– అఘాయిత్యాలు అడ్డుకోవడం మాని.. పరామర్శలు అడ్డుకుంటారా.?
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
అన్యాయానికి గురైన ఆడబిడ్డను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకింతలా ఉలిక్కి పడుతోంది.? బాధితుల తరపున మాట్లాడకూడదా.? నారా లోకేశ్ పర్యటన అంటే చాలు ఈ పిరికి ముఖ్యమంత్రిలో వణుకు మొదలవుతోంది. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ చేతకానితనానికి, నిర్లక్ష్యానికి బలైపోయిన వారికి భరోసా కల్పించేందుకు వస్తున్న టీడీపీ నేతల్ని నిర్బంధించి తమ పిరికితనాన్ని, భయాన్ని బయటపెట్టారు. ప్రజలకు అండగా నిలిచేందుకు తెలుగుదేశం పార్టీ రోడ్లపైకి వస్తుంటే.. వైసీపీ ప్రభుత్వ పెద్దల పంచెలు తడుస్తున్నాయి. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఆపడం కంటే.. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను, శ్రేణులను నిలువరించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోంది. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారికి అండగా నిలుస్తూ.. ప్రజల కోసం పోరాడుతున్నవారిని అడ్డుకోవడం ప్రభుత్వ నీతిమాలిన తనానికి నిదర్శనం.
ప్రజా రక్షణే ధ్యేయంగా బాధ్యతలు స్వీకరించిన పోలీసులు.. నేడు వైసీపీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. అత్యాచారాలకు హత్యలకు పాల్పడుతున్నవారిని వదిలేసి.. బాధితులకు బాసటగా నిలిచేందుకు వెళ్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ. టీడీపీ నేతల గృహనిర్బంధాలపై పెట్టే శ్రద్ధ మహిళల రక్షణపై పెట్టకపోవడంతో నిన్న రాత్రి మరో ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని మహిళలకు అన్నగా ఉంటానన్న జగన్ రెడ్డి మహిళల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. లేని చట్టాలు, లేని శిక్షలను చూపి ప్రచారం చేసుకుంటూ మహిళల ఉసురు పోసుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు చట్టం ప్రకారం నడచుకోవాలి.