– బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేత అలీ మస్కతి
– తెలుగుమహిళ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు షకీలారెడ్డి చేరిక
– – బీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపిస్తామన్న షకీలారెడ్డి
– కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన కేటీఆర్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అలీ మస్కతి, టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు షకీలా గులాబీ కండువా కప్పుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని బీఆర్ఎస్ పార్టీ లోకి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది.
అలీ మస్కతి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఒక సెక్యులర్ పార్టీ అని, అందుకే కేటీఆర్ ఆధ్వర్యంలో తాను పార్టీలో చేరినట్లు తెలిపారు. “ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ కాదు. కేసీఆర్ పాలనలో ముస్లిం మైనారిటీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు ఏమీ చేయలేదు. కేసీఆర్ నిజమైన సెక్యులర్ నాయకుడు, ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు” అని మస్కతి కాంగ్రెస్ పార్టీ వైఖరిపై విమర్శలు గుప్పించారు.
పార్టీలో చేరిన సందర్భంగా షకీలా రెడ్డి గారు మాట్లాడుతూ, తాను టీడీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. “మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ ఆధ్వర్యంలో పనిచేయడానికి నేను బీఆర్ఎస్లో చేరడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి తప్ప, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు కొత్తగా చేసిందేమీ లేదు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ పాలన మళ్లీ రాష్ట్రంలో తీసుకురావడం కోసం మేము కృషి చేస్తాం.” అని ఆమె ఉద్ఘాటించారు.
రాబోయే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం తాను అంకితభావంతో పనిచేస్తానని, ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
యువ నాయకులు రోహిత్ శర్మ కూడా కేటీఆర్ గారి నాయకత్వాన్ని మెచ్చి బీఆర్ఎస్లో చేరారు. “నేను కేటీఆర్ కి వీరాభిమానిని. యువతకు ఆదర్శంగా నిలిచే కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఇవాళ పార్టీలో చేరాను” అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. నాయకుల చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, వారి సేవలు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు