Suryaa.co.in

Telangana

కర్పూరి ఠాకూర్ స్పూర్తితో బీసీలు రాజ్యాధికారం చేజిక్కించుకోవాలి

కొన్ని అవార్డులు మనకు ఇచ్చేసి అధికారం వారితో ఉంచుకునే పద్దతి మారాలి
– బీఎస్పీ ఏపీ కోఆర్డినేటర్ డా .జే పూర్ణచంద్ర రావు

హైదరాబాద్‌: స్వతంత్ర భారత దేశ చరిత్రలో జననాయాక్, భారతరత్న బిరుదాంకితులు కర్పూరి ఠాకూర్ లాంటి మహోన్నత వ్యక్తులు చాలా అరుదని, అసలు అంతటి ఉన్నత భావాలు, పోరాటపటిమ ఉన్న వ్యక్తి ఉండడం కులాధిపత్య రాజకీయాల్లో పైకి రావడం ఆశ్చర్యమని బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ కోఆర్డినేటర్, రిటైర్డ్ డీజీపీ డా జుజ్జవరపు పూర్ణచంద్ర రావు అభిప్రాయపడ్డారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో బీసీ టైమ్స్- బీసీ సమాజ్ సంయుక్తంగా నిర్వహించిన జననాయక్, భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి – పుస్తకావిష్కరణలో అయన ముఖ్య అతిధిగా ప్రసంగించారు.

ఈ సందర్భంగా పూర్ణచంద్ర రావు మాట్లాడుతూ . బీసీలకు రాజ్యాధికారం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కర్పూరి ఠాకూర్ ని స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలి అన్నారు. మాణిక్యాలను వెలికితీసినట్టు, ఇటువంటి బీసీ మాణిక్యాల చరిత్రను మనం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి అని చెప్పారు.

మంగలి సామాజిక వర్గంలో పుట్టి ముఖ్యమంత్రి అవడం అనేది చాలా గొప్ప విషయం. నేడు బీసీలను అణగదొక్కి, అధికారంలోకి రాకుండా చేస్తున్న పరిస్థితుల్లో కర్పూరి ఠాకూర్ గారి జీవితం మార్గదర్శకం కావాలి. కేవలం కొన్ని కులాల చేతిలో చిక్కిన అధికారాన్ని, బీసీలకు ఇవ్వకుండా జరుగుతున్న కుట్రలపై బీసీ సమాజం మేలుకోవాలి. కేవలం కొన్ని కొన్ని అవార్డులు మనకు ఇచ్చేసి, అధికారం వారితో ఉంచుకు నే పద్దతి మారాలి. నేడు బీసీ సమాజం కలిసికట్టుగా మనం బీసీలం, మనమందరం బీసీలం అని చెప్పుకోవాలి. అగ్రకులాల పాలకులకు ఇదే హెచ్చరిక, అణగారిన కులాలకు అధికారం పంచండి, లేకపోతే వారి తిరుగుబాటు తట్టుకోలేరు.

50 శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే సవాలక్ష షరతులు పెట్టె సర్కారు అగ్రకులాలకు మాత్రం పది శాతం ఎంతో సులువుగా ఇచ్చారు. ఇటువంటి విధానాలు మారాలంటే బీసీలు అధికారం చేజిక్కించుకోవాలి. రాజ్యాంగాన్ని కుళ్ళబొడిచే శక్తులను అడ్డుకొవాలంటే బీసీల సంఖ్య అసెంబ్లీల్లో పెరగాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ టైమ్స్ కి చెందిన సంగెం సూర్యారావు, పల్లె సత్యం వంశరాజ్, అన్నవరపు బ్రహ్మయ్య తదితరులు ప్రసంగించారు.

LEAVE A RESPONSE