– వరదలతో నష్టపోయిన రాష్ట్ర ప్రజానీకాన్ని ఆదుకోవాలి
– ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రుణమాఫీ చేయాలి
– బ్యాంకులతో సమీక్ష పెట్టి కొత్త రుణాలివ్వాలి
– ‘రైతు బంధు’ పేరుతో సబ్సిడీలన్నీ బంద్ చేసి రైతును గోసపెడుతున్నారు
– కేంద్రం ఏటా సబ్సిడీల పేరుతో ఎకరాకు రూ.27 వేలు అందిస్తోంది
– మూడేళ్లలో బీజేపీ గ్రాఫ్ 6 శాతం నుండి 30 శాతంపైగా పెరిగింది
– టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడి
– కోరుట్ల నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరిక
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకనైనా మొద్దు నిద్ర వీడి వర్షాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ అన్నారు. వర్షాలవల్ల పంట నష్టపోయి రాష్ట్ర రైతాంగం ఇబ్బంది పడుతోందన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేరకపోవడంతో బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడం లేదన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని అమలు చేయడంతోపాటు తక్షణమే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి కొత్తగా రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గత మూడేళ్లలో బీజేపీ గ్రాఫ్ విపరీతంగా పెరగిందని, 6 శాతం నుండి 30 శాతానికిపైగా ఓట్లు సాధించామని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేస్తున్న పోరాటాలను ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఈ రోజు సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి మహిపాల్ రెడ్డి, లోక్ సత్తా నాయకులు వెంకటరమణ, సురేష్, నరేష్, శ్రీనివాస్, లింగారెడ్డి, మహేశ్, ప్రదీప్, రుత్విక్, దీపక్, రాజేశ్, వెంకటేశ్, రాజు, జనార్థన్, అరుణ్ సహా పలువురు నేతలు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ఎస్.ప్రకాశ్ రెడ్డి, జయశ్రీ, జిల్లా అధ్యక్షులు సత్యనారాయణరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, వెంకట్, మాజీ జడ్పీటీసీ సునీత తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు…
తెలంగాణలో గత మూడు, నాలుగు రోజుల నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అండగా ఉండాలి. గతంలో ఇలాంటి అనేక సందర్భాల్లో బీజేపీ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి సేవ చేశారు. ఈసారి కూడావారికి అండగా ఉండాల్సిందిగా విజ్ఝప్తి చేస్తున్నా. ప్రజలను కలిసి చేతనైనంత సాయం చేయాలి. వారు పడుతున్న బాధలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆదుకునేలా చేయాలని కోరుతున్నా.
ఈరోజు జగిత్యాల జిల్లాలో న్యూస్ కవరేజీ కోసం వెళ్లి అనుకోకుండా ప్రమాదానికి గురైన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మృతి పట్ల బీజేపీ తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నా. ప్రజలు పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే క్రమంలో అతడు ప్రయాణించే వ్యాను నీళ్లలో కొట్టుకుపోయి మరణించడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్ మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదు. ఫాంహౌజ్, ప్రగతి భవన్ వీడి బయటకు రావడం లేదు. సమీక్షల పేరుతో కాలయాపన చేస్తున్నాడు. కోవిడ్ సమయంలో, హైదరాబాద్ లో వరదలొచ్చినప్పుడు కూడా బయటకు రాలేదు. భారీ వర్షాలతో ఆదిలాబాద్ లో 40 వేల ఎకరాల పంట నీట మునిగింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. సీఎం మాత్రం స్పందించరు. ఏమైనా అంటే బీజేపీని తిట్టడానికే పరిమితమవుతున్నాడు. సీఎం ఒక్కసారి బయటకు వెళ్లి జనం ఏమనుకుంటున్నాడో తెలుసుకుంటే మంచిది.
రాష్ట్ర రైతాంగానికి దాదాపు 8 వేల కోట్ల మేరకు పంట రుణాలు ఇవ్వలేదు. 2018లో రుణహామీ చేస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదు. రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. రైతులు సొంతంగా జమ చేసుకున్న డబ్బులను కూడా బ్యాంకు అధికారులు రుణమాఫీ జమ చేసుకుంటున్నారు. రుణాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు కేసీఆర్ ఏటా ఎకరాకు ఇచ్చేది రూ.10 వేలు మాత్రమే. ‘రైతు బంధు’ పేరుతో అన్ని సబ్సిడీలు బంద్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యూరియా, డీఏపీ సబ్సిడీలతో రెండు పంటలకు కలిసి ఏటా ఎకరానికి రూ.27 వేలు సబ్సిడీ ఇస్తోంది.
ఇప్పటికైనా కేసీఆర్ ఒట్టిమాటలు కట్టిపెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రుణమాఫీ అమలు చేయాలి. వెంటనే బ్యాంకులతో సమావేశం ఏర్పాటు చేసి కొత్త రుణాలు ఇప్పించాలి. వర్షాలతో దెబ్బతిన్న రైతులను, మత్స్యకారులను, సామాన్య ప్రజానీకాన్ని వెంటనే ఆదుకోవాలి.
ఓ ప్రైవేటు సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే నివేదికను మీడియా ప్రస్తావించగా…. బీజేపీ గ్రాఫ్ 6 నుండి 30 శాతం దాటినం. టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గిపోయింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్ల గెలిచాం. మూడేళ్లుగా బీజేపీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు. మరో 8 శాతం ఓట్లను పెంచుకోవడం బీజేపీకి కష్టమే కాదు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అవినీతి, నియంత, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న పోరాటాలను గమనిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని అర్ధం చేసుకున్నారు. అదే సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అందిస్తున్న నీతివంతమైన పాలనను చూస్తున్నారు. తప్పనిసరిగా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది.
3వ విడత పాదయాత్ర ప్రారంభం రోజే కాంగ్రెస్ సిరిసిల్లలో సభ నిర్వహించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు… ‘‘కాంగ్రెస్ పార్టీ అయోమయంలో ఉంది. మేం అధికార టీఆర్ఎస్ తో కొట్లాడుతున్నం. ప్రజల పక్షాన ఉద్యమలు చేస్తుంటే… మాకు పోటీగా కాంగ్రెస్ కార్యక్రమాలు చేస్తోంది. కాంగ్రెస్ గ్రాఫ్ పెంచడానికి కేసీఆర్ కష్టపడుతున్నాడు. ఎందుకంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసే పోటీ చేస్తాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో కలిసి అభ్యర్ధిని నిలబెట్టాయి. కాంగ్రెస్ నేతలు కూడా అదే విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. బీజేపీని అణిచివేసేందుకు టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా సహకరిస్తోంది. ఆ రెండు పార్టీలు సహా ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేసినా బీజేపీ గెలుపును అడ్డుకోలేరు.