కేసీఆర్ పై ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోండి

-2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్ పేయి రాజ్యాంగ పని తీరు సమీక్షకు న్యాయ నిపుణులతో కమిషన్ వేశారు
– జస్టిస్ వెంకటాచలయ్యా నేతృత్వంలో కమిషన్ 2002 లో వాజపేయి కి నివేదిక సమర్పించింది
– రాజ్యాంగంపై చర్చ జరగాలని మాత్రమే సీఎం కేసీఆర్ చెప్పారు
– రాజ్యాంగంపై చర్చ అంశం కొత్తేమీ కాదు
– దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జస్టిస్ రాజమన్నార్ కమిషన్ వేశారు
– కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై జస్టిస్ సర్కారియా కమిషన్ వేశారు
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టీకరణ

రాజ్యాంగం పని తీరుపై సమీక్షకు అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి 2000 సంవత్సరంలో న్యాయ నిపుణులతో కమిషన్ వేశారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని’ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

ఈ సందర్భంగా రాజ్యాంగం పై చర్చ అంశంపై విలేకరులు అడిగిన పలు విషయాలపై స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు.రాజ్యాంగం పై చర్చ అనే అంశం కొత్తేమి కాదని, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరుగుతున్న చర్చ అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జస్టిస్ రాజమన్నార్ కమిషన్ వేశారని అన్నారు.అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి రాజ్యాంగం పని తీరుపై జస్టిస్ వెంకటా చలయ్యా నేతృత్వంలో న్యాయ నిపుణులు సోలీ సొరబ్జి, పరాశరన్, సర్కారియా, జీవన్ రెడ్డి, పున్నయ్య, సుభాష్ కశ్యప్ వంటి వారితో కమిషన్ వేశారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

2002 లో జస్టిస్ వెంకటా చలయ్యా కమిషన్ అప్పటి ప్రధాని వాజపేయి కి నివేదిక సమర్పించిందని, బీజేపీ నాయకుల దురదృష్టమో, దేశ ప్రజల అదృష్టమో కానీ బీజేపీ పరాజయంతో ఆ నివేదిక అటక ఎక్కిందని ఆయన తెలిపారు.రాజ్యాంగంపై చర్చ కొత్తేమి కాదని, ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని ఆయన స్పష్టం చేశారు.అయితే రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్ లో మార్పులు జరగరాదన్నది సుప్రీం కోర్టు ప్రధాన ఉద్దేశ్యం అని ఆయన అన్నారు.

దేశ అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు చేసుకోవచ్చు అని అంబేద్కర్ చెప్పారని, అందు కోసం ఆర్టికల్ 368 ద్వారా అవకాశం కల్పించారని వినోద్ కుమార్ వివరించారు.ఈ ఆర్టికల్ ద్వారా మూడు రకాల పద్ధతుల్లో రాజ్యాంగ సవరణలకు అవకాశం ఉందని చెప్పారు. పార్లమెంటు సింపుల్ మెజారిటీతో కానీ, లోక్ సభ, రాజ్యసభ లో 2/3 మద్దతుతో మార్చుకోవచ్చు, అయినా కూడా దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదంతో మార్చుకోవచ్చు అని వినోద్ కుమార్ స్పష్టత ఇచ్చారు.

సీఎం కేసీఆర్ కూడా రాజ్యాంగంపై చర్చ జరగాలి అని మాత్రమే చెప్పారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాల హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం, నదీజలాల సమస్యలను పరిష్కరించకపోవడం, జీఎస్టీ, వంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఆ అంశాన్ని ప్రస్తావించారని ఆయన తెలిపారు.

కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై జస్టిస్ సర్కారియా కమిషన్ వేశారని, అయినా కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేలాయిస్తోందని అన్నారు.బీజేపీ నాయకుల మాటలను ఎవరూ కూడా నమ్మవద్దని, బీజేపీ రెచ్చగొట్టే మాటలను పట్టించుకోవద్దని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.బీజేపీ నాయకులు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని ఆయన విమర్శించారు.

ఎలాంటి నివేదికలు లేకుండా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఎలా పడితే అలా రాజ్యాంగాన్ని సవరించుకుంటూ వెళ్తున్నారని వినోద్ కుమార్ అన్నారు.ప్రధాని రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని చెప్పారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తి కి వ్యతిరేకంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని, మోడీ కోసం ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కోసం బీజేపీ పావులు కదుపుతున్నదని ఆయన ఆరోపించారు. అందు కోసం జమిలి ఎన్నికల అంశం తెరపై తెస్తున్నారని అన్నారు.

హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు మోడీ కుట్ర
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సహకారంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తే .. హైదరాబాద్ కు ఎక్కడ పేరు వస్తుందో అని హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని వినోద్ కుమార్ ఆరోపించారు.

సింగపూర్, హాంకాంగ్, జెనీవా తర్వాత అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తే.. దీన్ని దెబ్బ తీసేందుకు ప్రధాని మోడీ నిన్నటి బడ్జెట్ సమావేశాల్లో హైదరాబాద్ ప్రస్తావన లేకుండా మరో ఆర్బిట్రేషన్ సెంటర్ ను గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని ఆయన అన్నారు.

బీజేపీ రాష్ట్ర నాయకులకు దమ్ము ఉంటే గుజరాత్ ప్రతిపాదనలను విరమింప చేసి హైదరాబాద్ ప్రతిష్టను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.హైదరాబాద్ ప్రజలారా..! బీజేపీ ని నమ్మకండి.. హైదరాబాద్ గౌరవాన్ని కాపాడుకునేందుకు కలిసి రావాలని, వాస్తవాలు గ్రహించాలని అని ఆయన హైదరాబాద్ ప్రజలకు పిలుపునిచ్చారు.

గవర్నర్లు వారి పరిధిలో పని చేసుకోవాలని ఆయన అన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పై అక్కడి గవర్నర్ ట్విట్టర్ లో కామెంట్ చేయడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు.బీజేపీ ఉత్తర భారత పార్టీ అని వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ కి రాష్ట్రంలో నాయకులు ఉన్నారు కానీ వీళ్లకు జాతీయ బీజేపీ నాయకులు ఎవరూ పట్టించుకోరని వినోద్ కుమార్ పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో కేటాయింపులు జరిపిందని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ని ఇరిగేషన్ ప్రాజెక్టు లకు జాతీయ హోదా కల్పిస్తూ రూ. 49 వేల కోట్లు బడ్జెట్ లో ప్రకటించారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.గోదావరి, కృష్ణా నదీ జలాల విషయంలో పలు వివాదాలను పరిష్కరించకుండా కేంద్ర జల్ శక్తి మంత్రి నదుల అనుసంధానం చేస్తామని ఎలా చెబుతారని, నదుల అనుసంధానం ఒక బక్వాష్ ముచ్చట అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.