పార్టీ మారాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలి:ఉపరాష్ట్రపతి

97

బెంగళూరు: పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణ చేయాల్సిన అవసరం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఎవరైనా పార్టీ మారాలనుకుంటే ముందు తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికవ్వాలని సూచించారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్‌ ఏర్పాటై 50 వసంతాలు పూర్తైన నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌ సభ్యులు ఆయనను సన్మానించారు.

ఈ సందర్భంగా ‘నవ భారత నిర్మాణంలో మీడియా పాత్ర’ అనే అంశంపై ఆయన మాట్లాడారు.పార్టీ ఫిరాయింపుల చట్టం రిటైల్‌ ఫిరాయింపులను అడ్డుకుంటున్నప్పటికీ.. హోల్‌సేల్‌ ఫిరాయింపులకు మాత్రం వీలు కలిగిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. దీంతో ప్రజాప్రతినిధులు ఫిరాయింపుల చట్టం వర్తించకుండా తనతో కలిసొచ్చే వారి కోసం చూస్తున్నారని చెప్పారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే పార్టీ మారాలనుకుంటే ముందు తన పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. పార్టీ ఫిరాయింపుల చట్టంలో కొన్ని లొసుగులు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్లు, ఛైర్‌పర్సన్లు, కోర్టుల పాత్రను కూడా వెంకయ్యనాయుడు తప్పుబట్టారు. ఫిరాయింపుల అంశాన్ని తేల్చేందుకు ఏళ్ల సమయం పడుతోందన్నారు. ఛైర్మన్లకు, స్పీకర్లకు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునే విశిష్ట అధికారం ఉన్నప్పటికీ ఆ విధంగా వ్యవహరించడం లేదన్నారు.

కోర్టుల పరిధిలో కూడా ఈ విషయంలో జాప్యం జరుగుతోందన్నారు. కొన్నిసార్లు సదరు ప్రజాప్రతినిధి పదవీకాలం కూడా ముగిసిపోతోందని వ్యాఖ్యానించారు.ఫిరాయింపుల అంశాన్ని తేల్చేందుకు కోర్టులు, స్పీకర్లకు నిర్ణీత సమయం ఉండాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు. గరిష్ఠంగా ఆరు నెలల్లోపే నిర్ణయం వెలువరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తానైతే 3 నెలల్లో తేలాలని కోరుకుంటానని తెలిపారు. కొన్ని కేసుల్లో తాను ఆవిధంగా వ్యవహరించానని చెప్పారు. దేశ పురోభివృద్ధి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మీడియా పాత్ర కీలకమైనదని అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. రాజకీయ నాయకులు విలువలు దిగజార్చుతున్నారని, పార్టీలు తమ సభ్యులకు ప్రవర్తనా నియమావళిని అమలు చేయాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.