Suryaa.co.in

Telangana

కూలిన బతుకులు…..దిక్కుతోచని రైతులు

చేతివ్రుత్తుల బాధలు…..చిరు వ్యాపారుల వేదనలు
ఉద్యోగాల్లేక యువకులు….ఇండ్లు లేక ప్రజలు నానా అవస్థలు
బండి సంజయ్ 12వ రోజు పాదయాత్ర
( పసునూరు మధు )
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ 12వ రోజు సంగారెడ్డి పట్టణం నుండి సుల్తాన్ పూర్ వరకు పాదయాత్ర చేశారు. ఉదయం 11 గంటలకు మొదలైన పాదయాత్ర రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది. ప్రజల సమస్యలు తెలుసుకోవడమే ప్రధాన ఎజెండాగా సాగిన ఈ పాదయాత్రలో ఎవరినీ కదిలించినా సమస్యలే ఏకరవు పెట్టారు. వర్షాలకు కూలి పోయిన ఇండ్లు….ఉండటానికి గూడ లేక అల్లాడుతున్న జనం ఒకవైపు…..భారీ వర్షాలు వరదలతో పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలో అన్నదాలు మరోవైపు….ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లేక నిరాశలో ఉన్న యువకులు ఇంకోవైపు….బండి సంజయ్ బుధవారం పాదయాత్రలో ఇలా ఎవరిని కదిలించినా ఇలాంటి సమస్యలు ఏకరవు పెడుతూ వాపోయారు.
సంగారెడ్డి పట్టణంలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కాగానే వేలాది మంది కాషాయ దండు ఆయన వెంట నడిచింది. పట్టణంలో ఎక్కడికెళ్లినా బండి సంజయ్ కు వేలాది మంది స్వాగతం పలికారు. పూలు చల్లి అభిమానం చాటుకున్నారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు. సంజయ్ మాత్రం ప్రజా సమస్యలపై నే పూర్తిగా దృష్టి సారించారు. దారిలో కర్ర కోత మిషన్ కార్మికుల తో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. పెట్రోల్ బంక్ కార్మికులతో మాట్లాడారు. హనుమాన్ టెంపుల్ వద్ద మత్స్యకారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వృత్తి నైపుణ్యం ఉన్న వారిని సొసైటీల్లో చేర్చుకోకుండా కొందరు నాయకులు ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారని, ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు. పట్టణంలో పాదయాత్ర చేస్తూ పలువురు తోపుడు బండ్లు, చిరు వ్యాపారులను కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వల్ల తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం ఇంతవరకు ఏ సాయమూ చేయలేదని వాపోయారు. ‘మీరేం బాధపడకండి. బీజేపీ అండగా ఉంటుంది’అని భరోసానిస్తూ బండి సంజయ్ ముందుకు కదిలారు.
పాదయాత్ర పట్టణంలోని హనుమాన్ నగర్ మీదుగా వెళుతుండగా…. వర్షాలకు కూలిన ఓ ఇంటిని సందర్శించి శంకరమ్మ అనే బాధితురాలిని పరామర్శించారు. శంకరమ్మ, ఆమె కొడుకు నివాసం ఉంటున్న ఒకే ఒక రూం వానలకు కూలిపోయింది. అంతకు ముందు డ్రైనేజీ కోసం ఆ ఇంటి పక్కన జేసీబీతో తవ్వించడంతో సపోర్ట్ లేకుండా పోయిందని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయిందని శంకరమ్మ, ఆమె కొడుకు వాపోయారు. తమకు ఇల్లు తప్ప మరే ఆధారమూ లేదని, సాయం చేయాలని కోరుతూ స్థానిక కౌన్సిలర్ కు, అధికారులకు ఎంతగా మొరపెట్టుకున్నా ఇంతవరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని, ప్రభుత్వం నుండి ఏ సాయమూ అందడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు.
ఆమె సమస్యను ఓపికగా విన్న బండి సంజయ్ ‘మీరేం బాధపడకండి. మీకు అండగా బీజేపీ ఉంటుంది. 2023లో బీజేపీ ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వం వస్తుంది. మిమ్ముల్ని తప్పకుండా ఆదుకుంటాం’’అంటూ భరోసానిస్తూ ముందుకు కదిలారు. పట్టణంలోని పలువురు మహిళలు సంజయ్ ను కలిసి తమకు ఉండటానికి ఇళ్లు లేవని, డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ‘మీరేం బాధపడకండి. ఓపిక పట్టండి. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. పేదలందరికీ ఇండ్లు కట్టించి ఇచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది’అని హామీనిస్తూ ముందుకు సాగారు.
పసల్ వాడి గ్రామంలోకి ప్రవేశించగానే నిర్మాణంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలోకి వెళ్లారు. వేద పండితులు బండి సంజయ్ ని ఆశీర్వదించారు. వైకుంఠ పురం వద్దకురాగానే కర్ణాటక ఎంపీ మునిస్వామి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేశారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు సంజయ్ ను చూసి ఉత్సాహంతో టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దారిలో సంగారెడ్డి సరస్వతి శిశు మందిర్ వెళ్లిన బండి సంజయ్ అక్కడున్న విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులతో కొద్దిసేపు సరదాగా గడిపారు. తానూ, తన భార్య కూడా శిశు మందిర్ విద్యార్థులమేనని, ఇక్కడ చదవడంవల్లే తమలో దేశభక్తి అలవడిందని, ఈ స్థాయికి చేరుకోగలిగామని అన్నారు. మిగితా విద్యా సంస్థలతో పోల్చితే శిశు మందిర్ లో చదివిన వారిలో దేశభక్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు. హిందూత్వను కాపాడుతోంది శిశుమందిర్ అని, భవిష్యత్తులో మంచి సేవ చేయడానికి విద్యార్థులంతా ముందుకు రావాలని ఆకాంక్షించారు. భోజన, శాంతి మంత్రాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తమ పాఠశాలకు వచ్చిన సందర్భంగా సంస్థ అధ్యాపకులు సంజయ్ ను శాలువాతో సత్కరించారు. ఈ పాఠశాలలో చదివిని విద్యార్ధి ఐఏఎస్ అయ్యారని అధ్యాపకులు చెప్పడంతో సంజయ్ సంతోషిస్తూ అక్కడి నుండి ముందుకు కదిలారు.
పాదయాత్రలో భాగంగా ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులతో బండి సంజయ్ మాట్లాడారు. సదాశివ నగర్ లోకి ప్రవేశించగానే స్థానిక నిరుపేద మహిళలు బండి సంజయ్ ని కలిసి తమ సమస్యలు విన్నవించారు. తమకు ఇండ్లు లేవని వాపోయారు. కొందరు వ్రుద్దులు వచ్చి తమకు ఫించన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి. బీజేపీ అధికారంలోకి వచ్చాక అండగా ఉంటుందని భరోసానిస్తూ ముందుకు కదిలారు. సదాశివ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బండి సంజయ్ ఫసల్ వాడి గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేశారు. స్థానిక గణపతి షుగర్ ఫ్యాక్టరీ వద్ద కార్మికుల తో మాట్లాడి వారి సమస్యలు విన్నారు.
అక్కడి నుండి శివంపేట్ వెళ్లిన బండి సంజయ్ మధ్యాహ్న భోజన విరామ సమయంలో మీడియాతో మాట్లాడారు. తిరిగి సాయంత్రం పాదయాత్ర ప్రారంభించి దారిపొడవునా ప్రజలను కలుస్తూ వారిచ్చే వినతి పత్రాలు తీసుకుంటూ బీజేపీ అండగా ఉంటుందని భరోసానిస్తూ సుల్తాన్ పూర్ వైపుగా కదిలారు. రాత్రి సుల్తాన్ పూర్ సమీపంలోని గుడారాల్లో బండి సంజయ్ బస చేయనున్నారు.

LEAVE A RESPONSE