– వైసీపీ, టీడీపీ మోదీపై అవిశ్వాసం పెట్టకపోవడం దుర్మార్గం
– కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్నం భవన్ లో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ: మణుపూర్ రాష్ట్రంలో జరుగుతున్న మారణ హోమం సభ్య సమాజం తలదించుకునే లాగా ఉంది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఆకృత్యాలు, దాడులను కేంద్ర బిజెపి ప్రభుత్వం ఆపడంలో ఘోరంగా విఫలం చెందింది.
సుమారు 3 నెలల నుండి మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న మారణహోమం, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను గౌరవ సుప్రీంకోర్టు సుమోటోగా కేసును తీసుకునేంత వరకు కేంద్ర బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ స్పందించకపోవడం వారి అసమర్ధ, చేతకాని పాలనకు నిదర్శనం.
ప్రపంచంలోని అన్ని సంస్థలు, దేశంలోని అన్ని పార్టీలు మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై, దాడులపై స్పందిస్తుంటే అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన వైసిపి, టిడిపిలు ఎందుకని స్పందించడం లేదు.. ఆ దాడులను ఎందుకని ఖండించడం లేదు?
భారతీయ జనతా పార్టీ (బిజెపి) అంటే బాబు, జగన్, పవన్ అని ఈ సంఘటనలతో మరోసారి నిరూపితమైంది. కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఇండియా కూటమి ఏర్పాటు చేసి రాజ్యసభ, లోక్సభలో మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న మారణ హోమం, ఆకృత్యాలు, అత్యాచారాలు దాడుల వంటి ఘోర పరిణామాలపై కేంద్ర బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం చేశాయని, కానీ ఆ యొక్క అవిశ్వాస తీర్మానానికి జగన్ రెడ్డి వైసీపీ, చంద్రబాబు టిడిపిలు మద్దతు తెలపకపోవడం దారుణం, దుర్మార్గం.
పార్లమెంట్ లో సుమారు 31 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వైకాపా, రాజ్యసభలోనూ, లోక్సభలోను ప్రాతినిధ్యం ఉన్న టిడిపి పార్టీలు ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించకుండా బహిరంగంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది.
చేగువీరా, లెఫ్ట్ భావజాలాలు నాలో పుష్కలంగా ఉన్నాయని చెప్పుకునే జనసేన పవన్ కళ్యాణ్.. మణిపూర్ రాష్ట్రంలో మైనార్టీ, క్రైస్తవ సోదరులపై జరుగుతున్న మారణహోమాన్ని, అత్యాచారాలను, దాడులను ఎందుకని ఖండించటం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేయడం జరిగింది.
ఇప్పటికైనా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష, జనసేన పార్టీలు ఇండియా కూటమి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పై చేసిన అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు తెలపాలని లేనిపక్షంలో రాష్ట్రంలో ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకాడబోదని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఎపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, ఎపిసిసి స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ వి.గురునాధం, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి, కిసాన్ సెల్ స్టేట్ చైర్మన్ జెట్టి గురునాథం, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ సభ్యులు కొలనుకొండ శివాజీ, మేడా సురేష్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.