సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ తో మంత్రి సవిత
పుట్టపర్తి : మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఈమేరకు అమరావతి నుంచి కలెక్టర్ తో మంత్రి ఫోన్లో మాట్లాడారు.
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నడుమ భారీ వర్షాల కురవడం ఆనందంగా ఉందన్నారు. అదే సమయంలో నదీ తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా పంట నష్టం వాటిల్లితే తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందజేయాలని కలెక్టర్ ను మంత్రి సవిత ఆదేశించారు. వరుస వర్షాలతో గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని మంత్రి అలెర్ట్ చేశారు.
గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని, మురికి కాలువల్లో మురుగు తొలగించాలని, వర్షపునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు. ముఖ్యంగా హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులకు వేడి ఆహారం, గోరువెచ్చని నీరు అందించాలన్నారు. విద్యార్థులకు అనారోగ్య లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్య సేవలు అందించాలన్నారు. బయట ఆహారాలు హాస్టళ్లోకి వెళ్లనివ్వకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ను ఫోన్ లో మంత్రి సవిత ఆదేశించారు.