హైదరాబాద్: వినాయకుడి ఉత్సవాలతో పాటు, నిమజ్జన ఊరేగింపు కూడా బాలాపూర్ గణేష్తోనే మొదలుకావడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి గణనాథుడి విగ్రహాన్ని ఈ సంవత్సరం వినూత్నంగా తీర్చిదిద్దారు. తల పైభాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మదనం చేస్తున్నట్లుగా రూపొందించారు.
కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండో చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగో చేతిలో లడ్డూ పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అయోధ్య రామాలయం తీరులో మండపాన్ని నిర్మిస్తున్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. కాగా, బాలాపూర్ లడ్డూకు కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది.
1994లో రూ.450కు ప్రారంభమైన లడ్డూ వేలం గత సంవత్సరంలో రూ. 18.90 లక్షలు పలికింది. వేలం ద్వారా వచ్చిన డబ్బుతో ఇప్పటి వరకు రూ.1,40,71,970లు వెచ్చించి ఆలయాల అభివృద్ధి, షెడ్డు నిర్మాణం, బోరు, వరద బాధితులకు సహాయం వంటి కార్యక్రమాలు చేపట్టారు.