మే 13వ తేదీతో రాష్ట్రానికి కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పీడ విరగడ

-కడప జిల్లాకు చెందిన మరికొంతమంది అధికారులు, బూట్లు నాకే సీనియర్ పోలీసు అధికారులకు విశ్రాంతి
-యుద్ధంలో నువ్వు, నీ అసుర గణం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి
-జనాలను చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ఎన్ని టీవీలు పగిలాయో?
-ప్రతి అంశాన్ని ప్రధానమంత్రి మోడీ యే చెప్పరు
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

నువ్వు సిద్ధం అని అంటున్నావు. కూటమి నేతలు యుద్ధమని అంటున్నారు. ఈ యుద్ధంలో నువ్వు, నిన్ను నమ్ముకున్న కొంతమంది అసుర గణం తుడిచిపెట్టుకుపోవడం ఖాయం జగన్మోహన్ రెడ్డి అని నరసాపురం ఎంపీ రఘు రామ కృష్ణంరాజు హెచ్చరించారు.

సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మూడేళ్ల క్రితం మే 14వ తేదీ జగన్మోహన్ రెడ్డి నన్ను అక్రమంగా నిర్బంధించి పోలీసుల చేత లాకప్ లో చిత్ర హింసలకు గురి చేశారన్నారు. ఈ ఏడాది మే 13వ తేదీతో రాష్ట్రానికి కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పీడ విరగడ అవుతుందన్నారు. నా అరికాళ్లపై ఆ దరిద్రులు కొట్టిన దెబ్బలు, మీ అరికాళ్ళపై కొట్టిన దెబ్బలుగా భావించి మళ్లీ ఇటువంటి నీచ ప్రవృత్తి కలిగిన వ్యక్తులను ఎన్నుకోవద్దని కోరారు.

ఒక పాలకుడు అన్యాయంగా ప్రజలని, ప్రజా ప్రతినిధులను అరెస్టు చేసి, చిత్రహింసలకు గురి చేయడం దారుణమని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు కొట్టి, వీడియోలు చూసి ఆనందించే సంస్కృతి కలిగినవారికి ప్రజలు ఈసారి చరమగీతం పాడాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

రాష్ట్రానికి మోడీ అవసరం ఎంతో ఉంది
విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం ఎంతో అవసరమని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు చక్కగా వివరించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రానికి, దేశానికి మోడీ అవసరం ఎంతో ఉందని ఆయన ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పారన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సహజ శైలిలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, దేశానికి మాత్రం రాష్ట్రాన్ని గంజాయి రాజధానిగా మార్చారని విమర్శించారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వమే సారా అమ్ముతోందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారా వ్యాపారాన్ని చేస్తున్నారని చెప్పారన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం సేవించి, ప్రజల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో పవన్ కళ్యాణ్ ప్రజలకు చక్కగా వివరించారని వెల్లడించారు. బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ప్రసంగం అద్భుతమని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.

రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించాల్సిన అవసరాన్ని చిలకలూరిపేట సభా వేదిక ద్వారా చక్కగా చెప్పారన్నారు. సత్య కుమార్ ప్రసంగాన్ని పరిశీలిస్తే, రాష్ట్ర ప్రభుత్వ అరాచక పాలనపై బిజెపి ఎంత సీరియస్ గా ఉందో ఇట్టే అర్థమవుతుందన్నారు. ప్రతి అంశాన్ని ప్రధానమంత్రి మోడీ యే చెప్పరని, బిజెపిలోని సీనియర్లు పార్టీ విధానాన్ని వెల్లడిస్తారన్నారు.

బిజెపి విధానాన్ని, నరేంద్ర మోడీ అంతరంగాన్ని సత్య కుమార్ ద్వారా విన్నామని పేర్కొన్నారు. ఇంకా ఉపేక్షించే పరిస్థితి ఉండదని, యుద్ధం మొదలయ్యిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాంచ జన్యాన్ని పూరించి శ్రీకృష్ణుడిలా వస్తారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు.

చిలకలూరిపేట సభ సూపర్ సక్సెస్ … సభ ముగిశాక ఎయిర్ పోర్టుకు వెళ్లలేని పరిస్థితి
చిలకలూరిపేటలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయిందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ సభకు జనం స్వచ్ఛందంగా తరలి వచ్చారన్నారు. ప్రస్తుతం నేను ఏ పార్టీ సభ్యుడను కాదు.

నేను ఏ పార్టీ సభ్యుడిని కాదు కాబట్టి సభా వేదికపై కూర్చునే అవకాశం లేదు. ఈ సభకు వీఐపీ పాసు ద్వారా హాజరై తొలి వరుసలో కూర్చున్నప్పటికీ, ఒక సామాన్య వ్యక్తిలా ప్రజాస్పందనను తెలుసుకునే ప్రయత్నాన్ని చేశాను. నేను ఊహించిన దాని కన్నా ఎన్నో రెట్లు అధికంగా ప్రజాస్పందన ఉందన్నారు. చిలకలూరిపేట బహిరంగ సభకు తక్కువలో తక్కువగా ఆరు లక్షల మంది పైగా ప్రజలు హాజరై ఉంటారని తెలిపారు .

సగానికి పైగా జనం సభా స్థలికి చేరుకోలేకపోయారన్నారు . సభా స్థలి కి ఎటు చూసినా 15 కిలోమీటర్ల దూరం లో ప్రజలు రోడ్లపైనే ఉన్నారన్నారు. సభ ముగిశాక ఎయిర్పోర్టుకు వెళ్లలేని పరిస్థితిలో 2014 తర్వాత తొలిసారిగా విజయవాడ నుంచి హైదరాబాదుకు వాహనంలో వచ్చానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

రోడ్లపై కిక్కిరిసిన జనం
ఒంగోలు చిలకలూరిపేట హైవే, గుంటూరు నుంచి చిలకలూరిపేటకు వచ్చే ప్రధాన రహదారి, నరసారావు పేట నుంచి చిలకలూరిపేటకు వచ్చే దారులన్నీ ప్రజలతో కిక్కిరిసిపోయాయని, ఎక్కడికక్కడే ట్రాఫిక్ రద్దీ నెలకొందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు . ట్రాఫిక్ రద్దీలో మహిళలు వాహనాలు దిగి 10 కిలోమీటర్ల మేర నడిచి సభా ప్రాంగణానికి చేరుకోగలిగిన వారు చేరుకున్నారని చెప్పారు.

సభా ప్రాంగణంలో సిద్ధం సభలలో మాదిరిగా గ్రీన్ మ్యాట్ లు లేవన్న ఆయన, ఎవర్ని సభకు బలవంతంగా తీసుకువచ్చిందీ లేదన్నారు. సభకు హాజరైన వారికి జగన్మోహన్ రెడ్డి తరహాలో మద్యం, డబ్బులు పంపిణీ చేయలేదని చెప్పారు. అభిమానంతో సభకు రావాలనుకున్న వారికి వాహనాలను మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది తప్పా, మరి ఏ ఇతర సౌకర్యాల్ని కల్పించలేదని స్పష్టం చేశారు. ప్రజలే నిండు మనసుతో కూటమి సభకు హాజరై, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బిజెపిని నాయకులను ఆశీర్వదించి, రాష్ట్రానికి పట్టిన ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.

నరేంద్ర మోడీని ప్రత్యక్షంగా చూడాలన్న ఆపేక్షతో ఎన్నో లక్షల మంది సభకు హాజరయ్యారని, కూటమి సభకు హాజరైన జనాలను చూసి తాడేపల్లి ప్యాలెస్ లో ఎన్ని టీవీలు పగిలాయో తెలియదన్నారు. బహుశా రెండు టీవీలయితే బద్దలై ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఆత్మ శాంతి కోసం చిలకలూరిపేట కూటమి సభకు లక్షమందిలోపే ప్రజలు హాజరయ్యారని తన కరపత్రిక సాక్షి దినపత్రికలో రాయించుకున్నారని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు .

అదే జగన్మోహన్ రెడ్డి సభకు లక్ష మంది హాజరైతే, 15 లక్షల మంది హాజరైనట్లుగా ప్రచారం చేసుకుంటూ… సభా ప్రాంగణానికి మీడియాను అనుమతించకుండా, గ్రీన్ మ్యాట్ , మార్ఫింగులతో జిమ్మిక్కులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిలకలూరిపేట బహిరంగ సభకు ప్రాంతీయ మీడియా తో పాటు జాతీయ మీడియా సంస్థలు కూడా హాజరై, ఏరియల్ షాట్స్ కూడా తీశాయని, సభకు హాజరైన జనం ఎంతో టీవీలలో ప్రజలు ప్రత్యక్షంగా ప్రసారం ద్వారా తిలకించిన వారికి తెలుసునని చెప్పారు.

ఈ దశాబ్దంలో ఇటువంటి సభ చూడలేదన్న జనం
చిలకలూరిపేటలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన సభ ను చూసిన జనం ఈ దశాబ్దంలో ఇంత పెద్ద భారీ బహిరంగ సభను చూడలేదని పేర్కొన్నట్లుగా రఘురామకృష్ణంరాజు తెలిపారు. సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారనే విషయం స్పష్టమవుతోందన్నారు. ప్రజలపై ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా, డ్వాక్రా మహిళలను బలవంతంగా బస్సులు ఎక్కించి తరలించకుండా, వాలంటీర్ల వార్నింగులు లేకుండా కేవలం కూటమిలోని భాగస్వామ్య పార్టీలపై అభిమానంతోనే ప్రజలు ఈ సభకు హాజరయ్యారన్నారు.

మనల్ని మనం కాపాడుకోవాలని స్పృహ కూడా ప్రజల్లో కనిపించిందని, ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడం కూడా చిలకలూరిపేట బహిరంగ సభ సక్సెస్ కు మరొక కారణమని చెప్పారు. లేకపోతే ప్రజలను వైకాపా నేతలు బెదిరించి ఉండేవారన్న ఆయన, సభా ప్రాంగణానికి కొంత దూరం నేను వెళ్ళాక, రద్దీ కారణంగా వాహనం దిగి నడుచుకుంటూ వెళుతుంటే… ప్రజలు నాపై చూపిన అభిమానం నన్ను పులకరింప చేసిందని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ఉన్మాద తత్వం పై ప్రజల్లో ఉన్న ఆక్రోషం, నాపై అభిమానంగా చూపెట్టినట్లనిపించిందన్నారు. నన్ను ఒక్క మాటలో మెచ్చుకుంటే, జగన్మోహన్ రెడ్డిని మూడు మాటలు తిడుతున్నారని, అలాంటి వారి సంఖ్య వందల్లో కాదని వేలల్లో ఉందని చెప్పారు. సభా ప్రాంగణంలో కూర్చున్నప్పుడు కూడా స్థానికులు సైతం జగన్మోహన్ రెడ్డిని తిట్టడం కనిపించింది.

సభకు హాజరైన వారు జగన్మోహన్ రెడ్డి సభకు హాజరయ్యే పెయిడ్ కూలీల వంటి వారైతే, వారిలో ఎటువంటి స్పందన కనిపించి ఉండేది కాదన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోవాలని సంకల్ప బలంతో సభకు హాజరయ్యారు కాబట్టే, వారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనను తూర్పారబట్టారని రఘురామకృష్ణంరాజు అన్నారు.

ప్రభుత్వాన్ని దింపి… మనల్ని మనం కాపాడుకోవాలన్న కసి ప్రజల్లో కనిపించింది
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారంలో నుంచి దించి వేసి, మనల్ని మనం కాపాడుకోవాలన్న కసి ప్రజల్లో స్పష్టంగా కనిపించిందని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. ప్రజల్లో కనిపించిన కసి చూస్తే సంతోషం వేసింది. గత నాలుగు సంవత్సరాలుగా నన్ను రాచి రంపాన పెట్టి, చిత్రహింసలకు గురిచేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని, అక్రమాలను ప్రతినిత్యం ప్రజలకు తెలియజేసే ప్రయత్నాన్ని చేశాను.

రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని ఎక్కడికక్కడ ఎండగట్టాను. నియోజకవర్గానికి రాకుండా ఇల్లు వదిలి ఢిల్లీలో మకాం పెట్టి ప్రజల్ని జాగృతం చేయడానికి నేను చేసిన ప్రయత్నం, ఫలించడం చూసి నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆనందంలో వచ్చే కన్నీటిని, కన్నీటి భాష్పాలని అంటారని శవాన్ని చూసి నవ్వే వారికి తెలియదని రఘురామ కృష్ణంరాజు అపహాస్యం చేశారు.

ప్రధాని ప్రసంగానికి మూడుసార్లు అంతరాయమా? పోలీసుల తీరుపై అసంతృప్తి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తుండగా పోలీసులు వ్యవహరించిన విధానం వల్ల, ఆయన ప్రసంగానికి మూడుసార్లు అంతరాయం కలిగిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రజలని చూసి ప్రజల కోసం మాట్లాడే వ్యక్తుల ప్రసంగానికి అంతరాయం కలిగినప్పుడు వారు తాము చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేకపోతారన్న రఘురామ కృష్ణంరాజు, పేపర్ చూసి చదువుతూ మాట్లాడే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు.

రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో నుంచి దిగి పోవాలని, ముఖ్యమంత్రి, మంత్రులు పోటీపడి అవినీతి చేస్తున్నారని నరేంద్ర మోడీ పేర్కొన్న విషయాన్ని రఘు రామ కృష్ణంరాజు గుర్తు చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే ఏర్పడడం ద్వారా అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని చెప్పారన్నారు.

ఎన్నికల సమయం నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో మరో నాలుగు ఐదు ఉండే అవకాశం ఉందన్నారు. అప్పుడు ప్రజలు ఆశించిన దాని కంటే రెట్టింపు స్థాయిలో కేంద్ర పెద్దల మాటల దాడి కొనసాగుతుందని చెప్పారు. పొత్తు కుదరకుండా వైకాపా నేతలు చాలా ప్రయత్నాలు చేశారు. కొంతమంది ముఖ్యమంత్రి అనుయాయులు, ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల ద్వారా రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించే విధంగా ఎత్తుగడలు వేశారు.

కానీ ఫెయిల్ అయ్యారు. మూడు నుంచి నాలుగు దశలలో ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా వారి ఓటర్లను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించి దొంగ ఓట్లు వేయించుకోవాలని భావించారు. సిద్ధం పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఒక్కొక్కటిగా తొలగించడం జరుగుతుంది. ప్రభుత్వ కార్యాలయాలలో ముఖ్యమంత్రి ఫోటోలు కూడా తీసివేస్తారు.

ఆ తరువాత పర్మినెంట్ గా ఆ ఫోటోలు కాలగర్భంలో, నేల గర్భంలో కలువాల్సిందేనని రఘురామకృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలో ఎన్నికలను మొదటి దశలో కాకుండా నాలుగవ దశలో నిర్వహించాలని ఈసీ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అక్రమాలను, అన్యాయాలను, కుట్రలను, దోపిడీలను ప్రజలకు తెలియజెప్పడానికి కూటమి నాయకులకు మరింత వెసులుబాటు లభిస్తుందన్నారు.

అధికారుల తీరు మారకపోతే ఎన్నికల కమిషన్ మార్చి వేస్తుంది
అధికారులు తమ వైఖరిని మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్ వారిని మార్చి వేస్తుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లోని ఒక సచివాలయ ఉద్యోగితో ఈ మార్పు స్టార్ట్ అయ్యింది. ఇది టీజర్ కూడా కాదు. ఒక పోస్టర్ రిలీజ్ వంటిదే.

రాబోయే రోజుల్లో తాత్కాలిక డీజీపీగా కొనసాగుతోన్న రాజేంద్రనాథ్ రెడ్డి ని బదిలీ చేస్తారు. తాత్కాలిక డిజిపి ఎన్నికల సమయంలో కొనసాగడానికి వీలు లేదు. ఆయన మంచివాడే అయినప్పటికీ , నిబంధనలు అంగీకరించవు. అలాగే ఉమ్మడి కడప జిల్లాకు చెందిన మరికొంతమంది అధికారులను, బూట్లు నాకే సీనియర్ పోలీసు అధికారులను విశ్రాంతి తీసుకొమ్మని ఎన్నికల కమిషన్ చెప్పే అవకాశం ఉంది. లేకపోతే సుదూర ప్రాంతాలకు బదిలీ చేసే ఛాన్స్ ఉంది.

ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకొని, తమ నడవడిక మారిందని ప్రజలకు అర్థమయ్యే విధంగా వ్యవహరిస్తే మంచిది. అయినా మనిషి మారలేదంటే, ప్రాంతాలు, రాష్ట్రాలు మారుతారని, ఆ విధంగా ఎన్నికల సంఘం మారుస్తుందని రఘు రామ కృష్ణంరాజు హెచ్చరించారు.

సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా వైయస్ వివేకానంద రెడ్డి బయోపిక్
సిబిఐ ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన అంశాల ఆధారంగా మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి బయోపిక్ ను రూపొందించినట్లుగా మేకర్స్ పేర్కొన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సామాజిక మాధ్యమం వేదికగా వైఎస్ వివేకానంద రెడ్డి బయోపిక్ టీజర్ ను విడుదల చేశారని, ఈ నెల 22వ తేదీన యూట్యూబ్ మాధ్యమంలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లుగా చెప్పారన్నారు.

టీజర్ ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో చాలా స్పష్టంగా అర్థమయింది. వైయస్ వివేక హత్య జరిగిన రోజు తెల్లవారుజామున కొంతమంది కొంతమందితో ఫోన్లో మాట్లాడినట్లుగా సిబిఐ చార్జిషీట్లో పేర్కొనడం జరిగింది. అలాగే దస్తగిరి కదిరికి వెళ్లి గొడ్డలి తెచ్చినట్లుగా తన వాంగ్మూలంలో వెల్లడించాడు. ఈ విషయాలన్నీ చిత్రంలో ప్రస్తావించడం ద్వారా, ప్రజలకు కొన్ని నమ్మలేని నిజాలు, సాక్షి రాతలు అబద్ధాలని తెలిసే అవకాశం ఉందని రఘు రామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

Leave a Reply