– ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ విమర్శ
మంగళగిరి : మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ విమర్శలు గుప్పించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పార్టీ అబద్ధాల పునాదిగా, అసత్యాలే ఎజెండాగా నడిచే పార్టీ అని వారికి నిజాలు చెప్పే అలవాటు లేదని తీవ్రంగా విమర్శించారు. వీరు తిరుమలలో వెంకన్న స్వామి లేడనో, లక్ష్మణుడు సీతమ్మకు గీత గీయలేదనో అహల్య రాయిగా మారలేదనో కూడా చెప్పగలరని… ఇదే వైసీపీ సిద్ధాంతమని ఆరోపించారు.
భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారానికి వెనకాడని వ్యక్తి అని ఆయన గతాన్ని గుర్తు చేశారు. భూమన తన జీవితాన్ని సొంత డబ్బులు లేకుండా, ఒక పార్ట్నర్తో కలిసి జిరాక్స్ మిషన్ నడిపే వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. భూమన భూకబ్జాలు, అవినీతి అక్రమాలు చేశారని విమర్శించారు. స్వర్ణముఖి నదిలో 11 ఎకరాలు కబ్జా చేశారని, దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు. కపిల తీర్థం ఎదురుగా ఉన్న జ్ఞాన మందిరం భవనాన్ని కూడా కబ్జా చేసి, తన పీఏ పేరు మీద అద్దెకు తీసుకుని హోటల్ నడుపుతున్నారని దీనిపైనా విచారణ నడుస్తోందని పేర్కొన్నారు.
అన్నమయ్య సెంటర్లో కూడా కబ్జా చేశారని ఆరోపించారు. తిరుపతిలో ఉన్న గోవిందరాజు స్వామి, కోదండ స్వామి సత్రాల్లోని 450 గదులను కూలగొట్టి డబ్బులు మళ్లించారని, అలాగే ₹600 కోట్ల టెండర్లలో కూడా అవినీతి జరిగిందన్నారు. టీడీఆర్ బాండ్లలో కూడా భూమన అవినీతికి పాల్పడ్డారని, దానిపై కూడా విచారణ నడుస్తోందని పేర్కొన్నారు. భూమన అవినీతి భాగోతాలు “పాము పుట్ట”లాగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.
బీ.ఆర్. నాయుడు టీవీ5, ఫార్మా కంపెనీల ద్వారా వేల మందికి ఉపాధి కల్పిస్తే, భూమన వేల మంది భూములను దోచేసిన ఘనత తన సొంతం చేసుకున్నారన్నారు.
నాయుడు నియామకమై సంవత్సరం అయినా ఒక్క చిన్న అవినీతి మరక కూడా లేదని ప్రశంసించారు. భూమనకి హిందూ ఆచారాలు, సంప్రదాయాల గురించి మాట్లాడే అర్హత లేదు. గతంలో కరుణాకర్ రాడికల్ స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పుడు దేవుడి విగ్రహాలను ఉద్దేశిస్తూ “ఇది నల్లరాయి” రాయితో కొడితే తప్పేంటి? అని మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. పరివట్టం వివాదంపై కరుణాకర్ విమర్శలను ఖండిస్తూ టీటీడీ ఆచారాలను వివరించారు. ఈవో, జేఈఓ వంటి ‘సర్కార్’ ఉన్నతాధికారుల కుటుంబంలో ఎవరైనా చనిపోతే, మైలు అయిన తర్వాత పరివట్టం కట్టడం సంప్రదాయం అన్నారు.
బీ.ఆర్. నాయుడు కేవలం శాలువా మాత్రమే కప్పారని, అది ఆచారానికి విరుద్ధం కాదని తెలిపారు. భూమన అధికారంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి కొడుకు చనిపోయినప్పుడు తానే దగ్గరుండి పరివట్టం కట్టించారు. ఇప్పుడు అదే ఆచారాన్ని విమర్శించడం “గురిగింజ సామెత”లా ఉందని ఎద్దేవా చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, చివరికి స్వామి వారి ఉత్సవాల్లోని ఏనుగు చనిపోయినా కూడా ఆచారం ప్రకారం పరివట్టం కడతారని ఆచారాన్ని వివరించారు.
వెంకటేశ్వర ఎంప్లాయిస్ ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్‌గా విరసంలో పని చేసిన తన సోదరుడు సుబ్రహ్మణ్య రెడ్డిని నియమించారు. బర్డ్స్ డైరెక్టర్‌గా రెడ్డప్ప రెడ్డిని, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్రత్యేక అధికారిగా జయచంద్ర రెడ్డిని అన్యాయంగా నియమించారని ప్రశ్నించారు. గుడిలో పూజారులు మాత్రమే పాల్గొనే ఏకాంత సేవలోకి బయటి వ్యక్తులను తీసుకెళ్లిన ఘనత కూడా భూమనదేనని ఆరోపించారు. భూమన హిందూ సాంప్రదాయాలపై, టీటీడీపై మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే ప్రజలు జ్ఞానం లేని వ్యక్తిగా భావిస్తారని హెచ్చరించారు