మహా పురుషులుగా పేరు పొందిన మహనీయులు, ఇతరులపై జాలి, దయ, ప్రేమ చూపించాలని బోధించారు. వేగంగా పరుగెడుతున్న ఈ ఆధునిక కాలంలో క్రమక్రమంగా మనిషిలో స్వార్ధం పెరుగుతుంది.
మనం ఒకరితో దయగా ఉంటే ఆ ఒకరు మరొకరితో దయగా ఉంటారు. సాహసం, వీరత్వం కంటే దయ కలిగినవాడే గొప్పవాడు. ఇంట్లో, ఆఫీసుల్లో, సంఘంలో దయ లోపించడం వల్లే ఇవాళ అనేక అకృత్యాలు జరుగుతున్నాయి.
జాలి, దయ, సహనము, కరుణ, కోపము, ఈర్శ్య , ఆందోళన … అన్నీ కూడా మానవుల్లో ఉండే వివిధ కోణాలు . విభిన్న పరిస్థితుల్లో వివిధ రూపాల్లో ప్రతిస్పందించడం మానవ నైజము . అయితే వీటిలో కొన్ని అనుకూల ధోరణికి ప్రతిబింబాలయితే,మరికొన్ని వ్యతిరేక ధోరణిని తెలియజేస్తాయి. శాంతంగా, సహనంగా ఎదుటి వారి సమస్యలు విని, అర్ధం చేసుకుని, తోటివారికి సాయపడే గుణము కలిగి ఉండడం గొప్ప విషయంగా చెప్పవచ్చు.
కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాలన్న కరుణాభావం పరిసరాలన్నింటినీ పర్వదినం గా మార్చగల అపూర్వ శక్తిని కలిగివుంటుంది . దేశ సరిహద్దులు, సంస్కృతులు, కులము, మతము, జాతి అన్నవేమీ లేకుండా మనమందరం ప్రపంచ పౌరులమన్న భావన కలిగి ఒకరిపై ఒకరు దయా గుణము కలిఉండడానికి చేసే ప్రయత్నమే నవంబర్ 13న జరుపుకునే ఈ ప్రపంచ దయాగుణ దినోత్సవం ముఖ్య ఉద్దేశము.
1998 నుండి ఈ దయాగుణ దినోత్సవాన్నిజరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో ఈ దినోత్సవం జరుపుతారు. చిన్న పిల్లలు కిడ్డీ బ్యాంకులలో డబ్భులు దాచుకుంటారు. ఇతరులకు ఏదైనా సమస్య వస్తే తాము దాచుకున్న డబ్భులో కొంత భాగాన్ని వారికిచ్చే అలవాటు ను పిల్లలకు నేర్పాలి. వారికి వివిధ సమస్యల పట్ల అవగాహన కల్పించాలి. అలాగని ఉన్నదంతా దానం చేయాల్సిన అవసరం లేదు.
సమాజంలో మంచిని పెంచడం చాలా అవసరం. ఇది కుల, మతాలకు అతీతంగా జరగాలి.నేటి విద్యార్థులే రేపటి తరానికి నాయకులు. పూలే, అంబేద్కర్, గాంధీ వంటి వారు ఎదుటి వారి పట్ల దయ చూపబట్టే, వారి సమస్యలను అర్ధం చేసుకుని, వివిధ రకాల మార్గాల్లో వాటి పరిష్కారానికి కృషి చేశారు. అదే విధంగా జంతువుల పట్ల కూడా దయ చూపించాలి. ఎందుకంటే అవి కూడా ప్రకృతిలో భాగమే కదా.
– వి.ఉమామహేశ్వరరావు