– తెలంగాణకు 7 ఏళ్లలో రూ.3.30 లక్షల కోట్లకుపైగా కేంద్రం నిధుల మంజూరు
– గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే
బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధం
– గంగుల పై పోటీకి బీజేపీ కార్యకర్త చాలు… చిత్తుగా ఓడించి తీరుతాం
– బండి నిప్పు కణం… సంజయ్ పేరు వింటేనే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోంది
– మాటలకు… చేతలకు పొంతనలేని దద్దమ్మ కేటీఆర్
– బిజెపి శాసనసభాపక్ష నేత రాజాసింగ్, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణి రుద్రమదేవి
ఈరోజు కరీంనగర్ లో మంత్రి కేటీఆర్ తెలంగాణకు కేంద్రం నయాపైసా ఇవ్వడం లేదని, బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ ఎంపీగా ఉంటూ గత మూడేళ్లుగా కనీసం రూ.3 కోట్లు కూడా తేలేకపోయారంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
అబద్దాలు చెప్పడంలో కేటీఆర్ వాళ్ల అయ్యను మించి పోయిండు. గత కొద్దిరోజులుగా నరం లేని నాలుక ఉంది కదా అని పచ్చి అబద్దాలు వల్లిస్తుండు. కేంద్రంపై విషం చిమ్ముతున్నడు. తెలంగాణకు కేంద్రం నిధులివ్వడం లేదంటున్నడు…. అధికారంలో ఉంటూ రాష్ట్రానికి టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పకుండా…. కేంద్రంపై విమర్శలు చేయడం సిగ్గు చేటు. పైగా కేంద్రం నిధులిస్తున్నా సక్రమంగా ఖర్చు చేయకుండా దారి మళ్లిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటు.
అన్నీ కేంద్రమే చేస్తే ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదెందుకు? ప్రజలకు టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పకుండా కేంద్రంపై నెపం మోపుతూ తప్పించుకోవాలనే కేటీఆర్ ధోరణిని రాష్ట్ర ప్రజానీకం గమనిస్తుంది.
అందుకే వాస్తవాలు ముందుంచుతున్నాం… తెలంగాణకు కేంద్రం గత 7 ఏళ్లలో దాదాపు 3 లక్షల 30 వేల కోట్లకు రూపాయలకుపైగా నిధులు కేటాయించింది.అందులో పన్నుల వాటా ద్వారా ఒక లక్షా 4 వేల 7 వందల 17 కోట్ల రూపాయలు కేటాయించింది.
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఒక లక్షా 8 వేల 535 కోట్ల రూపాయలు కేటాయించింది.రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త లైన్ల మంజూరు సహా వివిధ పనుల కోసం దాదాపు 30 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. జాతీయ రహదారులు ,రోడ్ల కోసం ‘భారత మాల ప్రయోజన’ పథకం కింద రాష్ట్రానికి ఇప్పటికే 90 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులు కేటాయించింది.ఏ సంవత్సరం ఏ స్కీం కింద, ఏయే రూపాల్లో కేంద్రం తెలంగాణకు నిధులు ఇచ్చిందనే పూర్తి వివరాలు మావద్ద ఉన్నయ్. అతి త్వరలోనే ఆ పూర్తి ఆధారాలు, గణాంకాలతోసహా ప్రజల ముందుంచబోతున్నం.
కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని పదేపదే బీజేపీపై విషం చిమ్ముతున్న కేటీఆర్ కు బీజేపీ పక్షాన సవాల్ విసురుతున్నాం…. ఆయనకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. ఇకనైనా సొల్లు మాటలు బంద్ జేయాలి. అమలు కాని హామీలివ్వడం మానుకోవాలని కేటీఆర్ కు సూచిస్తున్నాం. ఇప్పటికే మీ అయ్యను జనం నమ్మడం లేదు. నీకు చాలా వయసుంది. మీ అయ్యలెక్క నోటికొచ్చిన అబద్ధాలాడి రాజకీయ భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని చెబుతున్నాం. తెలంగాణలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని చెబుతున్న మాటలన్నీ పచ్చి అబద్ధాలే.
ఎందుకంటే గ్రామాలకు ఇచ్చే నిధులన్నీ కేంద్రం ఇస్తున్నవే..మీరు ఏ గ్రామానికైనా వెళ్లండి. ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం, డంప్ యార్డ్, నర్సరీ, రైతు వేదికలు కన్పిస్తాయి. వాటికయ్యే ఖర్చంతా కేంద్రమే ఇస్తోంది.
ఒక్కో వైకుంఠ ధామానికి రూ.11 లక్షల13 వేల 7 వందల రూపాయలు…. ఒక్కో పల్లె ప్రకృతి వనానికి రూ.4 లక్షల 23 వేల103 రూపాయలు…. ఒక్కో డంప్ యార్డ్ కు రూ.2 లక్షల 50 వేల రూపాయలు…. ఒక్కో నర్సరీ కి రూ.1 లక్ష56 వేల314 రూపాయలు…. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ. 10 లక్షల రూపాయల చొప్పున ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వమే నిధులు ఖర్చు చేస్తోంది.కానీ వాటికి గులాబీ రంగులు వేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినట్లుగా చెప్పుకోవడం సిగ్గు చేటు. మందికి పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకునే బాపతు ఎవరో ఇప్పటికైనా రాష్ట్ర ప్రజానీకం అర్ధం చేసుకోవాలని కోరుతున్నా.కేంద్ర శాఖల్లో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని… నిరుద్యోగులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలు మరో పచ్చి అబద్దం…
గత ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా 700 మంది నిరుద్యోగుల చావుకు కారణమైన కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యాల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉండగా… 80 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తానని చెబుతూ అదేదో ఘన కార్యంగా చెప్పుకోవడం సిగ్గుచేటు. చనిపోయిన 700 మంది
కుటుంబాలకు ఏం సమాధానం చెబుతవ్ కేసీఆర్?
పైగా కేంద్రం ఉద్యోగాలు భర్తీ చేయలేని దుష్ప్రచారం చేస్తవా…ఇంతకంటే దారుణం ఇంకోటి ఉందా? ఇగ కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు సత్యదూరం. కేంద్రం ప్రతి ఏటా యూపీఎస్సీ, ఎస్సెస్సీ, బీఆఎస్సార్బీ, ఎన్డీఏ వంటి సంస్థల ద్వారా లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ఉంది. అందుకోసం ప్రతి ఏటా రెగ్యులర్ గా క్యాలెండర్ ను విడుదల చేస్తోంది. దాని ప్రకారమే ఉద్యోగాలను నింపుతోంది.టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న 15 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేసే ప్రక్రియ నోటిఫికేషన్లు, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ సహా వివిధ దశల్లో కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో కేంద్రాన్ని నిందించడమంటే…. ఆకాశంపై ఉమ్మేయడమే అవుతుంది.కేసీఆర్ ఫ్రభుత్వానికి ఉద్యోగ క్యాలెండర్ వేయడం చేతకాదు… ఏటా ఉద్యోగాలు నింపడం చేతకాదు… ఆ పని చేస్తున్న కేంద్రం మీద విషం చిమ్మడం ఎంత వరకు కరెక్ట్ ?
బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ఎంపీ అయ్యాక నయాపైసా తీసుకురాలేకపోయారని కేటీఆర్ చెప్పిన మాటలు పచ్చి బూటకం. బండి సంజయ్ కుమార్ ఎంపీ అయ్యాక గత మూడేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వివిధ పథకాల కింద కేంద్రం మంజూరు చేసిన నిధుల వివరాలు మావద్ద ఉన్నాయి. మచ్చుకు కొన్ని మీకు చదివి విన్పిస్తా..మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గత మూడేళ్లలో (2019-21) రూ. 235 కోట్ల 93 లక్షల 47 వేల రూపాయలు మంజూరయ్యాయి.గత మూడేళ్లలో దీపం, ఉజ్వల పథకం కింద రూ.1,29,923 గ్యాస్ కనెక్షన్ల మంజూరయ్యాయి.కరోనా టైంలో ఎంపీ నిధుల నుండి రూ.50 లక్షలు ఖర్చు చేశాం. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోటి రూపాయల విలువైన ఆక్సిజన్ ప్లాంట్ ను జిల్లాలో ఏర్పాటు చేశారు. ఎంపీ తన సొంత నిధులతో రూ.3 కోట్ల విలువైన వైద్య పరికరాలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేశారు.అటల్ ఇన్నోవేషన్ మిషన్ స్కీం కింద ఒక్కో పాఠశాలకు రూ. 25 వేల చొప్పున 52 పాఠశాలలకు కేంద్రం కేటాయించింది.ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద మరణించిన ఐదుగురు వైద్య సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున మంజూరయ్యాయి.బేటీ బచావో-బేటీ పడావో పథకం కింద 22 లక్షలు 52 వేల 092 రూపాయలు మంజూరయ్యాయి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన(అర్బన్) పథకం కింద 3 వేల ఇండ్లు మంజూరు చేసి 73 కోట్లకుపైగా నిధులు కేటాయిస్తే…. ఈ దిక్కుమాలిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 264 ఇండ్లు మాత్రమే పూర్తి చేసింది. అంటే కేంద్రం కేటాయించిన నిధులను కూడా సరిగా వాడుకోవడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతుండటం దారుణం. తెలంగాణలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా… రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణం ఊసేత్తకుండా ఇండ్లులేని పేదలకు తీవ్రమైన అన్యాయం చేస్తుండటం సిగ్గు చేటు.
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద రూ. 30 కోట్ల 39 లక్షల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయి. అట్లాగే సీఆర్ఐఎఫ్ కింద ఈ మధ్యే రూ.205 కోట్లు మంజూరయ్యాయి. ఎంపీ లాడ్స్ కింద 2019-20 సంవత్సరంలో రూ. 5 కోట్లు ఖర్చు. కరోనా వల్ల గత రెండేళ్లుగా ఎంపీ లాడ్స్ నిధులను కేంద్రం ఆపేసిన సంగతి మీకు తెలుసు. ఈ ఏడాది మళ్లీ ఆ నిధులను కేటాయిస్తామని కేంద్రం పేర్కొంది.జాతీయ రహదారుల విషయానికొస్తే… గతంలో ఎన్నడూ లేనన్ని నిధులు ఈసారి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మంజూరైనవి.
కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి (ఎన్ హెచ్ 563) 4 లేన్ పనుల కోసం రూ.2,146 కోట్ల 86 లక్షలను కేంద్రం మంజూరు చేసింది. ఎల్కతుర్తి – సిద్ధిపేట రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.578.85 కోట్లు మంజూరు చేసింది. అట్లాగే గత మూడేళ్లలో వివిధ రైల్వే లైన్ల పనుల నిమిత్తం దాదాపు రూ.250 కోట్ల నిధులు ఒక్క కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోనే మంజూరయ్యాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే…
ఇగ కేటీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదనడానికి ఒక్క ఉదాహరణ చెబుతా…. ఇయాల కరీంనగర్ టౌన్ లో ఎక్కడ చూసినా అయ్యా కొడుకుల ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నయ్. మూడేళ్ల క్రితం ఈ కేటీఆర్ ఏమన్నాడో గుర్తుంది కదా… ప్లాస్టిక్ పై నియంత్రణలో భాగంగా ఇకపై ఫెక్సీల ఏర్పాటును బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించిండు. ఒకవేళ ఎవరైనా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే తొలగిస్తామన్నడు. నాతోసహా టీఆర్ఎస్ కు సంబంధించి ఎవరు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినా నిర్మొహమాటంగా తొలగించాల్సిందేనని బీరాలు పలికిండు. మరి ఏమైంది?
ఇయాళ యాడ చూసినా కేటీఆర్ ఫ్లెక్సీలే కన్పిస్తున్నయ్. మాట ఇస్తే అమలు చేసి తీరాలనే సోయి లేదా? కేటీఆర్ వన్నీ పిట్టల దొర మాటలే అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? కేటీఆర్ ఇవాళ సభలో మాట్లాడుతూ బండి సంజయ్..దమ్ముంటే కరీంనగర్ మంత్రి గంగుల పై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిండు.. అవినీతి, అక్రమాలతో బలిసి కొట్టుకుంటున్న గంగుల కమలాకర్ పై పోటీ చేయడానికి బండి సంజయ్ ఎందుకు? బీజేపీలో సామాన్య కార్యకర్త చాలు. ఈసారి చిత్తుచిత్తుగా ఓడించి తీరుతాం… అధికారం, అహంకారం, డబ్బు మదంతో కొట్టుకుంటున్న కేటీఆర్ బలుపును దించే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నయని గుర్తు పెట్టుకో..
కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కోసం బండి సంజయ్ కుమార్ కనీసం పార్లమెంట్ లో నోరు విప్పలేదని అడ్డగోలుగా కూతలు కూస్తున్నడు. 80 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును అంచనాలు పెంచి లక్షన్నర కోట్లకు పెంచి కమీషన్లు దండుకున్నవ్. ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) సమర్పించాలని, ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్సు తీసుకుంటే కేంద్రం నిధులు మంజూరు చేయించే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది. కేటీఆర్ కు, టీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్, ఇన్వెస్ట్ మెంట్ క్లియరెన్స్ పత్రాలు సమర్పించాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.
ఒక్కటి మాత్రం నిజం…. బండి సంజయ్ కుమార్ పేరు వింటే అయ్యా కొడుకుల వెన్నులో వణుకుపుడుతోంది. బీజేపీ పేరు వింటేనే భయపడుతున్నరు. అందుకే ఒకరిద్దరు కార్పొరేటర్లను బీజేపీలోకి చేర్చుకుని బండి సంజయ్ కుమార్ ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నరు. కేటీఆర్ అయ్య తరం కాదు.. బండి సంజయ్ నిప్పు కణం. మండే సూరీడు. సంజయ్ కుమార్ గారిని తాకితే టీఆర్ఎస్ భస్మమే. రాబోయే ఎన్నికల్లో సంజయ్ గారి సారథ్యంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. టీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టడం తథ్యం.