పింఛన్లుకు 30 రోజులు కూడా పట్టొచ్చు!

-2.60 లక్షల మందిని రీప్లేస్‌ చేయడం సాధ్యమేనా?
-ప్రత్యామ్నాయంతో రెండు మూడు రోజుల్లో పింఛన్‌ అందించగలమా?
-ఎన్నికల కమిషన్‌ పునర్‌ పరిశీలించాలి
-ప్రజల్ని ఏప్రిల్‌ ఫూల్ చేయబోయి.. వాళ్ళే ఫూల్స్ అయ్యారు
– 2.60 లక్షల మంది వాలంటీర్లు చేసే పనిని ఏ విధంగా భర్తీ చేయగలం?
– ఇప్పుడు సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తే వారు ప్రభావితం చేయరా?
– ఈ మూడు నెలలు ఇబ్బంది ఉంటుంది… ఆ తర్వాత మళ్లీ ఆ వాలంటీర్లే పింఛన్‌ ఇస్తారు – మంత్రి బొత్స సత్యనారాయణ

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:
ప్రత్యామ్నాయంతో రెండు మూడు రోజుల్లో పింఛన్‌ అందించగలమా? 30 రోజులు కూడా పట్టొచ్చు. మధ్యలో ఎవరో ఒకరు డబ్బులు తినేసారనే అరోపణలు కూడా వస్తాయి. ఏప్రిల్‌ 1వ తేదీనాడు రోజూ చేస్తున్న దానికంటే అధికంగా ప్రజల్ని ఫూల్స్‌ని చేస్తున్నారు. సామాన్యుల ఆకలితో ఆటలాడుకుంటున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆర్డర్‌ ఇస్తే ప్రభుత్వం చేయాలి.. కానీ, రాజకీయంగా మా పార్టీపై నెట్టేస్తున్నారు. రాష్ట్రంలో 2.60 లక్షల మంది వాలంటీర్లు, 66 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేసిన నేపథ్యం ఉంది. కనీసం మూడు నాలుగు రోజుల్లో పంపిణీని వారు పూర్తి చేసేవారు. ఈ రోజు ఆ 2.60 లక్షల మంది చేసిన పనిని ఏ విధంగా భర్తీ చేయగలం?

గతంలో పంచాయతీ ఆఫీసుకు వెళ్లి, వీఆర్వో చుట్టూ తిరిగి, జన్మభూమి కమిటీలకు లంచం ఇచ్చుకుని పింఛన్లు తెచ్చుకున్నట్లు తెచ్చుకోవాలా? నూటికి నూరు శాతం పేదవారిపై కక్షతో.. 66 లక్షల మందికి పింఛన్‌ అందకుండా చూడాలనే దుర్భుద్ధితో అడ్డుకోవాలని చూశారు. ఒక నెల కాదు..మూడు నెలలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రత్యామ్నాయం చేయండి అంటున్నారు. నిజమే చేస్తాం. కానీ 2.60 లక్షల మందిని రీప్లేస్‌ చేయడం సాధ్యమేనా?

ఏ ఒక్కరైనా పింఛన్ల కోసం లంచం తీసుకున్నారని చెబితే నేను తలదించుకుని వెనక్కి వచ్చేస్తా. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో రాష్ట్రమంతా చూసింది. వందరూపాయలు లంచం ఇస్తే కానీ పింఛన్‌ ఇచ్చేవారు కాదు. నాయకులు, జన్మభూమి కమిటీల వారి ఇళ్ల చుట్టూ తిరిగితే కానీ పింఛన్‌ ఇచ్చేవారు కాదు. మీరన్నట్లు 1.36 లక్షల మంది సచివాలయ సిబ్బంది వెళ్లి పింఛన్‌ పంపిణీ చేస్తే ప్రభావితం చేయరా? ఈ సచివాలయ వ్యవస్థను కూడా మేమే తెచ్చాం కదా? వారిని మేమే నియమించాం కదా? వారు ప్రభావితం చేయరా?

ఈ మూడు నెలలు ఇబ్బంది ఉంటుంది..మళ్లీ ఎలాగూ మా ప్రభుత్వమే వస్తుంది. వారి ఇబ్బందులు తీరిపోతాయి. ఎన్నికల కమిషన్‌ను ఈ విషయంపై మేం రిక్వెస్ట్‌ చేయగలం తప్ప డిమాండ్‌ చేయలేం. వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారన్న విషయం నాకు తెలియదు. వారి పై ఇన్నిన్ని అపవాదులు వేస్తున్నారు..ఈ ఉద్యోగం నాకెందుకు అనుకుంటున్నారేమో? ఇక ధైర్యంగా.. తమకు కు నచ్చిన జెండా పట్టుకుని తిరుగుతామని రాజీనామా చేస్తున్నారేమో..?

Leave a Reply