– సీమ బాగుంటే… తెలంగాణకు మరింత ఆర్థిక వికాసం
రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్క్రతిక చైతన్యానికి గోదావరి, కృష్ణా డెల్టాల ప్రాంతాల ప్రజలు సజీవ ప్రతీకలని అంటుంటారు.
ఈ డెల్టాల ప్రాంతం లో ఉండే నీటి వసతులు, పండే పంటలే వారి చైతన్యానికి మూలాధారం. వారి చేతుల్లోని కొనుగోలు శక్తే ఈ డెల్టాల ప్రాంతపు సమాజంలోని సమస్త వర్గాల వారిని నడిపిస్తుంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార సంస్థల ఆర్ధిక కార్యకలాపాలు ఇబ్బడి ముబ్బడి గా ఉరకలెత్తుతుంటాయి. విద్య, వ్యాపార, వైద్య, రవాణా తదితర ప్రజాధారిత రంగాలు, వ్యవస్థలు ఆర్ధికం గా ఉరుకులు పరుగులు పెడుతున్నాయంటే…. గోదావరి, కృష్ణా నదుల నీటితో ఆ కోస్తా జిల్లాలు పునీతం కావడమే ప్రధాన కారణం.
సారవంతమైన కోస్తా ప్రాంతంతో పోల్చుకుంటే…. 67299 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు ఆర్ధికం గా వెనుకబడి ఉన్నాయనే విషయాన్ని అంగీకరించని వారు ఉండరు.
నమ్మకమైన సాగు నీటి వనరులు లేక, వ్యవసాయం అటకెక్కి, ఆర్ధికం గా వెనుకబడి పోవడమే… రాయలసీమ లో మెజారిటీ ప్రజలను రాజకీయ, సామాజిక, సాంస్క్రతిక వికాసానికి దూరం చేసింది. ఈ వెనుకబాటు తనం లోనుంచే ‘ పాలెగాళ్ళు ‘, వేట కొడవళ్లు, కులాధిపత్యాలు వంటి వికృత పోకడలు పుట్టుకొచ్చి; నేటికీ విలయతాండవం చేస్తున్నాయని భావించే వారికి కొదవలేదు.
ఆ పాలెగాళ్ళ రాక్షస మనస్తత్వ దుష్ఫలితాలను రాష్ట్రం ఇప్పటికీ ఏదో ఓ రూపం లో అనుభవిస్తూనే ఉన్నది. రాయలసీమ లో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ” పాలె గాళ్ళ ” సంస్కృతి కోస్తా జిల్లాల్లో లేదు కదా మరి . కోస్తా ప్రాంత వాసులకు అంత ఖాళీ సమయం ఉండదు మరి.
అపరిచితులు, కొత్తవారితో మాట్టాడవలసి వచ్చినప్పుడు సైతం ; కోస్తా జిల్లాల్లో ” నువ్వు ” అని ఎదుటి వారిని సంబోధించడం చాలా అరుదు. అలాగే, కొత్తవారిని ” అన్నా ” అనికూడా సంబోధించరు. ఈ రెండు పిలుపులూ…. ఆర్ధిక, మానసిక వెనుకబాటు తనానికి నిదర్శనాలు.
రాయలసీమ లోని దాదావు తొంబయ్ లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నప్పటికీ ; కేవలం దాదాపు 15 లక్షల ఎకరాల్లో మాత్రమే …. విత్తనాలు జల్లి, వర్షపు చుక్కల కోసం ఆకాశం వైపు చూడడం అనేది ఈ ప్రాంతపు రైతులకు బాగా అలవాటైన విద్య.
ఎటొచ్చి ఓ ఎనిమిది, తొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే కొద్దో గొప్పో నీటి సదుపాయం అందుబాటులో ఉన్నట్టు కేంద్రప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంటే, రాయలసీమ లోని 70 శాతంకు పైబడిన వ్యవసాయ భూమికి… ఆధారపడదగిన సరియైన నీటి వసతి లేదు. ప్రజలలో కనీసం ఎనభయ్, తొంభయ్ లక్షల మందికి తాగు నీటి వసతి కూడా లేదు. అందుకే, రాయలసీమ లో ఈ ఆర్థిక, సామాజిక, మానసిక వెనుకబాటు తనం అని సామాజిక నిపుణులు అంటుంటారు .
ప్రజల వెనుకబాటు తనమే పాలెగాళ్ళ పెట్టుబడి.
ఈ ప్రాంతంలోని నాలుగు జిల్లాల నుంచీ రాజకీయ దురంధరులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైనప్పటికీ ; ఈ 70 ఏళ్ళల్లో రాయలసీమ రైతాంగ వెనుకబాటు తనాన్ని పెద్దగా మార్చలేకపోయారు.
రాష్ట్ర మొత్తం జనాభాలో మూడవ వంతు మంది నివసించే రాయలసీమకు సాగునీటి తో పాటు, తాగు నీరు అందించడానికి నీళ్ళే అందుబాటులో లేవా అంటే….; లేకేం. ఉన్నాయి.
మూడు వేల టీ ఎం సీ ల గోదావరి నీరు ఏటా సముద్రం లో వృధా గా కలిసిపోతున్నదని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు స్వయంగా అపెక్స్ కౌన్సిల్ లో చెప్పారని తెలంగాణ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్ష్యధారాలతో సహా వెల్లడించారు.
నిజానికి, ప్రతి నదిలోని నీరూ వెళ్లి, అంతిమంగా సముద్రం లోనే కలుస్తుంది. అది ప్రకృతి ధర్మం.
మాట వరుసకు, కృష్ణా నదినే తీసుకుంటే… అది, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో పుట్టి ; మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా ప్రవహించి… దివిసీమ లో సముద్రం లో కలుస్తుంది. ఇక, గోదావరి నది అయితే, పశ్చిమ కనుమల్లోని నాసిక్ జిల్లా లోని త్రయంబికలో పుట్టి , దాదాపు 1465 కిలోమీటర్ల దూరం … మహారాష్ట్ర, తెలంగాణ లో ప్రవహించి, చివరగా ఆంధ్రప్రదేశ్ ని పావనం చేస్తూ వెళ్లి, కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద బంగళాఖాతం లో కలిసిపోతుంది.
అంటే….మహారాష్ట్ర, తెలంగాణ వాడేసు కోగా మిగిలిన నీటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ వాడుకున్నట్టు. లేదంటే, వెళ్లి సముద్రం లో కలిసినట్టు అని నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆ ఉద్దేశం తోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కూడా వృధాగా సముద్రం లో కలిసిపోతున్న ఈ జలాలను రాయలసీమకు మళ్ళించాల్సిన అవసరం గురించి మాట్లాడారు.
ఇందులో అస్పష్టతకు తావు లేదు.
నిజానికి, రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు భౌగోళికంగా, పాలనా పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్నప్పటికీ ; అమరావతి కంటే కూడా అవి హైదరాబాద్ కు దగ్గర. ఆ ప్రాంత ప్రజలకు హైదరాబాద్ తో అనుబంధం ఎక్కువ కూడా .
వారు, నిద్ర లేస్తే… ఏ వ్యాపకానికైనా వచ్చేది హైదరాబాద్ కే.
అక్కడ డబ్బులు సంపాదించినవారు నివసించేది,పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేది హైదరాబాద్ లో. అక్కడ అస్వస్థతకు గురైతే, ఆస్పత్రి లో చేరేది హైదరాబాద్ లో . అక్కడ చదువుకుంటే, ఉద్యోగాన్వేషణ కు వచ్చేది హైదరాబాద్. అక్కడ పెళ్లి చూపులు జరిగితే, వివాహం జరిగేది హైదరాబాద్. అక్కడ డాక్టర్ కోర్స్ చదివితే, ప్రాక్టీస్ చేసేది,ఆస్పత్రి కట్టుకునేది హైదరాబాద్ లో.
అక్కడ నెల తప్పితే, కాన్పుకి వచ్చేది హైదరాబాద్ ఆస్పత్రి కి. అక్కడ రిటైర్ అయితే, విశ్రాంత జీవనానికి వచ్చేది హైదరాబాద్.
ఇలా, ప్రతి చిన్న, పెద్ద జీవన అవసరాలకు హైదరాబాద్ తరలి వచ్చే రాయలసీమ వాసుల్లో…. ఆర్ధిక వెనుకబాటును రూపుమాపగలిగితే, ‘వికసిత ‘ హైదరాబాద్ ను తెలంగాణ రాష్ట్రం చూడగలుగుతుంది.బల్బు హైదరాబాద్ లో ఉంటే ; దాని స్విచ్ రాయలసీమ లో ఉంది.
రాయలసీమకు హైదరాబాద్ తో అంత సన్నిహిత సంబంధాలు ఉన్నందునే, రాష్ట్ర విభజన సమయం లో ” రాయల తెలంగాణ ” ఏర్పాటు చేయాలని తాడిపత్రి పూర్వపు స్ట్రాంగ్ మ్యాన్ జే సీ దివాకర్ రెడ్డి కేంద్రాన్ని పదేపదే కోరారు.
రాయలసీమ లో ఆర్థిక వెనుకబాటు తనం వెనకడుగు వేయాలి అంటే…. అక్కడి లక్షలాది ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములకు సాగు నీటి వసతి ఉండాలి.
అందుకు, గోదావరి – బనకచర్ల లింక్ కాలువల పథకం తప్ప మరో మార్గమే లేదు.
గోదావరిలో జూన్ నుంచి అక్టోబర్ మధ్యకాలం లో దాదాపు నూట పది రోజులైతే, వరద మహా రౌద్రంగా ఉంటుందనేది గోదావరి పరీవాహక ప్రజల అనుభవం లోని విషయమే. ఈ నీటిని తెలంగాణ రాష్ట్రం వాడుకునే అవకాశం లేదు. నిజానికి, తెలంగాణాలో గోదావరి నది దాదాపు 550 కిలోమీటర్లకు పైబడి ప్రవహించి, భద్రాద్రి కొత్తగూడెం సమీపంలో ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెడుతుంది. అక్కడి నుంచి పోలవరం కు వచ్చి, చివరకు అంతర్వేది వద్ద సముద్రం లో కలిసిపోతుంది.
తెలంగాణ లో ఇప్పటికే ఈ నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, లోయర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు డ్యామ్, అప్పర్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్,, దుమ్ముగూడెం లిఫ్ట్ ఇరిగేషన్, నిజాం సాగర్, ఎస్సార్ ఎస్పీ ఫ్లడ్ ఫ్లో కెనాల్, మంజీరా రిజర్వాయర్, సింగూర్ డ్యామ్… ఇలా అనేక ప్రాజెక్ట్ లను గోదావరి పై నిర్మించారు.
అయినా, ఇంకా వేలకొద్దీ టీ ఎం సీ (థౌజెండ్ మిలియన్ ఘనపుటడుగులు )ల నీరు…. గోదావరి చివరి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవహిస్తూ, చివరికి సముద్రం లో కలిసి పోతున్నది . ఆ మిగులు జలాలు దిగువకు ప్రవహించకుండా, సముద్రం లో కలవకుండా తెలంగాణలోనే నిలువ చేసుకునే అవకాశం తెలంగాణ రాష్ట్రానికి లేదు కదా!
తెలంగాణ లో మేజర్, మీడియం, మైనర్ నీటిపారుదల పథకాల కింద దాదాపు 75 లక్షల ఎకరాలకు నిలకడైన సాగునీటి సదుపాయం ఉంటే ; అందులో దాదాపు 30 లక్షల ఎకరాలు ఒక్క గోదావరి నది పైన నిర్మించిన ప్రాజెక్ట్ ల ద్వారానే సాగు అవుతున్నాయి.
తెలంగాణాలో గోదావరి నది దాదాపు 569 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుండడం తో, అనేక ప్రాజెక్ట్ లను అది కట్టుకోగలిగింది. అయినప్పటికీ, వరదలను నిలువరించే పరిస్థితి లేదు.
వరద నీటి ప్రవాహ కాలం లో… రోజుకు రెండు టీ ఎం సీ వంతున ఓ వందరోజుల పాటు గోదావరి వరద నీటిని కృష్ణా నది లోకి మళ్లించి, అక్కడినుంచి బొల్లాపల్లి మీదుగా, నంద్యాల జిల్లా లోని బనక చర్ల రిజర్వాయర్ కు తరలించి, అక్కడ నిలువ చేస్తే…. రాయలసీమ కు చెందిన 80 లక్షల మందికి తాగు నీటి ని, ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీటిని , శాశ్వతం గా అంచవచ్చుననేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన. తెలంగాణ నీటి పారుదల రంగ ప్రయోజనాలకు బనకచర్ల ప్రాజెక్ట్ ఏ విధమైన విఘాతం కలిగించేది కాదు.
ఆ విషయాన్నే చంద్రబాబు నాయుడు స్పష్టం గా చెప్పారు, ” మీరు ఎన్ని ప్రాజెక్ట్ లు కట్టుకోవాలి అనుకుంటే అన్ని కట్టుకోండి. అభ్యంతరం లేదు. మేమూ కట్టుకుంటాం. నీటి లభ్యతకు లోటు లేనప్పుడు మన మధ్య తగాదా ఎందుకు? కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అభ్యంతరం చెప్పానా? ” అని ఆయన సూటిగా చెప్పారు. వీలైనంత సున్నితం గా, వివాదరహితం గా ముందుకు వెళ్లాలని ఆయన భావిస్తున్నారు.
దీనికోసం “జలహారతి కార్పొరేషన్ ” పేరిట ప్రత్యేకం గా ఒక కార్పొరేషన్ ను తన అధ్యక్షతన చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల నాయుడు దీనికి ఉపాధ్యక్షుడు. నిమ్మల రామానాయుడు మామూలు మంత్రి కాదు. సైలెంట్ మిస్సయిల్. అప్పగించిన పని పూర్తి చేసేదాకా నిద్రపోడు.
అందుకే, బనకచర్ల ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు ప్రస్తుత పదవీకాలం లోనే పూర్తవుతుందనే భావన, రాయలసీమ రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
విభజిత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించినప్పుడు, 60 వేల కోట్ల రూపాయలు అయితే సరిపోతుంది అనుకున్నారు. ఆరేళ్ళ తరువాత…. అది ఇప్పుడు 81 వేల కోట్లకు దేకింది. చివరకు లక్ష కోట్లకు ప్రాజెక్ట్ వ్యయం పాకుతుందేమో తెలియదు. అయినా, చంద్రబాబు వెనక్కు తగ్గే ప్రశ్నే లేదు.
తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ ఆర్ధిక వికాసానికి బహుముఖం గా…., ఇబ్బడి ముబ్బడి గా తోడ్పడే రాయలసీమ కు సాగునీరు అందించడమంటే…..; హైదరాబాద్ ఆర్ధికాభివృద్ధి కి పరోక్షంగా తోడ్పడడమే. వివిధ కోణాలనుంచి పీడిస్తున్న రాయలసీమ వెనుకబాటు తనాన్ని రూపుమాపడానికి శతధాః ఉపకరించే గోదావరి – బనకచర్ల లింక్ కెనాల్ ప్రాజెక్ట్ కు తెలంగాణ రాజకీయం స్వాగతం పలకాలి. రాజకీయ లబ్ది కోసం ఘర్ష ణలు పడే పాలకుల కాలం చెల్లిపోయింది. పరస్పర సహకారం, అవగాహనలతో తమ తమ రాష్ట్రాలను వీలైనంతగా అభివృద్ధి చేసుకోవాలని ప్రజలు భావించే రోజులు ఇవి అని రాజకీయాలే వృత్తిగా జీవించేవారు గ్రహించాలి.
– భోగాది వేంకట రాయుడు