బాబు..పవన్ మధ్య కమలం..!

-2024లో జగన్ గెలుపే బీజేపీ టార్గెట్!?
-అసలు ఏమనుకుంటోంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ గురించి..?

రాష్ట్రంలో కనీస ఓటు బ్యాంకు లేని బిజెపి కేంద్రంలో ఉన్న అధికార బలం..జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఉన్న తిరుగులేని ఆధిపత్యాన్ని అడ్డుపెట్టుకుని ఇక్కడ మన రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలతో మూడు ముక్కలాట ఆడుతోంది.పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నిన్న మొన్నటి వరకు ప్రధాన పార్టీ అనే స్థాయి లేకపోయినా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనసేనాని పవన్ కళ్యాణ్ కి ప్రాధాన్యత ఇస్తుండటంతో పాటు గత కొద్దీ కాలంగా జగన్ సర్కారుతో ఆయన చేస్తున్న అలుపెరుగని పోరాటం కారణంగా ఇప్పుడు జనసేన కూడా ఫ్రంట్ లైన్లోకి వచ్చేసింది.. బిజెపి కంటే మున్ముందుకు..!

ఇప్పుడు ప్రశ్న ఏంటంటే అసలు బిజెపి వ్యూహం ఏమిటన్నది.. ఎన్నికలు దగ్గరికి వచ్చే వరకు తమ ఆలోచన బయటపెట్టకుండా మూడు పార్టీలను తమ చుట్టూ తిప్పుకోవాలన్నది కమలనాథుల ప్రాథమిక వ్యూహమన్నది ఇప్పుడైతే బహిరంగ రహస్యమే…! అంతేకాదు…ఈలోగా చంద్రబాబు..పవన్ కళ్యాణ్ లను కలవకుండా చెయ్యడం కూడా ప్రధా(ని)న లక్ష్యం…!! ఆ తర్వాత..ఎవరితో పొత్తు.. ఇంకెవరికి రామ్ రామ్.. ఈ విషయంలో బిజెపి పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టు అవగతం అవుతోంది..!

కమలనాథుల టార్గెట్ 2029 బిజెపి ఎన్ని వ్యూహాలు పన్నినా 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి రావడం సంగతి అటుంచితే ఎలాంటి కూటమిలో ఉన్నా డ్రైవింగ్ సీట్లో ఉండే సీన్ కూడా ఉండదన్నది ఆ పార్టీ పెద్దలు సైతం అంగీకరించక తప్పని స్థితి.

మరేంటి పరిస్థితి..?
ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినట్లైతే 2029 నాటికి తమకు అనుకూల పరిస్థితులు ఉంటాయనే విషయంలో కమలనాథులు క్లారిటీతో ఉన్నారు..! రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం గనక అధికారంలోకి వస్తే.. అది బిజెపి పొత్తుతోనా.. స్వయంగానా అన్న విషయాన్ని పక్కనబెడితే ఇక ఆంధ్రప్రదేశ్ లో మరోసారి సైకిల్ పార్టీ పాగా వేసేసినట్టే.. మీదు మిక్కిలి చంద్రబాబు నాయుడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్టే..ఆయన గనక ఒకసారి అందుకుంటే ఆయన ఆలోచనలు.. వ్యూహాలు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం.. అవి కమలనాథులకు కూడా అందవనే భావించాలి..అదే జరిగితే బిజెపి 2029 నాటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేయడం దుర్లభం..! అప్పుడిక భారతీయ జనతా పార్టీకి కిం కర్తవ్యం.. కలిసి వెళ్దామనుకుంటున్న జనసేనకు ఎంతగా మద్దతు ఇచ్చినా గాని ఆ పార్టీ తనకు తానుగా అధికారంలోకి రావడం కష్టమే..!

మరి దారేది..?
ఇంకేముంది..ఇదే జగన్ను మరోసారి పీఠం ఎక్కించేస్తే సరి..ఇప్పటికే గ్రాఫ్ పడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2024 లో మరోసారి అధికారంలోకి వచ్చినా మొన్న 2019 లా అన్ని సీట్లు రావడం అనుమానం.. అలాంటి స్థితిలో జగన్ ఇదే నైఖరిని కొనసాగిస్తే 2029 నాటికి ఆయన పార్టీ అవకాశాలు మరింతగా సన్నగిల్లుతాయి..! ఈలోగా 2024 లో ఓటమి చెందితే తెలుగుదేశం పార్టీ చిరునామా గల్లంతవుతుంది.. ఇది పక్కా..! అప్పుడిక ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్టే..!! జనసేన ఎటూ బిజెపితోనే నడుస్తున్న పార్టీ..ఒకవేళ పవన్ కళ్యాణ్ తన వైఖరి మార్చుకున్నా అదేమంత పట్టించుకునే విషయం కాదు..ఎందుకంటే ఇప్పుడే అంతంతమాత్రంగా ఉన్న జనసేన 2024 తర్వాత మరింతగా బలహీనం అయిపోతుంది..ముగ్గులో మిగులుతుందా అన్నది కూడా సందేహమే..!

ఇక మిగిలింది వైసిపి..
జగన్ ఆటకట్టించడం బిజెపికి చిటికెలో పని..కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలం అది బిజెపికి సులభసాధ్యమైన వ్యవహారం.. ఒక్క నిర్ణయం..!? అయితే బిజెపి అలాంటి నిర్ణయం ఇప్పుడే తీసుకోవచ్చు కదా అనే ప్రశ్న పుడుతుంది.. ఇప్పటికిప్పుడు జగన్ ప్రభుత్వం పుట్టి మునిగినా రాష్ట్రంలో బిజెపికి ఒనగూరే ప్రయోజనం ఏదీ ఉండదు.. కమలం పార్టీ రాష్ట్రంలో వెంటనే అధికారంలోకి వచ్చే అవకాశం లేదు..పైగా ఆ నిర్ణయం తెలుగుదేశం పార్టీకి..ఖచ్చితంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడికి ఊతం ఇచ్చినట్టు అవుతుంది..అది కమలనాథులకు ససేమిరా..!

అందుకే ఆ సమయం కోసం బిజెపి ఎదురు చూస్తుంది..నిజానికి కేంద్రంలో..పెద్ద రాష్ట్రాల్లో పెత్తనం చెలాయిస్తున్న బిజెపికి జానాబెత్తెడు ఆంధ్రప్రదేశ్ పెద్ద లెక్కలోకి రాదు..కాని దక్షిణాదిలో పాగా వేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే సులువుగా దొరికే సందు..కర్ణాటక ఓకే..కాని అటు కేరళ..తమిళనాడు.. తెలంగాణలో పరిస్థితులు ఏ మాత్రం అనుకూలం కావు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కమలనాథులు దృష్టి పెడుతున్నారు.ఇదంతా సుదీర్ఘ ముందు చూపుతో గీస్తున్న స్కెచ్..!

2024 వరకు కానివ్వండి.. ఆ తర్వాత అవనివ్వండి ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలో ఉన్నంతకాలం బంతి బిజెపి కోర్టులో ఉన్నట్టే..ఆ కోణంలో భవిష్యత్తు రోజులు ఎలా ఉన్నా 2024 ఎన్నికల వరకు జగన్ పార్టీకి బిజెపితో పొత్తు ఉన్నా లేకున్నా పొజిషన్ సేఫే అనుకోవచ్చు..2024 తర్వాత మొదలవుతుంది అసలు కథ.. అప్పుడు తెలుస్తుంది కమలనాథుల నిజస్వరూపం..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286