మాఘ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ రోజునే కురుకుల యోధుడు భగవంతుడిలో ఐక్యమైన రోజు. బీష్ముడు పాండవులకు చేసిన మహోపదేశం విష్ణు సహస్రనామం. కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు.
నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికాలుడుతు గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుడిని ప్రశ్నించారు. “మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః” కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడని ఆ జగన్నాటక సూత్రధారి సమాధానం ఇస్తాడు.
అందుకే నా మనసు అక్కడికి వెళ్లిపోయింది , మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు , ధర్మశాస్త్రాలను అవపోశణం పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది , ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోడానికి రండి’ అని భీష్మపితామహుడి చెంతకు తీసుకు వచ్చాడు.
సుమారు మూడు పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ , మంచుకు తడుస్తూ , నీరు , ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది , కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకున్నాడు.
తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు. అంతటి జ్ఞానం కలిగిన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. అలాంటి వాళ్లు ఏ రోజు నిష్క్రమించినా వైకుంఠం ప్రాపిస్తుంది. భీష్ముడు తనకి మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు..