్నాయి.

మిగిలిన రాష్ట్రాల కంటే.. పెట్రోలు-డీజిల్ ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చిన జగన్.. మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ చార్జీలు వసూలు చేయడం, వాహనదారుల అసంతృప్తికి కారణమయింది. ఫలితంగా అనంతపురం, నెల్లూరు, కడప జిల్లా వాసులు తమ సరిహద్దుల్లోని కర్నాటక-తమిళనాడు, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి, పెట్రోల్-డీజిల్ పోయించుకుంటున్న పరిస్థితి. చివరకు ఆర్టీసీ కూడా, ఆ రాష్ట్రాల్లో డీజిల్ కొట్టించుకుంటున్న వైచిత్రి. ఇవన్నీ ప్రజల్లో తమ పార్టీకి మైనస్ మార్కులేనన్నది వైసీపీ అభ్యర్ధులు అంగీకరిస్తున్నారు.

కులానికో కార్పొరేషన్ పెడతామని చెప్పి వాటిని ఏర్పాటుచేసినప్పటికీ, చైర్మన్లు-డైరక్టర్లకు ఆఫీసులు లేవు. అవి ఉన్న చోట కూర్చోడానికి కుర్చీలు లేని విషాదం. ఇది బీసీ, ఎస్సీలకు అవమానకరమైన అంశమే. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు, మైనారిటీలకు 5 లక్షల ఉచిత రుణం, 30 లక్షలు కట్టి తాళాల గుత్తి వారి చేతుల్లో పెడతానన్న హామీ, టిడ్కో ఇళ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానన్న హామీ, నియోజకవర్గానికో అనాధ ఆశ్రమం, నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్, 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, చిన్న-సన్నకారు రైతులకు ఉచిత బోర్లు, 2021 లోగా విశాఖ రైల్వే జోన్ హామీలన్నీ జగన్ అటకెక్కించారన్న ఆగ్రహం, పేద-సామాన్య-మధ్యతరగతి వర్గాల్లో బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు వైసీపీ అభ్యర్ధుల ఆందోళన కూడా అదే.

‘‘ఇన్ని హామీలు నెరవేర్చకుండా మళ్లీ జనంలోకి ఎలా వెళ్లాలో మాకు అర్ధం కావడం లేదు. జగన్ సారయితే జనంలోకి రారు. వాళ్లముందుకు వెళ్లాల్సింది మేమే. ఇప్పటికే కరెంటు చార్జీలు, చెత్తపన్నుపై మహిళలు మమ్మల్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కాలనీలు, పేదలుండే ప్రాంతాల్లో అయితే మద్యనిషేధం గురించి మహిళలు ప్రశ్నిస్తుంటే, వారికి సమాధానం చెప్పలేక అల్లాడిపోతున్నాం. మళ్లీ ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టో ప్రకటిస్తే, ప్రజలు వాటినెందుకు నమ్ముతారు? పాతవే నెరవేర్చలేదు. మళ్లీ కొత్త హామీలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో మేం ఓటర్ల ముందుకెళ్లి, దణ్ణం పెట్టడం తప్ప చేసేదేమీలేద’’ని వైసీపీ అభ్యర్ధులు తలపట్టుకుంటున్నారు.

బాదుడే బాదుడు..

  • చెత్త పన్ను విధింపు
  • ఇంటి పన్ను పెంపు
  • రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
  • ఆస్థి పన్ను పెంపు
  • ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
  • పీజీ విద్యార్థులకు ఫీ రీయింబర్స్ మెంట్ కట్
  • అన్నా క్యాంటిన్ రద్దు
  • నూలు సబ్సిడీ కట్
  • కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్
  • దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్
  • మత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
  • మత్సకారులకు కొనుగోలు పై సబ్సిడీ కట్
  • కుమ్మరులకు మట్టి హక్కులు కట్
  • రాతి పై హక్కులు కట్
  • రజకులకు చెరువుల హక్కులు కట్
  • గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్
  • గిరిజనుల కు కలప పై హక్కులు కట్
    రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
  • సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
  • విద్యోన్నతి కట్
  • నిరుద్యోగ భృతి కట్
  • సంక్రాతి కానుక కట్
  • రంజాన్ తోఫా కట్
  • క్రిస్మస్ కానుక కట్
  • డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్

LEAVE A RESPONSE