కేసీఆర్… నీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి

-ఆర్టీసీ ఛార్జీల పెంపు దారుణం
-మూడేళ్లలో 5 సార్లు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం
-అడ్డగోలు ఛార్జీల పెంపుతో పేదల బతుకును ఆగమాగం చేస్తారా?
-బస్ ఛార్జీల పెంపును తక్షణం ఉపసంహరించుకోవాల్సిందే
-లేనిపక్షంలో బీజేపీ చేపట్టే ఉద్యమాల సెగను చవిచూడక తప్పదు
-బస్ ఛార్జీల పెంపుపై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్
-జూబ్లీ బస్టాండ్ ను సందర్శించి ప్రయాణీకులతో మాట్లాడిన సంజయ్
ఆ-ర్టీసీ బస్సు ఛార్జీల పెంపు భారాన్ని మోయలేకపోతున్నామంటూ ప్రయాణీకుల ఆవేదన
-తమకున్న ఏకైక రవాణా సాధనం కూడా దూరమైపోతోందంటూ వాపోయిన పేదలు

‘‘కేసీఆర్…. నీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. అడ్డగోలుగా ఛార్జీల పెంపుతో జనం నడ్డి విరుస్తున్నావ్… రకరకాల పేర్లతో 3 ఏళ్లలో ఏకంగా 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి పేదల రవాణాకు ఏకైక సాధనమైన బస్సు ప్రయాణాన్ని దూరం చేస్తున్నావ్…. పెంచిన బస్ ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో బీజేపీ చేపట్టే ఉద్యమాల సెగను చవి చూడక తప్పదు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతాం’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. బస్ ఛార్జీల పెంపు నేపథ్యంలో బండి సంజయ్ ఈరోజు ఉదయం సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ ను సందర్శించారు. నేరుగా ప్రయాణీకులను కలిశారు. బస్సుల్లో కలియతిరుగుతూ ఛార్జీల పెంపుపై ప్రయాణీకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. బస్ ఛార్జీల పెంపుతో వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పెరిగిన బస్ ఛార్జీలతో తమకు చాలా ఇబ్బంది ఎదురవుతోందని…. ఛార్జీల భారాన్ని మోయలేకపోతున్నామని ప్రయాణీకులు వాపోయారు. మొన్నటి వరకు ఫంక్షన్లకు ఫ్యామిలీతో కలిసి బస్సులో వెళ్లి వచ్చే వాళ్లమని…. కానీ పెరిగిన బస్ ఛార్జీల భారంతో కుటుంబంతో కలిసి ఫంక్షన్ కు వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నలుగురితో కలిసి బస్సులో వెళ్లడం కంటే ప్రైవేటు వాహనంలో వెళితేనే తమకు కలిసొస్తుందని చెప్పారు.

ప్రయాణీకుల ఇబ్బందులను తెలుసుకునేందుకు వచ్చిన బండి సంజయ్ తో ఆర్టీసీ పారిశుధ్య సిబ్బంది, తాత్కాలిక సిబ్బందితోపాటు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు కలిసి తమ సమస్యల గోడును వెలిబుచ్చారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమకు వేతనాలు పెరగడం లేదంటూ పారిశుధ్య సిబ్బంది వాపోయారు. తమకు కనీసం బస్ పాస్ సౌకర్యం కూడా లేదని, ఉన్నతాధికారులు తమను చీపురు పుల్లలా తీసిపారేస్తున్నారని వాపోయారు. తమకు రెండు పీఆర్సీలు ఇవ్వలేదని, 5 డీఏలు పెండింగ్ లో పెట్టారంటూ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధలన్నీ విన్న బండి సంజయ్ ఆర్టీసీని పరిరక్షించుకునేందుకు, కార్మీకులకు అండగా ఉండేందుకు తమ పార్టీ క్రుషి చేస్తోందన్నారు. అట్లాగే పెంచిన బస్ ఛార్జీలను తగ్గించే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సంజయ్ చేసిన వ్యాఖ్యల్లోని పూర్తి పాఠం వివరాలిలా ఉన్నాయి….

• ఈ రాష్ట్రంలో పేదలు, మధ్య తరగతి ప్రజలు బతకడం కేసీఆర్ ప్రభుత్వానికి అస్సలు ఇష్టం లేనట్లుంది. ఇప్పటికే అడ్డగోలుగా కరెంట్ ఛార్జీలు పెంచిండు… ఆస్తి పన్ను పెంచిండు… నల్లా బిల్లులు పెంచిండు… వ్యాట్ పేరుతో పెట్రోలుపై లీటర్ కు 30 రూపాయలు దండుకుంటుండు.. ఇట్లా అన్నీ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరగ్గొడుతున్న కేసీఆర్ ఇప్పుడు మళ్లా ఆర్టీసీ ఛార్జీలను ఎడాపెడా పెంచేసిండు. సామాన్యుడు ఎటు వెళ్లాలన్నా దిక్కుగా ఉన్న ఆర్టీసీ బస్సును కూడా దూరం చేస్తున్నడు. ప్రజల బతుకును ఆగమాగం చేస్తుండు…

• టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినంక ఆర్టీసీ ఛార్జీలను పెంచడం ఇది ఐదోసారి. నిన్న ఏకంగా 20 నుండి 30 శాతం దాకా ఛార్జీలు పెంచిండు. మొత్తంగా చూస్తే కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇఫ్పటి వరకు ప్రయాణీకులపై సగటున 60 శాతంపైగా ఆర్టీసీ ఛార్జీలను పెంచిండు. ఇగ మినిమం టిక్కెట్ ధరను వంద శాతం పెంచారు. 2018లో హైదరాబాద్ నుండి కరీంనగర్ కు బస్సులో వెళ్లాలంటే 2018లో 200 రూపాయలుంటే… ఇప్పుడది 300 దాటిపోయింది.

• ఎంత దుర్మార్గమంటే… 3 ఏండ్లలోనే 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిండు. 2019లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసిన వెంటనే ఆర్టీసీ ఛార్జీలను 25 శాతందాకా పెంచి జనంపై భారం మోపిండు. ఆ తరువాత ‘‘సేఫ్టీ సెస్’’ పేరుతో ఒకసారి పెంచిండు. ‘‘రౌండ్ ఫిగర్’’ పేరుతో ఇంకోసారి పెంచిండు. ‘‘పల్లె వెలుగు’’ బస్సుల ఛార్జీల పెంపుతో మూడోసారి పెంచిండు. ‘‘బస్ పాసుల’’ పెంపుతో నాలుగోసారి పెంచిండు. ఇప్పుడు ‘‘డీజిల్ సెస్’’ పేరుతో 5వ సారి ఆర్టీసీ ఛార్జీలను పెంచారు.

• ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోకానీ…. దేశ చరిత్రలో కానీ ఆర్టీసీ బస్సు ఛార్జీలను 3 ఏళ్లలో 5 సార్లు పెంచిన దాఖలాల్లేవు. కేసీఆర్ మూర్ఖపు పాలనలో మాత్రమే అది సాధ్యమైంది. ఆర్టీసీ గరీబోళ్ల బస్సు. సామాన్యుడి రవాణాకు ఉన్న ఏకైక మార్గం ఆర్టీసీ బస్సు. గరీబోళ్లు ఆ బస్సు కూడా ఎక్కకుండా చేస్తున్న సీఎం బహుశా దేశంలో కేసీఆర్ మాత్రమే ఉన్నాడేమో….

• అసలు ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సిన అవసరమేముంది? అప్పుడంటే కార్మికుల సమ్మెవల్ల ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందంటివి. ఛార్జీలు పెంచకపోతే ఆర్టీసీని మూసేయాల్సిన దుస్థితి ఉందంటివి… మరి ఇప్పుడేమైంది? డీజిల్ సెస్ పేరుతో 20 నుండి 30 శాతం ఛార్జీలు పెంచితివి. దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినందున ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్లిందని మళ్లీ కథలు చెబుతుంటివి.

• నేనడుగుతున్నా…. పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగితే కేంద్రం 2 సార్లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీనివల్ల లీటర్ పెట్రోలుపై ఒకసారి 5 రూపాయలు, ఇంకోసారి 9 రూపాయల 50 పైసలు తగ్గింది. అట్లాగే డీజిల్ పై ఒకసారి 10 రూపాయలు, ఇంకోసారి 7 రూపాయలు తగ్గించింది. అంటే కేంద్రం 6 నెలల కాలంలోనే లీటర్ పెట్రోలుపై దాదాపు 15 రూపాయలు, డీజిల్ పై 17 రూపాయలు తగ్గించింది.

• కానీ కేసీఆర్ చేసిందేమిటి?…. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్, డీజీల్ పై ఒక్కో లీటర్ కు అత్యధికంగా వ్యాట్ (35.2 శాతం) పన్నును వసూలు చేస్తున్నడు… వ్యాట్ రూపంలో ఒక్కో లీటర్ కు 30 రూపాయలకు పైగా దండుకుంటున్నడు. అందువల్లే పంజాబ్ వంటి రాష్ట్రాల్లో లీటర్ పెట్రోలు 94 రూపాయలకే దొరుకుతుంటే… మన రాష్ట్రంలో మాత్రం లీటర్ పెట్రోలు ధర రూ.110 దాటింది.

• కేసీఆర్ యవ్వారమంతా శవాలపై పేలాలు ఏరుకుని తినేరకం… అసలే పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నయని జనం అల్లాడుతుంటే… వ్యాట్ పేరుతో దోచుకుంటూ… ప్రజలను మరింత పీడిస్తూ రాక్షసానందం పొందుతున్నడు. వ్యాట్ పేరుతోనే ఏటా 10 వేల కోట్లకుపైగా దండుకుంటున్నడు. ఈ ఏడేళ్లలోనే 65 వేల కోట్ల రూపాయలను వ్యాట్ పేరుతో దోచుకున్నడు. పైగా మళ్లా పెట్రోలు, డీజిల్ రేట్ల సాకు చూపి సామాన్యుడి గరీబ్ రథమైన ఆర్టీసీ బస్సు ఛార్జీలను కూడా ఎడాపెడా పెంచేసి జేబు నింపుకుంటున్నడు.

• పోనీ ఇంత దారుణంగా బస్సు ఛార్జీలు పెంచి కేసీఆర్ సాధించేదేమిటి? ఆర్టీసీని గట్టెక్కించిండా?… కార్మికుల జీవితాలను బాగు చేసిండా?… లేదు. ఆర్టీసీని నిండా ముంచేసి అప్పుల పాల్జేసిండు… చివరకు ఆర్టీసీ విలువైన ఆస్తులను కూడా లీజు పేరుతో టీఆర్ఎస్ నేతలకు దారాధత్తం చేసిండు. ఆర్మూరు పట్టణంలో ఆర్టీసీ విలువైన స్థలాన్ని అక్కడి ఎమ్మెల్యేకు, వరంగల్ టైర్ల పరిశ్రమ కోసమంటూ ఆర్టీసీ స్థలాలను టీఆర్ఎస్ లీడర్లకు అప్పగించిండు…

• ఇగ ఆర్టీసీ కార్మికులనైతే ఆగమాగం చేసిండు. నెలనెలా సక్రమంగా జీతాలు కూడా చెల్లించడం లేదు. కార్మికులకు ఇవ్వాల్సిన 2 పీఆర్సీలను పెండింగ్ లో పెట్టిండు. 5 డీఎల్ లు ఇవ్వనేలేదు. దేశ చరిత్రలో ఆర్టీసీ కార్మికులకు 2 పీఆర్సీలు, 5 డీఎల్ లు పెండింగ్ లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేదు. కేసీఆర్ రూపంలో ఉన్న మానవ మ్రుగానికి మాత్రమే ఇది సాధ్యమైంది. పక్కనున్న కర్నాటక, ఏపీని చూసైనా కేసీఆర్ కు బుద్ది రావడం లేదు.. ఇటు ఛార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరిస్తున్నడు… అటు ఆర్టీసీ కార్మికులను అరిగోస పెడుతున్నడు… ఆర్టీసీని ప్రజలకు దూరం చేస్తున్నడు… అనివార్యంగా ప్రైవేటుపరమయ్యేలా చేస్తున్నడు… ఇదేందని కార్మికులు కనీసం గొంతెత్తి ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేసిండు. వారి పక్షాన పోరాడే యూనియన్లను కమ్మేసిండు. ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా?

• ఈ కేసీఆర్ ను నేనడుగుతున్నా… ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదంటివి కదా… లాభాల బాటలో నడిపిస్తానంటివి కదా… కార్మికుల బతుకులు బాగు చేస్తానంటివి? కదా… ఇందులో ఏ ఒక్కటైనా చేసినవా? కేసీఆర్ సీఎం కాకముందు 10 వేల ఆర్టీసీ బస్సులుంటే… 4 వేలు తగ్గిస్తివి. 6 వేలకే పరిమితం చేస్తివి. అట్లాగే ఆనాడు 12 వందల ప్రైవేటు బస్సులు మాత్రమే ఉంటే… ఇయాళ 3 వేలకుపైగా చేస్తివి. అంటే ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సుల్లో 50 శాతం ప్రైవేటు బస్సులే. అసలు ఆర్టీసీ చట్టం ఏం చెబుతోందా తెలుసా…? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ బస్సుల్లో 20 శాతానికి మించి ప్రైవేటు బస్సులు ఉండటానికి వీల్లేదని…

• కానీ కేసీఆర్ చేసిందేమిటి? ఆయనకు చట్టాలంటే లెక్కలేదు… పేదలు, మధ్యతరగతి ప్రజలంటే విలువ లేదు… రాజ్యాంగమంటే లెక్కలేదు… ఇట్లాంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఉద్యోగాలకు సక్రమంగా జీతాలివ్వకుండా వేధిస్తుంటివి? వ్రుద్దులకు ఆసరా పెన్షన్లు ఒక నెల ఎగ్గొట్టడమే కాకుండా ఎప్పుడు పెన్షన్ పడతదో అర్ధం కాకుండా చేస్తివి… ప్రజలను మద్యానికి బానిస చేసి కుటుంబాలను చిన్నాభిన్నం చేసి ఆడవాళ్ల ఉసురు తీస్తుంటివి… రైతులకు అన్ని సబ్సిడీలు బంద్ చేస్తివి… చివరకు నారు పోసుకునే టైమొస్తున్నా రైతు బంధు డబ్బులు కూడా ఇంతవరకు జమ చేయకుండా తిప్పలు పెడితివి. రుణమాఫీ అమలు చేయవైతివి… నీ పాలనలో నువ్వు ఎవరికి మేలు చేసినట్లు? కార్మికులను, కర్షకులను, మహిళలను అరిగోస పెడుతుంటివి. హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తివి. ఆడబిడ్డలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొస్తివి…

• ప్రజలారా… ఇట్లాంటి దుర్మార్గుపు, మానవత్వం లేని ప్రభుత్వం ఇంకా కొనసాగుతుంటే చూస్తూ ఉందామా? రండి… పెంచిన ఆర్టీసీ ఛార్జీలను ఉపసంహరించుకునేదాకా కేసీఆర్ మెడలు వంచుదాం రండి… పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించేదాకా ప్రగతి భవన్ ను షేక్ చేద్దాం… కదిలిరండి… ఈ దుర్మార్గపు, నీచ, నిక్రుష్టపు కేసీఆర్ పాలనను కూకటి వేళ్లతో పెకిలించేదాకా ఉద్యమిద్దాం… రండి…

• బీజేపీ కార్యకర్తలారా…. అడ్డగోలుగా ఛార్జీలు పెంచి… శాంతి భద్రతలను క్షీణింపజేసి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కేసీఆర్ కుటుంబానికి ఇకపై నిద్ర లేకుండా చేద్దాం… బీజేపీ చేసే ఉద్యమాలతో ఫాంహౌజ్ దద్దరిల్లాలే… ప్రగతి భవన్ కోటలు బీటలు వారాలే… రండి… తరలిరండి.. ప్రతి ఒక్కరూ కదం తొక్కుతూ కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడదాం రండి…

Leave a Reply