Home » ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు

ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు

‘నేను కశ్మీర్ పండితుడిని. మా కుటుంబం కశ్మీరీ పండిత కుటుంబం..’ అని జమ్ము కశ్మీర్ లో దేవాలయాలు తిరుగుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. జమ్ములో ఒక వేదిక పై నుంచి ఆయన ‘జైమాతాదీ’ అని కూడా నినాదాలు ఇస్తూ కార్యకర్తలతో కూడా నినాదాలు చేయించారు.వైష్ణోదేవీ యాత్ర కు పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. 2014లో నరేంద్రమోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాహటంగా తన విశ్వాసాల గురించి,మూలాల గురించి చెప్పుకోవాల్సిన అవసరం పలు రాజకీయ పార్టీల నాయకులకు కూడా ఏర్పడిందని రాహుల్ గాంధీ ప్రకటనలు వింటున్న వారెవరికైనా అర్థమవుతుంది. కొన్ని దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఈ దేశంలో మెజారిటీ అయిన హిందువులు అస్తిత్వ పరీక్షలో పడినందుకే వారు భారతీయ జనతా పార్టీ వెనుక సంఘటితంగా నిలిచారన్న వాదన నూటికి నూరుపాళ్లు నిజం. గత ఎన్నికలసమయంలో కూడా రాహుల్ గాంధీ తాను జందెం ధరిస్తానని,శివ భక్తుడినని చెప్పుకున్నారు.
నిజానికి ఇవాళ కశ్మీరీ పండితుడినని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ పార్టీ హయాంలోనే జమ్ము కశ్మీర్ లో వేలాది మంది కశ్మీరీ పండితుల ఊచకోత జరిగింది. బ్రిటిష్ కాలంలో కశ్మీర్ లోయలో 50 శాతంపైగా కశ్మీరీ పండితులు నివసించేవారు. దేశ విభజన సమయంలో అరాచకాల తర్వాత 20 శాతంపైగా ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లారు.నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు అక్కడి అబ్దుల్లాలతో కాళ్లబేరానికి వచ్చిన ఒప్పందాలు కుదుర్చుకోవడమే తప్ప కశ్మీర్ లో హిందువుల ప్రయోజనాల పరిరక్షణకు కాంగ్రెస్ చేసిందేమీలేదు.
నెహ్రూ హయాంలోనే కశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తిని వ్యతిరేకించిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ శ్రీనగర్ లో అరెస్టు చేసిన తర్వాత కష్టడీలోఅనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు.1975లో తండ్రిబాటలో ఇందిరగాంధీ-షేఖ్ అబ్దుల్లా ఒప్పందం తర్వాత కశ్మీరీ పండితుల ఊచకోత తీవ్రతరమైంది. రాజీవ్ గాంధీ కూడా షేఖ్ అబ్దుల్లా కుమారుడు ఫరూక్ అబ్దుల్లాతో ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత హిందువులపై హింసాకాండ మరింత పెరిగింది. మఖ్బూల్ భట్ అనే ఉగ్రవాదికి శిక్ష విధించినందుకు జస్టిస్ నీల్ కాంత్ గంజూ అనే న్యాయమూర్తిని హైకోర్టు ఆవరణలోనే కాల్చి చంపారు.
ప్రేంనాథ్ భట్ అనే జర్నలిస్టునూ హత్య చేశారు. కశ్మీరీ పండితులు జమ్ముకశ్మీర్ విడిచివెళ్లకపోతే హతమారుస్తామని హిజ్బుల్ ముజాహిదీన్ వంటిసంస్థలు స్థానిక పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చేవారు. దాదాపు 2500 హిందూ గ్రామాల పేర్లను అప్పటి ప్రభుత్వం మార్చివేసింది. 1990లలో దాదాపు 3 లక్షల మంది హిందువులు కశ్మీర్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిపోవాల్సి వచ్చింది. ఇవాళ కశ్మీరీ పండితులు తమ దేశంలో తాము శరణార్థులుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వీటన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ అసమర్థ, అస్తవ్యస్థ, అరాచక విధానాలు కాదా?ఇవాళ నేను కశ్మీరీ పండితుడినని రాహుల్ గాంధీ చెప్పుకుంటే కశ్మీరీ లో కాని దేశంలో కాని హిందువులు కాంగ్రెస్ ను విశ్వసించే పరిస్థితి ఎక్కడైనా ఉన్నదా? భారతీయ జనతా పార్టీ పట్ల మెజారిటీ భారతీయులు చూపిస్తున్న ఆదరణను చూసి నేను కూడా హిందువునే అని చెప్పకునే ప్రయత్నం చేయడం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కాదా?
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉన్నదో ఆ పార్టీ మిత్రపక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పరిస్థితి భూములు కోల్పోయి బంగళాలు శిథిలావస్తలో ఉన్న జమీందార్ లాగా ఉన్నదని, గత వైభవం చూసి మురిసిపోవడమే కాని ప్రస్తుతం తన ఇంటిని చక్కదిద్దుకునే సామర్థ్యం ఆ పార్టీకి లేదని పవార్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ కు ఉనికి ఉండేది కాని ఇప్పుడు ఆపరిస్థితి ఏమీ లేదు. నాయకత్వం గురించి మాట్లాడితేనే ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడతారని శరద్ పవార్ చెప్పడం కాంగ్రెస్ లో పరిస్థితిని ప్రతిబింబిస్తోంది.
దేశంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీ గా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిన ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తూ ట్వీట్లకు పరిమితం కావడం ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష దుస్థితిని తెలియజేస్తున్నది. విచిత్రమేమంటే రాహుల్ గాంధీ ఇతరులపై భారం వదిలేసి తాను ప్రకటనలకు పరిమితమైతే ఏదో ఒకరోజు యాదృచ్ఛికంగా తనకు అధికారం లభిస్తుందని భావిస్తున్నట్లు కనపడుతోంది. ఈ దేశంలో పార్టీలో ఎలాంటి కీలక పదవి లేకపోయినా అధికారం అనుభవిస్తున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ మాత్రమే.
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు పార్టీకి అధికారం లేకపోయినా కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వచ్చి రోజుల తరబడి అధినేత అపాయింట్ మెంట్ కోసం నిరీక్షించే పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. పంజాబ్,ఛత్తీస్ ఘడ్,కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ ప్రతి రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు, అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకుని పార్టీ విచ్ఛిన్నస్థితిలోఉన్నది.ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, కాంగ్రెస్ పార్టీని ఏ పార్టీ దరిచేర్చుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ తాను కశ్మీరీ పండితుడినని చెప్పుకుంటే ఎవరు పట్టించుకుంటారు?
దేశంలో మిగతా బిజెపియేతర పార్టీల పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్ల క్రితం భారీ మెజారిటీ గెలిచిన వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి అనతికాలంలోనే తన అరాచక, అవినీతి పాలన పట్ల జనాదరణ కోల్పోయి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టివేశారు. ఆయన సిబిఐ కేసులనుంచి తప్పించుకునేందుకు నానా కష్టాలు పడవలిసివస్తోంది. ప్రజలకు మాయ మాటలు చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి కె.చంద్రశేఖర్ రావు నిజస్వరూపాన్ని జనం పూర్తిగా తెలుసుకున్నారన్న విషయం స్పష్టమవుతోంది. తన నిరంకుశపాలన పట్ల జనం విసిగిపోయారని, బిజెపి చేతుల్లో తన ఓటమి తప్పదని తెలుసుకున్న కేసిఆర్ ఇటీవల దాదాపు తొమ్మిది రోజులు ఢిల్లీలో గడపడం ఆయన పరిపాలనా తీరుతెన్నులకు అద్దం పడుతోంది.
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఒక పార్టీ అధినేత తొమ్మిది రోజులు ఢిల్లీలో కాలక్షేపం చేస్తూ గడపడం ఏసంకేతాలు పంపుతుంది? ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలుసుకోవడం ద్వారా తనకు ఢిల్లీలో కేంద్రం మద్దతు ఉన్నదని భావిస్తే అది భ్రమే అవుతుంది. రాజకీయాలు వేరు, పరిపాలనా వ్యవస్థ వేరు అన్న విషయం బిజెపి నేతలకు ప్రజలకుస్పష్టంగా తెలుసు. గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి ఓడిపోయిన తృణమూల్ కాంగ్రెస్అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పుడు మరో నియోజకవర్గం నుంచి గెలిచి ముఖ్యమంత్రి పదవినికాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు.
మమతాబెనర్జీ తో పాటు ఇటీవల అకారంలోకి వచ్చిన డిఎంకె అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇల్లు చక్కదిద్దుకునే క్రమంలో ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ , బిఎస్ పి అధినేత్రి మాయావతి, బీహార్ లో రాష్ట్రీయ జనతాదళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పాలనలో జరిగిన అకృత్యాలు ప్రజలు ఇంకా మరిచిపోలేదు.ఈ పార్టీలు కూడా అస్తిత్వ పరీక్షలో ఉన్నాయి. ఇక దేశంలో కాగితపు పులుల్లా వ్యవహరించడం తప్ప జనంలో ఏ మాత్రం పట్టులేని వామపక్షాలు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితిలో ఉన్నాయి. వీరందరూ భారతీయ జనతా పార్టీని ఓడించి కలిసికట్టుగా అధికారంలోకి రావడం సాధ్యమా?
ఈ దేశంలో సంస్థాగతంగా బలమైన నిర్మాణం కలిగి ప్రజల్లో నిత్యం పనిచేస్తూ ప్రతి రోజూ ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీయేనని చెప్పకతప్పదు. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాభివృద్ది పై దృష్టికేంద్రీకరిస్తూ నవభారత నిర్మాణానికి అవసరమైన విధానాలను అమలు చేస్తూ ఉంటే మరో వైపు పార్టీ 18 కోట్లమందికిపైగా సభ్యులతో దేశంలో క్రింది స్థాయి నుంచి బలోపేతం అవుతోంది. ఇవాళ మోదీని కాని,భారతీయ జనతా పార్టీని కానీ సైద్దాతింకంగా,విధానాల పరంగా సవాలుచేయగల పార్టీ ఏదీ జాతీయస్థాయిలో లేదని,అసలు మోదీని ఢీకొనగల ఇంధనం ఉన్న నాయకుడెవరూ కనపడడం లేదని సీనియర్ జర్నలిస్టు శేఖర్ గుప్తా ఇటీవల ఒక వ్యాసంలోరాశారు. భారతదేశం ఇవాళ అన్ని రంగాల్లో పురోగమిస్తూ అగ్రదేశాల సరసన నిలబడేందుకు మోదీ నాయకత్వంలో సిద్దపడుతున్న సమయంలో రాహుల్ గాంధీ వంటి నేతలు తన మతాన్ని గుర్తు చేసుకోవాల్సి రావడం ఒక విషాదకర హాస్యసన్నివేశం.

-వై.సత్యకుమార్,
బిజెపి జాతీయ కార్యదర్శి

Leave a Reply