Suryaa.co.in

Andhra Pradesh

క్షమాపణ కోరిన అచ్చెన్నాయుడు

ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశమైంది. ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై వచ్చిన ఫిర్యాదుపై ప్రివిలేజ్‌ కమిటీ విచారణ జరిపింది. కమిటీ ముందు హాజరైన అచ్చెన్నాయుడు క్షమాపణ కోరారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కమిటీ విచారణ చేపట్టింది. గతంలో స్పీకర్‌ తమ్మినేనిపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అచ్చెన్నాయుడు అనుమతి లేకుండా న్యాయవాదిని తీసుకురాగా, ప్రివిలేజ్ కమిటీ అభ్యంతరం తెలిపింది.
కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు తదుపరి నిర్ణయం: కాకాణి
సమావేశం అనంతరం ప్రివిలైజ్ కమిటీ చైర్మన్‌ కాకాని గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని.. ఆయన వివరణను కమిటీ సభ్యులకు పంపిస్తామని తెలిపారు. కమిటీ సభ్యుల అభిప్రాయం మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కూన రవి అందుబాటులో లేనని సమాచారం ఇచ్చారని.. మరొక అవకాశం ఇస్తే కమిటీ ముందు హాజరవుతానని తెలిపారని కాకాణి చెప్పారు. నిమ్మగడ్డ రమేష్‌, రామానాయుడులపై 21న జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కాకాణి తెలిపారు.

LEAVE A RESPONSE