Suryaa.co.in

Telangana

బీజేపీ-బీఆర్‌ఎస్‌ ‘వాల్‌’ వార్‌!

నిత్యం పోలీసుల పహారా, కెమెరా కళ్లతో కనిపించే హైదరాబాద్‌లో ఈమధ్య కొత్తగా వాల్‌పోస్టర్ల యుద్ధం మొదలయింది. బీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య జరుగుతున్న వాల్‌పోస్టర్ల యుద్ధంలో పాల్గొంటున్న సైనికులెవరన్నది, ఇప్పటివరకూ తేల్చలేకపోయారు. ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, ప్రధాని మోదీ, బీజేపీలో చేరిన కళంకిత ఎంపీలపై బీఆర్‌ఎస్‌ పక్షాన వాల్‌పోస్టర్లు వెలిశాయి. కవితకు నోటీసులిచ్చిన తర్వాత ఒకసారి ఇవి దర్శనమిచ్చాయి. అయితే టిట్‌ ఫర్‌ టాట్‌ అన్నట్లు.. ఇప్పుడు బీజేపీ కూడా కవిత అవినీతిని వివరిస్తూ, వాల్‌పోస్టర్లు తయారుచేశారు. లిక్కర్‌ కుంభకోణానికి సంబంధించిన ఆ వాల్‌పోస్టర్లు ఆకర్షిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ కనిపించని ఈ వాల్‌పోస్టర్‌ సంస్కృతి ఇప్పుడు సాధారణమయింది.

హైదరాబాద్ లో మరోసారి ‘పొలిటికల్ పోస్టర్లు’ కలకలం రేపాయి. ఇటీవల కవితను ఈడీ విచారిస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు, పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. తాజాగా ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా పోస్టర్లు కనిపించాయి. హైదరాబాద్ బేగంపేటలోని మెట్రో పిల్లర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేశారు. శనివారం ఉదయాన్నే ఈ పోస్టర్లు కనిపించాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను కవిత ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ పోస్టర్లు మెట్రో పిల్లర్లపై కనిపించడం కలకలం రేపుతోంది.

‘కల్వకుంట్ల దొంగల ముఠా.. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేసీఆర్’.. ‘కవిత అంటే పద్యం అనుకుంటిరా.. లే.. మద్యం’.. ‘కవితక్క నీకు కావాలి సారా దందాలో 33 శాతం వాటా.. దాని కోసమే ఆడుతున్నావ్ 33 శాతం మహిళా రిజర్వేషన్ ఆట’.. ‘తెలంగాణలో ప్రజల సొమ్ము దోచుకుని.. ఢిల్లీలో కవితక్క చేస్తోంది దొంగ సారా దందా’ అంటూ వాటిపై రాసుకొచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే పోస్టర్లను తొలగించారు. సీసీ కెమెరాలను పరిశీలించి.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల కేంద్రానికి వ్యతిరేకంగా, ఇప్పుడు కవితకు వ్యతిరేకంగా వేసిన పోస్టర్లలో ఎక్కడా ఊరు పేరు లేకపోవడం గమనార్హం.

LEAVE A RESPONSE