ముఖ్యమంత్రికి అమరావతి బహుజన జే.ఏ.సి బహిరంగ లేఖ

**మహారాజశ్రీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి,
అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాల కోటయ్య వ్రాసిన బహిరంగ లేఖ**

ముఖ్యమంత్రి గారు …
రెండు రోజుల క్రితం ఒంగోలు సభలోనూ, ఈరోజు విశాఖ సభలోనూ మీరు మాట్లాడిన ప్రసంగాన్ని విన్నాను. డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో, అప్పులు ఎంత పెరిగాయో చెప్పకపోయినా, నవరత్నాల పంపిణీలో భాగంగా ప్రజలకు బటన్ నొక్కి ఎలా డబ్బులు వేస్తున్నారో, మధ్య దళారులు, అవినీతి లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లో ఎలా డబ్బులు అందిస్తున్నారో వివరించారు. ముఖ్యంగా మీరు పదే పదే నొక్కి చెప్పే మాట, మమల్ని గాయపరిచే మాట ఏమిటంటే,మీరు గంభీరంగా నా ఎస్సీ,నా ఎస్టీ, నా బిసి, నా మైనార్టీ అని మాట్లాడుతున్నారు. అంటే ఏడాదిలో రోజుకు మీరిచ్చే రూ.30, రూ. 40 కే మేమంతా మీ ఎస్సీలు, మీ ఎస్టీలు, మీ బీసీలు, మీ మైనార్టీలమై పోయామా? అయితే దశాబ్దాలుగా అమలులో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు చెందిన 20 రకాల సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ఎందుకు నిలిపేశారో చెప్పండి?.

ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ కార్పొరేషన్ కార్పొరేషనులు పెట్టి ఎన్నెన్ని నిధులు ఇచ్చారో తెలపండి? రాష్ట్రంలో ఉన్న దళితులకు, ఎస్టీ,బీసీ, మైనార్టీ నివాస ప్రాంతాలకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చెప్పండి? మీరు ఇచ్చిన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు చూపించండి? మాస్కు అడిగినందుకే ప్రాణాలు పోయోలా చేసిన దళిత డాక్టర్ సుధాకర్ సంఘటనను మర్చిపోయారా? మాస్క లేదన్న కారణంతో పోలీసులు కొడితే, చనిపోయిన చీరాల కిరణ్ మాటేమిటి? అప్పు చెల్లించలేదని ట్రాక్టర్తో గుద్ధితే చనిపోయిన గుంటూరు భూక్యా రమాకాంత్ సంఘటన ఏమిటి? పోలీసుల వేధింపులు తాళలేక నలుగురు కుటుంబసభ్యులతో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడిన నంద్యాల అబ్దుల్ సలాం సంఘటన ఏమిటి? కర్నూలు వజీరా, నంద్యాల నాగమ్మ,మహాలక్ష్మి, శిరోముండనం వర ప్రసాద్ ఇలా ఒకటేమిటి? దాదాపు 460 సంఘటనలు ఈ మూడేళ్లలో జరగలేదా?

రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో జరిగిన 460సంఘటనపై కానీ,696 మహిళల అత్యాచారాలపై మీరు తీసుకున్న చర్యలు ప్రకటించండి? ఎన్ని కేసులు పెట్టారు? ఎందరిని అరెస్టు చేశారు? దిశ చట్టం లో శిక్షలు ఎన్ని?ఒక అబద్ధాన్ని పదేపదే మాట్లాడితే నిజం అవుతుందన్న గోబెల్స్ కు అభినవ గోబెల్ మీరు కాదా? ఒంగోలులో మూడు రాజధానులు గూర్చి మౌనంగా ఉండి, విశాఖ లో మూడు రాజధానుల ప్రస్తావన తేవటంలో అర్థం ఏమిటి? నీళ్ళు లేని ఎడారి ఎండమావుల్లా మూడు రాజధానులు గూర్చి చెబితే ప్రజలు ప్రాంతీయ భావాలతో రెచ్చిపోతారనా? ప్రతిపక్షాలపై ఎదురు దాడిచేయడంతో పాటు ప్రశ్నించే మీడియాపై దుష్టచతుష్టయం అంటూ విష ప్రచారం చేస్తే ప్రజలు మరో ఛాన్స్ ఇస్తారు అనుకుంటున్నారా?

సీఎం గారు మీ నోటి వెంట నా ఎస్సీ, నా ఎస్టీ, నా బిసి, నా మైనార్టీ అనే అర్హత మీకు లేదు.మీరు మీరే. మేము మేమే. తల్ల క్రిందులుగా తపస్సు చేసినా మీరు ఎస్సీ కాలేరు. మీరు ఎస్టీ కాలేరు.మీరు బిసీ, మైనార్టీ కాలేరు. మూడు ప్రాంతాల ప్రజలను సమంగానూ,రాష్ట్ర ప్రజలందరినీ సమానంగానూ చూస్తారని నమ్మి ఓట్లేసిన ప్రజలను చీలికలుగా, పీలికలుగా చీల్చి పాలించ వద్దని, జరుగ బోవు సభలోనైనా అబద్ధాలు చెప్ప కూడదని కోరుకుంటున్నాను.

ఇట్లు,
పోతుల బాలకోటయ్య
అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు

Leave a Reply