– కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలి, గళాలు విప్పాలి
– సామాజిక చైతన్య సదస్సులో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్: కళలు సమాజ అభివృద్ధి, ప్రజల్లో చైతన్యానికి ఎంతగానో దోహదం చేస్తాయని, కవులు, కళాకారులు తమ కలాలకు పదును పెట్టాలని, గళాలు విప్పాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. శుక్రవారం రవీంద్రభారతీలో నిర్వహించిన విధ్వంస జీవన విధానం – సాంస్కృతిక చైతన్య సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, మేధావులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానిని ప్రారంభించారు
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. సంస్కృతి అంటే కేవలం ఆటపాటలు, నాట్యం, సంగీతం, సాహిత్యం, కవిత్వం, భాషకే పరిమితం కాదని, సంస్కృతి అంటే మన అస్తిత్వం. ప్రజల జీవన విధానం అని అన్నారు.
ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ… సాంస్కృతిక పునరుజ్జీవనం, ప్రజల జీవన విధానంలో మార్పులు తేవడానికి కవులు, కళాకారులు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగం నీడన జీవిస్తున్నాం కాబట్టి ఆ రాజ్యాంగ విలువలు మనం నిర్మించబోయే సంస్కృతికి ప్రాతిపాదిక కావాలని చెప్పారు. కుల, మాతాలకు అతీతంగా ఎదుటివాళ్లను గౌరవించడం నేర్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ కే. శ్రీనివాస్ మాట్లాడుతూ… రైతులు బలహీనమైపోయి ఆత్మహత్యలు, ఆన్ లైన్ గేమ్స్, బెట్టింగ్ కు యువత బానిసలై డబ్బులు పోగొట్టుకుంటున్నారని , కుల, మత విద్వేషం, అసహానం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. రైతులు.. నిరాశ నిస్పృహలకు గురికావద్దని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ప్రభుత్వం భరోసానివ్వాలని, వారిలో ఆత్మ స్థైర్యాన్ని కల్పించాల్సిన అవసరం కళాకారుల పైన ఉందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ డా. జి. వెన్నెల తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజలా, ప్రముఖ కవి జయరాజు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ప్రముఖ కవి, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, తెలంగాణ భాషా, సాంస్కృతిక సంచాలకులు డా.మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ సెక్రటరీ డా. బాలచారి, పద్మశ్రీ ఎక్క యాదగిరి, పద్మశ్రీ మహమ్మద్ అలీ బేగ్, పద్మశ్రీ పద్మజా రెడ్డి, పద్మశ్రీ వేలు ఆనందస్వామి, పద్మశ్రీ ఉమామహేశ్వరి, పద్మశ్రీ మొగిలయ్య, పద్మశ్రీ గడ్డం సమ్మయ్య, పద్మశ్రీ కేతావత్ సోంలాల్, డాక్టర్ కళా కృష్ణ, రాఘవ రాజ్ భట్, సురభి వేణుగోపాలరావు, భాగవతుల సేతురాం, ఎంవీ రమణారెడ్డి, మాస్టర్ జి, చక్రాల రఘు, యాకూబ్, పొట్లపల్లి, దరువు అంజన్న, మిట్టపల్లి సురేందర్, అంతడుపుల నాగరాజు, నేర్నాల కిషోర్, తదితరులు పాల్గొన్నారు.