Suryaa.co.in

Andhra Pradesh

పేదలకు నేరుగా సంక్షేమ పథకాలను అందించేందుకు కార్పోరేషన్ల ఏర్పాటు

– మంత్రి కొడాలి నానిని కలిసిన గొట్టిపాటి హరీష్
గుడివాడ, సెప్టెంబర్ 15: పేదలకు నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేందుకు కార్పోరేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఏపీ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ గొట్టిపాటి హరీష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నానికి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గొట్టిపాటి హరీష్ మాట్లాడుతూ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ను సీఎం జగన్మోహనరెడ్డి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్పోరేషన్‌కు చైర్మన్, డైరెక్టర్ల నియామకం జరిగిందని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామని చెప్పారు. అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గంలోనూ పేదలకు కూడా ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్పోరేషను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ కార్పోరేషన్ ద్వారా ప్రభుత్వ పథకాలను అందజేయడం జరుగుతుందన్నారు. కార్పోరేషన్ పదవులు పొందిన వారు క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి ఆశయాలకనుగుణంగా కార్పోరేషన్ పనిచేయాలని సూచించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 47 కార్పోరేషన్లకు 481 మంది డైరెక్టర్లను నియమించిందన్నారు. కార్పోరేషన్ డైరెక్టర్ల నియామకాల్లోనూ సీఎం జగన్మోహనరెడ్డి సామాజిక న్యాయం పాటించారని చెప్పారు. 52 శాతం పదవులను మహిళలకు కేటాయించారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి, నిబద్ధతతో పనిచేస్తుందనే విశ్వాసాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాల్లో కలుగజేశారన్నారు. సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీల కోసం ప్రత్యేకంగా 56 కార్పోరేషన్లను ఏర్పాటు చేశారన్నారు. కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్మన్ పదవులు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దక్కాయన్నారు. 137 నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 58 శాతం పదవులు లభించాయన్నారు. అన్ని ప్రభుత్వ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. అమ్మ ఒడి పథకంలో తల్లుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ పథకాలను అందుకుని పేదలందరూ ఉన్నతంగా ఎదగాలన్నది సీఎం జగన్మోహనరెడ్డి లక్ష్యమని చెప్పారు. ప్రతిపక్షనేతగా ఉండగా చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను దగ్గరగా చూశారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలను వెతికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడం జరుగుతోందని చెప్పారు. దీనిలో భాగంగానే కమ్మ సామాజిక వర్గంలోని పేదలకు ప్రభుత్వ పథకాలను అందించేందుకు కార్పోరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, వైసీపీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, మాజీ కౌన్సిలర్ మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE