ప్రజారోగ్యం కోసం తీసుకున్న నిర్ణయంపై రాజకీయమా..?

– రాజ్ భవన్ కు ఎందుకు వెళ్లాలో..? గవర్నర్ ను ఎప్పుడు కలవాలో బీజేపీ నాయకులు తెలుసుకోవాలి
– గోబెల్స్ ప్రచారాలను మానుకోవాలి
– విజయవాడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా వ్యాప్తిని అరికట్టడానికి జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తుంటే కొందరు వ్యక్తులు, సంస్థలు ప్రభుత్వాన్ని అకారణంగా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. బిజెపి, విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థలు రాష్ట్రంలో హిందూ సమాజానికి ముప్పు వచ్చినట్టు దుష్ప్రచారాన్ని సాగిస్తూ ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అన్ని ధార్మిక ఉత్సవాలు, కార్యక్రమాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రంలోని అదే పార్టీ నాయకులు పెడచెవిన పెడుతున్న వింత పోకడలను ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే చూస్తున్నాం.
వినాయక చవితి వేడుకలు చేసుకోవద్దన్నారంటూ రాష్ట్ర బీజేపీ నేతలు గవర్నర్ కు రిప్రజెంటేషన్ ఇవ్వడం విడ్డూరంగా ఉంది. రాజ్ భవన్ కు ఎందుకు వెళ్లాలో, గవర్నర్ ను ఏ సందర్భంలో కలవాలో బీజేపీ నాయకులు ముందుగా తెలుసుకోవాలి. కోవిద్ నిబంధనలను పాటిస్తూ వినాయక చవితి వేడుకలను జరుపుకోమని చెప్పడం ఏవిధంగా తప్పు అవుతుందో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. అప్రమత్తంగా ఉండాలి, ప్రజారోగ్యాన్ని కాపాడాలని, ప్రతి ఒక్క ప్రాణం కూడా విలువైనదేనని భావించే ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
స్కూల్స్ ప్రారంభించినా, ఆర్టీసీ బస్సులు తిప్పినా కోవిద్ మార్గదర్శకాలకు లోబడే జరుగుతుంది. కేవలం రాజకీయ స్వార్థంతో సమాజాన్ని చీల్చాలనే దురుద్దేశంతోనే బీజేపీ నాయకులు గవర్నర్ ను కలిసినట్లుగా ఉంది. ఇలాంటి కుయుక్తులు, కుహనా ఆలోచనలలో బీజేపీ నాయకులు గవర్నర్ ను కలిసేందుకు వెళ్లడం బాధాకరం. రాజ్ భవన్ కు వెళ్లి మరీ రిప్రజెంటేషన్ ఇవ్వడమంటే కేంద్ర హోం శాఖ జీవో రూపంలో ఇచ్చిన మార్గదర్శకాలను అవమానించడమే అవుతుంది.
కన్నా విజ్ఞతతో మాట్లాడాలి
రాష్ట్రంలో హిందు దేవాలయాలపై దాడులు ఏ ప్రభుత్వంలో జరిగాయో, ఎవరి హయాంలో ఆలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారో కన్నా లక్ష్మీ నారాయణ తెలుసుకోవాలి. గత తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ భాగస్వామ్యంతో ఒక్క విజయవాడలోనే 50 పురాతన దేవాలయాలను కూల్చివేసింది నిజం కాదా..? నాడు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నది మీ బీజేపీ నాయకులు అని మర్చిపోయారా..? గోదావరి పుష్కరాల్లో 30 మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయిన నాడు బయటకు వచ్చి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు..? తెలుగుదేశం చేసిన తప్పులలో భాగస్వామ్యులై హైందవ సమాజానికి తీరని ద్రోహం చేసిన మీకు.. హిందువుల మనోభావాల గూర్చి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది..? పైగా బహిరంగంగా పండుగలు జరుపుతామని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు సిద్ధమయ్యారు..? మీ రాజకీయ స్వార్థం కోసం ప్రజారోగ్యంతో ఆడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు..?
అన్ని కులాలు, మతాలు బాగుండాలన్నదే జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మతాల వారిని తన మనుషులుగా, సోదరులుగా భావిస్తోంది. అందరి శ్రేయస్సును కోరే నియమ నిబంధనలను రూపొందిస్తోంది. కానీ బిజెపి, విశ్వహిందూ పరిషత్ తదితర సంస్థల నాయకులు, కొందరు స్వామీజీలు కరోనా నిబంధనల్ని బూచీలుగా చూపెడుతూ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చ గొట్టి రాజకీయ లబ్దిపొందాలనే దుర్బుధ్ధితో కుట్రలు చేస్తున్నారు.
గణేష్ ఉత్సవాల మీద నియంత్రణను ఎత్తి వేయాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి వినతి పత్రం ఇవ్వడం, సమస్యను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడవద్దని బిజెపి, విశ్వహిందూ పరిషత్ నేతల్ని మరొక్కమారు హెచ్చరిస్తున్నాను. అన్ని మతాల వారిని, అన్ని పండుగలను సమానంగా చూస్తూ సుస్థిర పాలన అందించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు విఘ్నాలు కలిగించవద్దని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.

Leave a Reply