– సచివాలయ, రెవిన్యూ సిబ్బందిని వాడండి
– అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య హెచ్చరిక
ఎన్నికలను అడ్డుపెట్టి, ఎన్నికల కమిషన్ ఆదేశాలను సాకుగా చూపి, రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పెన్షనర్ల ఉసురు పోసుకో వద్దని, వారి ప్రాణాలతో చెలగాట మాడొవద్దని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అధికారులను హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వటంతో పెన్షన్ దారుల్లో నిరాశ నెలకొందని, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్లు ఎవరిస్తారు? అని పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారని చెప్పారు . తనకు స్వయంగా ఎన్నో ఫోన్లు వస్తున్నాయని తెలిపారు . వాలంటీర్లు లేకపోయినా, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా పెన్షన్లను ఇవ్వొచ్చని, ఎలాంటి ఇబ్బంది ఉండదని, స్వయంగా లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి ఇవ్వాలని కోరారు.
ఈ మండు వేసవిలో పెన్షన్ కోసం వృద్ధులు గంటల కొద్దీ కార్యాలయాల దగ్గర నిలబడితే, ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, వారి ఉసురు పోసుకో వద్దని హెచ్చరించారు. అధికారులు వెంటనే వారికి ధైర్యం చెప్పి, తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో15,000 సచివాలయాలు ఉన్నాయని , అందులో లక్షా 35 వేల మంది సిబ్బంది ఉన్నట్లు చెప్పారు.
అన్ని రకాల పెన్షన్లు కలిపి మొత్తం 65 లక్షల 92 వేల పెన్షన్లు ఉన్నాయని, ఒక్కో ఉద్యోగికి 50 మంది చొప్పున, రెండు రోజుల్లో ఇళ్ళకి వెళ్లి మరీ ఇవ్వొచ్చని తెలిపారు. వీటితోపాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన వైఎస్ ఆసరా వంటి నవరత్నాల పథకాలను కూడా లబ్ధిదారులకు అందజేయాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు.