– పర్యటన చేస్తున్న ముత్తు సెల్వన్ ను అభినందించిన వాసంశెట్టి సత్యం
రామచంద్రపురం : ప్రాణవాయువు (ఆక్సిజన్) అందక
ఏ ఒక్కరూ చనిపోకూడదనే లక్ష్యంతో తమిళనాడులోని కోయంబత్తూర్ కు చెందిన ముత్తు సెల్వన్ సైకిల్ పై ఆసియా దేశాల పర్యటన చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా 10 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా 2021 డిసెంబర్ 28న చేపట్టిన సైకిల్ యాత్ర బుధవారం సాయంత్రం రామచంద్రపురం చేరుకుంది.
సైకిల్ యాత్ర చేపట్టిన ముత్తు సెల్వాన్ కూటమి పార్టీ సీనియర్ నాయకులు, మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం ని మర్యాదపూర్వకంగా కలిశారు. గడచిన కోవిడ్ మహమ్మారి సమయంలో ఎంతోమంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారని, అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదనే నినాదంతో 10 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ఈ సైకిల్ యాత్ర చేపట్టినట్టు సెల్వన్ వివరించారు.
ఐదు సంవత్సరాలు పాటు సాగే ఈ సాహస యాత్రలో ఇండియా,నేపాల్, బంగ్లాదేశ్, వియాత్నం మయన్మార్, బ్యాంకాక్, థాయిలాండ్ తదితర దేశాల మీదగా ప్రయాణించి వచ్చే 2027 డిసెంబర్ 27 నాటికి దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి సమక్షంలో యాత్ర ముగుస్తుందని వెల్లడించారు. ఇప్పటికే 7 లక్షల 14 వేల 300 మొక్కలు నాటామని, మరో 2 లక్షల 87 వేల మొక్కలు నాటాల్సి ఉందన్నారు. యాత్రలో ఇప్పటికే 29 వేల 650 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశానని, మరో 14 వేల కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్ర చేయాల్సి ఉందన్నారు.
ఈ యాత్ర ప్రపంచ రికార్డు అని, తన సైకిల్ బరువు 120 కేజీలు ఉంటుందని వివరించారు. మంచి లక్ష్యంతో సైకిల్ యాత్ర చేపట్టిన ముత్తు సెల్వన్ ను వాసంశెట్టి సత్యం, కూటమి నాయకులు సెల్వన్ కు స్వాగతం పలికి, అభినందించారు.