Suryaa.co.in

Editorial

అడుగు ముందుకు పడని అసెంబ్లీ కమిటీలు

  • ఎనిమిదినెలలయినా ఏర్పడని అసెంబ్లీ కమిటీలు

  • మండలిలో వైసీపీ బలమే దానికి కారణమా?

  • మండలికి ప్రాతినిధ్యం ఉంటే వైసీపీకీ ఇవ్వాల్సిందేనా?

  • మండలి చైర్మన్ కంటే అసెంబ్లీ స్పీకరే సుప్రీమ్ కదా?

  • మధ్యే మార్గంగా అసెంబ్లీ వరకూ కమిటీలు ప్రకటించే అవకాశం

  • అయినా దానిపై దృష్టి సారించని స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్

  • పార్టీ ఆఫీసు, మంత్రి కేశవ్ చూసుకుంటారని ఇప్పటివరకూ జాప్యం

  • గతంలో యనమల, కోడెల రూపొందించిన కమిటీలే ఆమోదం

  • ఆ చొరవ నేడు ఏదంటున్న ఎమ్మెల్యేలు

  • లోకేష్‌కు చెప్పి చేద్దామంటున్న చీఫ్ విప్ ఆంజనేయులు

  • ఇవి కూడా లోకేష్‌కు చెప్పి ఆయన సమయం తినేయాలా అంటున్న ఎమ్మెల్యేలు

  • అసెంబ్లీ పనులు కూడా బాబు-లోకేష్ చూడాలా అంటున్న సీనియర్లు

  • స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్‌ల మధ్య సమన్వయ లోపమే ఆలస్యానికి కారణమా?

  • సెక్రటరీ జనరల్ చొరవ తీసుకోరా?

  • సత్యనారాయణ, నర్శింహాచార్యుల పాటి చొరవ ఏదంటున్న సీనియర్లు

  • బాబుతో నేరుగా మాట్లాడే చొరవ ఏదంటున్న ఎమ్మెల్యేలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

శాసనసభ-శాసనమండలికి కమిటీలు ప్రాణం. వివిధ అంశాలపై అధ్యయనం చేసి, వాటిని సభకు సమర్పించే కమిటీలది కీలకపాత్ర. వీటి కాలపరిమితి రెండేళ్లు. అసెంబ్లీ నుంచి ఎక్కువ కమిటీలు ఉండగా, కౌన్సిల్ సభ్యులకు జాయింట్ కమిటీలో ఆ నిష్పత్తిలో స్థానం దక్కుతుంటుంది. అంటే ఒక కమిటీలో 10 మంది సభ్యులుంటే.. అందులో ఏడుగురు శాసనసభ నుంచి, ముగ్గురు మండలి నుంచి కమిటీలకు ఎన్నికవుతుంటారు. ఏపీలో అసెంబ్లీ ఏర్పడి ఎనిమిది నెలలు దాటుతోంది. ఈనెలలో కీలకమైన బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. కానీ ఇప్పటివరకూ అసెంబ్లీ కమిటీలు వేయని వైనంపై ఎమ్మెల్యేలు, సీనియర్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఇవి స్పీకర్-డిప్యూటీ స్పీకర్-డిప్యూటీ స్పీకర్-శాసనసభా వ్యవహారాల మంత్రి-చీఫ్ విప్ స్థాయిలో జరిగే ప్రక్రియ. గతంలో యనమల రామకృష్ణుడు-కోడెల శివప్రసాదరావు స్పీకర్లుగా ఉన్నప్పుడు వారే కమిటీ చైర్మన్లు-సభ్యులను నియమించేవారు. ఆ ఎంపిక ప్రక్రియలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి, చీఫ్ విప్, టీడీఎల్పీ ఆఫీసు ఇన్చార్జి సురేష్, అసెంబ్లీ కార్యదర్శి భాగస్వాములయ్యేవారు. తర్వాత ఆ జాబితాను సీఎం చంద్రబాబునాయుడు ఆమోదముద్ర వేయించేవారు.

ఆ సందర్భంగా గతంలో ఎవరికైనా పదవులు రాకుండా అన్యాయం జరిగి ఉంటే, వారిని కమిటీ చైర్మన్లుగా నియమించాలని చంద్రబాబు సూచించేవారు. దానితో కమిటీలు ఖరారయ్యేవి. సూటిగా చెప్పాలంటే ఈ మొత్తం వ్యవహారంలో.. ఎవరు స్పీకర్‌గా ఉంటే వారు, టీడీఎల్పీ ఆఫీసు ఇన్చార్జి, అసెంబ్లీ కార్యదర్శి ఎవరుంటే వారు మాత్రమే కీలకపాత్ర పోషించేవారు. వీరిలో టీడీఎల్పీ ఆఫీసు ఇన్చార్జికి పార్టీ శాసనసభ్యులు, వారి గతానుభవం, సామాజిక నేపథ్యంపై పూర్తి అవగాహన ఉన్నందున.. స్పీకర్లు ఎవరున్నా ఆయనతోనే ఎంపిక ప్రక్రియ నిర్వహించేవారు. ఇది ఉమ్మడి రాష్ట్రం నుంచి వస్తున్న సాంప్రదాయమే.

కాకపోతే అప్పట్లో అమర్‌నాధ్ టీడీఎల్పీ ఆఫీసు ఇన్చార్జిగా ఉండేవారు. అసెంబ్లీ వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న అమర్‌నాధ్ సేవలను స్పీకర్లు బాగా వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆయన స్థానంలో సురేష్ వచ్చారు. ఈ మార్పు తప్ప కమిటీల ఎంపిక ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండేది కాదు. అవన్నీ దాదాపు స్పీకర్లే పూర్తి చేసేవారు.

ఈ ప్రక్రియలో సీఎం చంద్రబాబును ఎప్పుడూ భాగస్వాములను చేసిన సందర్భం లేదు. ఎందుకంటే చంద్రబాబు పార్టీ అధ్యక్షుడు-సీఎంగా బిజీగా ఉంటారు కాబట్టి. అందువల్ల తామే ఎంపిక చేసి, వాటిని బాబు పరిశీలనకు పంపితే, ఆయన కొద్దిపాటి మార్పులతో వెంటనే ఆమోదించేవారని సీనియర్లు గుర్తు చేస్తున్నారు. అంటే స్పీకర్-డిప్యూటీ స్పీకర్ తమ అధికారం-అవకాశం వినియోగించుకునేవారన్నమాట!

కానీ ప్రస్తుత వ్యవహారం అందుకు భిన్నంగా జరుగుతోందని, సీనియర్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. స్పీకర్-డిప్యూటీ స్పీకర్-శాసనసభా వ్యవహారాల మంత్రి-చీఫ్ విప్ మధ్య సమన్వయం కరవైదంటున్నారు. వీరంతా తమకెందుకు వచ్చిన తలనొప్పి. పార్టీ ఆఫీసు చూసుకుంటుందులే అన్న వైఖరితో ఉన్నారంటున్నారు. సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి, కమిటీలు పూర్తి చేయాలన్న చొరవ ఎవరికీ లేదంటున్నారు.

పార్టీ-ప్రభుత్వ పనులపై నిమిషం తీరికలేకుండా ఉండే లోకేష్‌కు చెప్పి, కమిటీలు వేద్దామని చీఫ్ విప్ ఆంజనేయులు వాదించడంపై, సీనియర్లలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ‘స్పీకర్ టీమ్ ఎంపిక చేసిన పేర్లను ఎలాగూ బాబుగారికి పంపిస్తారు. ఆయన మార్పు చేర్పులతో వాటిని ఆమోదిస్తారు. అది ఎలాగూ లోకేష్‌బాబు దగ్గరకు వెళుతుంది. అంతేగానీ లోకేష్‌కు పంపిస్తే ఆయన ఉండే బిజీలో ఈ కమిటీలే చూస్తారా? జనం సమస్యలు, శాఖల సంగతే చూస్తారా? స్పీకర్, డిప్యూటీ స్పీకర్ మంత్రి, చీఫ్ విప్ పదవులు ఇచ్చింది ఎందుకు? ఆ పనులు కూడా లోకేష్-చంద్రబాబు చేయాలా? ఇలాంటి పద్ధతి గతంలో ఎప్పుడూ లేద’ని మాజీ మంత్రి, సీనియర్ సభ్యుడుడొకరు విస్మయం వ్యక్తం చేశారు.

ఇక కమిటీల ఎంపికను పార్టీ కార్యాలయమే చూసుకుంటుందన్న కొందరి ధోరణిపై, సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ లేని సంప్రదాయాలు తీసుకువస్తున్నారని, అసెంబ్లీ కమిటీల ఎంపికపై పార్టీ ఆఫీసు ఎప్పుడూ జోక్యం చేసుకున్న దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు. ‘‘ఇవన్నీ ఒకరిపై మరొకరు తప్పించుకునే లౌక్య రాజకీయాలు, రెండేళ్ల కాలపరిమితి ఉండే ఈ కమిటీలకు ఇవన్నీ ఎందుకు’’ అని ఓ సీనియర్ సభ్యుడు ప్రశ్నించారు.

కాగా శాసనమండలిలో వైసీపీ బలం ఎక్కువగా ఉన్నందున, మండలి చైర్మన్ కమిటీల ప్రక్రియకు అడ్డుతగులుతారన్న భావన సభ్యుల్లో కనిపిస్తోంది. ఆ మేరకు ఆయన కూడా వైసీపీ నుంచి ఒకరిద్దరి పేర్లను సూచిస్తే, దానిని కూడా ఆమోదించాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఒకటి-రెండుసార్లు ఆయనకు జాబితా పంపినా ఆమోదించకపోతే, స్పీకర్ నేరుగా ఆ కమిటీ జాబితాను ప్రకటించవచ్చని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. పార్లమెంటరీ సంప్రదాయంలో రాజ్యసభ చైర్మన్‌ను గౌరవిస్తారు. కానీ అధికారాలన్నీ లోక్‌సభ స్పీకర్‌వే. అలాగే రాష్ట్ర స్థాయిలో శాసనమండలి చైర్మన్‌ను గౌరవిస్తారు. కానీ అధికారాలన్నీ స్పీకర్‌వే. కాబట్టి ఆయన తన అధికారాలు వినియోగించుకోవచ్చు’ అని ఓ సభ్యుడు గుర్తు చేశారు.

పోనీ శాసనమండలి చైర్మన్ నుంచి సాంకేతికంగా ఇబ్బందులు వస్తాయనుకుంటే.. అసెంబ్లీ కమిటీల వరకూ ప్రకటించవచ్చని మరికొందరు సీనియర్లు సూచిస్తున్నారు. అంటే జాయింట్ కమిటీలు లేని వాటిలో శాసనసభ సభ్యులతో కమిటీలను భర్తీ చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ, దానిని కూడా సద్వినియోగం చేసుకోకపోవడంపై సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అసలు ఇవన్నీ అసెంబ్లీ వ్యవహారాల్లో నిష్ణాతుడని భావించి, ఏరికోరి అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా నియమించిన ప్రసన్నకుమార్ చొరవ తీసుకుని.. పూర్తి చేయాల్సిన అంశాలని సీనియరు సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ‘సెక్రటరీ జనరల్ అని ఇప్పుడు కొత్తపేరు పెట్టారు. గతంలో అసెంబ్లీ సెక్రటరీనే ఉండేవారు. వారు చొరవ తీసుకుని సీఎం వద్దకు వెళ్లి కమిటీలపై చర్చించాలి. అంతకుముందు ఆయన స్పీకర్-డిప్యూటీ స్పీకర్-మంత్రితో చర్చించి ఆయన అభిప్రాయం తీసుకోవాలి. వాటిని సీఎం దృష్టికి తీసుకువెళ్లి, ఆయన సలహా సూచనలతో కమిటీలు వేయాలి. సీఎంకు సహజంగా సమయం ఉండదు. ఆయనకు దీనికంటే ముఖ్యమైన సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి. అయినా కమిటీల కోసం సమయం తీసుకుని వాటిని పూర్తి చేయాల్సిన బాధ్యత సెక్రటరీ జనరల్‌దే. ఇదీ పద్ధతి. కానీ సెక్రటరీ జనరల్‌కు సీఎం వద్దకు వెళ్లి, సమస్యను పరిష్కరించే చొరవ లేనట్లు దీనితో స్పష్టమవుతుంది. లేకపోతే ఎనిమిది నెలల నుంచి కమిటీలు ఎందుకు వేయలేదు? అని సీనియర్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

నిజానికి గతంలో అసెంబ్లీ ఇన్చార్జి సెక్రటరీగా ఉన్న సత్యనారాయణ, ఇలాంటి వ్యవహారాల్లో చొరవ తీసుకుని ముందుగా స్పీకర్‌తో చర్చించి, తర్వాత సీఎంకు సమస్యలు వివరించేవారు. సీఎం కూడా వెంటనే స్పందించేవారు. అసెంబ్లీ వ్యవహారాలు, సెక్షన్లపై సత్యనారాయణకు సంపూర్ణ అవగాహన ఉండేది. అందుకే ఆయన రిటైరయిన ప్పటికీ శాసనమండలికి తీసుకున్నారు.

అటు తెలంగాణలో కూడా అసెంబ్లీ కార్యదర్శి నర్శింహాచార్యులు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అలాంటి చొరవ ప్రదర్శించారు. అంటే విషయ పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉంటే ఆయనను కొనసాగిస్తారు? సీఎంల సమయం తీసుకుని మరీ అసెంబ్లీ వ్యవహారాలను వారితో చర్చించేవారు. ఇప్పుడు కూడా ఆయన అదే పద్ధతి పాటిస్తున్నారు.

ఎందుకంటే అసెంబ్లీకి సర్వాధికారి స్పీకర్ అయినప్పటికీ.. పాలనాధికారి, కార్యనిర్వహణాధికారి మాత్రం కార్యదర్శులే. వారు చొరవ తీసుకోకపోతే ఆ సమస్యలను, మరెవరూ సీఎంల దృష్టికి తీసుకువెళ్లలేరు. ఈ విషయంలో శాసనసభ కార్యదర్శులు-ఇన్చార్జి కార్యదర్శులుగా సత్యనారాయణ-నర్శింహాచార్యులు సక్సెస్ అయ్యారన్నది నిస్సందేహం.

రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య సీఎంలుగా ఉన్నప్పుడు సభ జరుగుతున్న రోజుల్లో.. అసెంబ్లీ కార్యదర్శితో ఉదయమే చర్చించేవారు. చీఫ్ విప్, శాసనసభా వ్యవహారాల మంత్రి కూడా ఆ సమావేశంలో ఉండేవారు.
కాగా.. శాసనమండలి చైర్మన్‌తో ఇబ్బందులు ఉంటే.. అసెంబ్లీ కమిటీలయినా పూర్తి చేయాలని సీనియర్లు సూచిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది నెలల సమయం వృధా అయిపోయిందని గుర్తు చేస్తున్నారు.

బడ్జెట్‌లోగా వేస్తాం: కేశవ్

కాగా అసెంబ్లీ కమిటీల ఆలస్యంపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వివరణ కోరగా.. ఈ బడ్జెట్ సమావేశాల లోపు కమిటీలు ప్రకటిస్తామన్నారు. ఆలస్యానికి కొన్ని సాంకేతిక కారణాలున్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో అందరినీ సమన్వయం చేసుకోవడం, ఏకాభిప్రాయం సాధించడం ముఖ్యమన్నారు.

LEAVE A RESPONSE