-‘ప్రజాగళం’ విజయంతో జగన్ వెన్నులో వణుకు
-కూటమి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై బీసీల్లో హర్షం వ్యక్తమవుతోంది
-ప్రధాని సభకు భద్రత కల్పించడంలోనూ కక్ష పూరితంగా వ్యవహరిస్తారా?
– కొల్లు రవీంద్ర
ఒకవైపు ప్రజాగళం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్, మరోవైపు కూటమి బీసీ డిక్లరేషన్‌పై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుండడంతో జగన్ రెడ్డికి వెన్నులో వణుకు మొదలైంది. ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మారు. అందుకు నిదర్శనం.. చిలకలూరిపేటలోని ప్రజాగళం సభ. జాతీయ రహదారిపై సుమారు 20 కిలోమీటర్లకు పైగా వాహనాలు స్తంభించిపోయాయి.
సభకు పది లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఇంత భారీగా జరుగుతున్న సభ విషయంలో పోలీసుల వైఖరి, పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ప్రధాన మంత్రి హాజరయ్యే సభను, అక్కడి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన బాధ్యత డీజీపీకి లేదా? ట్రాఫిక్ నియంత్రించాల్సిన పోలీసులు, బారికేడ్లు పెట్టి ఆపేయడమేంటి? వాహనాలు కదలనీయకుండా నిలువరించడం వెనుక జగన్ రెడ్డి హస్తం ఉంది. మరోవైపు సౌండ్ సిస్టం వద్ద రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఏమైపోయారు?
చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడినపుడు అడ్డంకులు సృష్టించారు. చివరికి ప్రధాన మంత్రి మాట్లాడినపుడు కూడా మైక్ సమస్య సృష్టించడం జగన్ నీతిమాలిన తనానికి నిదర్శనం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలకు పాల్పడి సభను అడ్డుకోవాలని ప్రయత్నించినా.. వారి తరం కాదు. ఎస్పీజీ, జెడ్ ప్లస్, జడ్, వై ప్లస్, వై క్లాస్ సెక్యూరిటీ కలిగిన ప్రముఖులు హాజరైన సభలో భద్రత ఏర్పాట్లు ఇలాగేనా చూసేది?
ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని అవాంతరాలు ఏర్పాటు చేసినా లక్షలాదిగా ప్రజలు తరలి రావడం శుభపరిణామం. జగన్ రెడ్డి అరాచకంపై ప్రజా తిరుగుబాటుకు ఈ జనసంద్రం నిదర్శనం. ఇదే స్పూర్తిని రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తాం. ప్రతి ప్రాంతంలోనూ భారీ సభలు నిర్వహిస్తాం. ప్రజలకు జగన్ రెడ్డి పెట్టిన అవస్థలపై ఉద్యమిస్తాం. రాష్ట్ర మంత్రి వర్గం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని సాక్ష్యాత్తు ప్రధాన మంత్రి చెప్పారంటే రాష్ట్రంలో పరిస్థితి అర్ధమవుతోంది.
కేంద్ర సహకారంతో గతంలో ఏం సాధించామో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతగా పరితపించామో ప్రధాని స్పష్టం చేశారు. కానీ, గత ఐదు సంవత్సరాల్లో తన అవినీతి కేసులు, కోడి కత్తి లాంటి డ్రామాలు, బాబాయి బాత్రూం మర్డర్ కేసుల నుండి తప్పించుకోవడానికే ప్రయత్నించారు. రాష్ట్రానికి పనికొచ్చే ఒక్క ప్రాజెక్టు అయినా కేంద్రం నుండి ఆమోదింపజేసుకున్నారా? జగన్ రెడ్డికి సిగ్గుంటే గత ఐదేళ్లలో తీసుకొచ్చిన ఒక్క సంస్థ పేరయినా చెప్పాలి. ప్రధాని వాస్తవాలు చెబితే, తమ బండారం బయటపడుతుందనే మైక్ కట్ చేశారా?
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అయినా, ఇంకా కొంత మంది అధకారులు జగన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తుతున్నారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు తొలగంచడంపై ఉన్న శ్రద్ధ, వైసీపీ ఫ్లెక్సీలపై ఎందుకు చూపడం లేదు? ఇళ్లపై అభిమానంతో ఏర్పాటు చేసుకున్న జెండాలను కూడా పీకడం అధికారుల అత్యుత్సాహానికి నిదర్శనం. జగన్ రెడ్డికోసం పని చేస్తున్న అధికారులు పద్దతి మార్చుకోవాలి. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయి. ఇప్పటి వరకు జగన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తి, వైసీపీ జెండాలు మోసిన అధికారులందరినీ హెచ్చరిస్తున్నా. పద్దతి మార్చుకోకుంటే తర్వాత పరిణామాలకు సిద్ధంగా ఉండండి.
తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి తాజాగా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ డిక్లరేషన్ విడుదల చేశాం. అది చూసినప్పటి నుండి జగన్ రెడ్డికి నిద్ర లేకుండా పోయింది. ఆ డిక్లరేషన్తో తమ బతుకులు మారతాయనే భరోసా బీసీ వర్గాల్లో కలిగింది. బీసీలకు మేలు చేసేది, చేయగలిగేది తెలుగుదేశం మాత్రమేనని ప్రజలు తెలుసుకున్నారు. తన అవినీతి పత్రికలో బీసీల గురించి చెత్త రాతలు రాయడం హేయం. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చి అండగా నిలిచామని చెప్పుకునే జగన్ రెడ్డి.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు కుదింపుపై సమాధానం చెప్పాలి.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోతతో 16,800 పదవులు రద్దు చేసి పదిమందికి పదవులివ్వడం ఉద్దరించడమా? బీసీ పథకాలు రద్దు చేశారు. రూ.75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. కార్పొరేషన్లు నాశనం చేశారు. వందలాది మంది బీసీల పీకలు కోసి హత్య చేశారు. వేలాది మందిపై అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఓడిపోయే స్థానాలు బీసీలకు కేటాయించి ఎక్కువ సీట్లు ఇచ్చాననడానికి సిగ్గుపడాలి. రాయలసీమలో బీసీలకు ఎన్ని సీట్లిచ్చావో చెప్పగలవా?
ఐదుగురు జగన్ రెడ్డి వర్గానికి చెందిన పెత్తందార్లకు రాష్ట్రాన్ని దారాదత్తం చేశారు. అక్కడి బీసీలపై పెత్తనం చెలాయిస్తున్నారు. మంత్రుల్ని, ఎమ్మెల్యేలను శాసించిన జగన్ రెడ్డి బీసీల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. పదవుల గురించి మాట్లాడే జగన్ రెడ్డి టీటీడీ, ఏపీఐఐసీ లాంటి సంస్థల్లో బీసీలకు ఏం ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలు ఆ పదవులకు పనికిరారా? అన్నీ రెడ్లకేనా? ఇదేనా సామాజిక న్యాయం?
కూటమి అధికారంలోకి వచ్చాక కోల్పోయిన రిజర్వేషన్లను పునరుద్దరించుకుంటాం. అన్ని నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసి తీరుతాం. ఆగిపోయిన ప్రతి పథకాన్ని పునరుద్దరించుతాం. ఆర్ధికంగా సామాజికంగా రాజకీయంగా బీసీలను ఉన్నత స్థానంలో నిలిపితీరే బాధ్యత కూటమి తీసుకుంటుంది. జగన్ రెడ్డి ఎన్ని నీతి మాలిన రాతలు రాసినా.. నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు.
గ్రామ గ్రామానా తిరుగుతాం. ఎంత మందిని పొట్టన పెట్టుకున్నావో చెబుతాం. వ్యవస్థల్ని నాశనం చేసిన విధానం చెబుతాం. దోపిడీ, అన్యాయం అక్రమాలపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు ప్రజలు సిద్ధమైపోయారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటామని ప్రజలు నినదిస్తున్నారని హెచ్చరించారు.