Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల గారూ….మీరు సలహాదారులా? అధికార ప్రతినిధులా ?

సజ్జలకు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య ప్రశ్న

సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే కాదు. ప్రజాప్రతినిధీ కాదు. పట్టుమని పది ఓట్లతో ఏనాడూ గెలిచిన నాయకుడు కూడా కాదు. అధికార ప్రతినిధి అంతకంటే కాదు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు మాత్రమే అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

సలహాదారు హోదాలో ఉండి ప్రభుత్వానికో, ముఖ్యమంత్రికో సలహాలు ఇవ్వటం మానేసి, ప్రజలకు తప్పుడు సలహాలు , తప్పుడు వ్యాఖ్యలు ఇవ్వాల్సిన పని ఏముంది ? అన్నారు. మీరు ప్రభుత్వ సలహాదారులా? అధికార ప్రతినిధులా ? తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అంతా చంద్రబాబు అక్రమ జైలు, ఆయన భద్రత , డీహైడ్రేషన్ ,చర్మ సంబంధ వ్యాధులు, అనారోగ్యం, జైలు అధికారుల చికిత్స వంటి అంశాలపై ఆందోళన చెందుతుంటే, తనకంటూ కొన్ని మీడియా సంస్థలను దగ్గర పెట్టుకొని రోజువారీ గంటల తరబడి జైలు అంటే అత్తారిల్లు కాదు, దోమలను మేం పంపుతున్నామా?

వాటర్ ట్యాంక్ కట్ట మంటారా? భువనేశ్వరి దేవి పంపుతున్న ఆహారంలో ఏమైనా ఉందేమో , 73 ఏళ్ళ కుర్రవాడు అన్నారు కదా! అంటూ వ్యాఖ్యానాలు చేయటం నీచమైన దిన చర్యగా అభివర్ణించారు . చంద్రబాబు ప్రాణాలకు హాని జరిగితే, ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లుగా ముందుగానే వ్యూహం గీసి, చేతులు కాలాక ఆకులు పట్టుకుందాంలే అన్నట్టుగా ఆయన వైఖరి ఉందని అన్నారు. ఇదే రాజమండ్రి జైలులో దోమ కాటుకు డెంగ్యూ వచ్చి 20 ఏళ్ళ సత్యనారాయణ మృతి చెందాడని, భోజనం దగ్గర కోట్లాటలో గాయపడిన ఖైదీ కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందారని చెప్పారు.

స్వయంగా జైలు అధికారులే జైలు పరిసరాల్లో డోన్ కెమెరా తిరగటాన్ని అంగీకరించిన విషయం సజ్జల మరచిపోయారా? అని నిగ్గదీశారు. ఇప్పటికైనా పుండు మీద కారం చల్లే మాటలు మానేసి చంద్రబాబు ఆరోగ్యంపై ఖచ్చితమైన ప్రకటన చేయాలని, అవసరమైన పూర్తి స్థాయి చికిత్స జరిపించాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE