-ప్రజల పక్షాన పోరాడుతున్న రామోజీరావు కు అందరూ అండగా నిలబడాలి
-రేపో, మాపో జైలుకు వెళ్లే రాజకీయ నాయకుల ప్రాపకం కోసం జూనియర్ అధికారులు ప్రాకులాడడం సిగ్గుచేటు
-వైఎస్ వివేక హత్య అనంతరం గంగిరెడ్డి తోనే కాకుండా అవినాష్ రెడ్డి మరొకరితో మాట్లాడారన్న సిబిఐ, ఆ మాట్లాడింది ఎవరితోనో తెలిసి పోయింది
-సాంకేతిక ఆధారాలతో ఏజెన్సీ నివేదిక అందాల్సి మాత్రమే ఉంది
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
వ్యవస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి (జమోరె ) ప్రభుత్వం సర్వనాశనం చేసింది. వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసిన జమోరె ప్రభుత్వాన్ని ప్రజలేమి చేయలేకపోతున్నారు. ప్రజల తరఫున పోరాడుతున్న ఈనాడు సంస్థ అధినేత రామోజీరావుకు కనీసం అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ప్రజల కోసమే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ, టీవీ5 చైర్మన్ రాజగోపాల్ నాయుడు, రామోజీరావులు పోరాడుతున్నారు.
ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఈనాడు దినపత్రిక ద్వారా ఎత్తిచూపుతోన్న రామోజీరావు పై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిఐడి ద్వారా నేరుగా దాడి చేస్తోంది. ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుంటే, ప్రజల కోసం పోరాడుతున్న రామోజీరావుకు ప్రతి ఒక్కరూ మానసికంగా మద్దతును ఇవ్వాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు కోరారు.
శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఉషోదయ, ఉషా కిరణ్ సంస్థల ఆస్తుల అటాచ్మెంట్ లో ప్రభుత్వం నిబంధనలన్నీ గాలికి వదిలేసింది. 2014 బ్యాచ్ కు చెందిన జూనియర్ ఐపీఎస్ అధికారి అమిత్ బర్ధార్, పక్కనే ఐజి శ్రీకాంత్ ఉన్నప్పటికీ రెచ్చి పోయారు. ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషా కిరణ్ సంస్థల ఆస్తుల అటాచ్మెంట్ కు ప్రభుత్వ అనుమతితో నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
చిట్ ఫండ్ సంస్థ చిట్టీల వ్యాపారమే చేయాలి. ఇతర వ్యాపారాలు చేయవద్దని నిబంధనలు చెబుతున్నాయి. ఈ నిబంధనలను అతిక్రమించిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషా కిరణ్ సంస్థలకు నోటీసులు ఇచ్చామని అమిత్ బర్దార్ వెల్లడించారు. సిఐడి నమోదు చేసిన ఈ కేసు కోర్టులో నిలబడదు . ఈ కోర్టులో కాకపోతే, పై కోర్టులో కేసు కొట్టివేస్తారన్న రఘు రామ కృష్ణంరాజు, మార్గదర్శి సంస్థ చిట్ ఫండ్ వ్యాపారం చేస్తుందన్నారు. ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషా కిరణ్ సంస్థకు చిట్ ఫండ్ లావాదేవీలతో ఎటువంటి సంబంధాలు లేవు.
చిట్ ఫండ్ వ్యాపారం చేసే సంస్థ ఇతర వ్యాపారాలు చేయకూడదని నిబంధనలు పేర్కొంటున్నప్పటికీ, చిట్ ఫండ్ వ్యాపారం ద్వారా లభించే లాభాలను ఇతర కంపెనీలలో పెట్టుబడులు పెట్టవద్దని నిబంధనలలో ఎక్కడా కూడా చెప్పలేదన్నారు . తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోనూ మార్గదర్శి సంస్థ చిట్ ఫండ్ వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే ఆయా రాష్ట్రాలలో చిట్ ఫండ్ వ్యాపారంలో భాగంగా, చిట్ ల నిర్వహణ కోసం మార్గదర్శి సంస్థ సంబంధిత సబ్ రిజిస్టార్ ల వద్ద సెక్యూరిటీ అమౌంట్ డిపాజిట్ చేసింది.
చిట్ ఫండ్ యాక్ట్ 1982 సెక్షన్ 14 ప్రకారం చందాదారుల డబ్బును మాత్రమే దారి మళ్లించవద్దని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. చిట్ నిర్వహణకుగాను చిట్ ఫండ్ కంపెనీకి ఐదు శాతం కమీషన్ తీసుకునే వెసులుబాటును చిట్ ఫండ్ యాక్టులో కల్పించారు. దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాలలో మార్గదర్శి సంస్థ పదివేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలను కలిగి ఉంది. ఈ లెక్కన, ఉద్యోగుల జీతభత్యాలు, కార్యాలయాల నిర్వహణ పోను,ఆ సంస్థకు లాభాల రూపంలోనే 400 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది.
మార్గదర్శి సంస్థకు లాభాల రూపంలో లభించే ఆదాయాన్ని ఎక్కడైనా పెట్టుబడులను పెట్టుకునే వెసులుబాటు ఉంది. కంపెనీ చట్టం ప్రకారం కంపెనీ అనేది ఇండివిజువల్. సిబిఐ చెబుతున్నట్లుగా ఎన్నో డొల్ల కంపెనీలను స్థాపించిన జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి లకు కంపెనీ చట్టం గురించి అవగాహన లేదా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
మార్గదర్శి సంస్థను శైలజాకిరణ్ నిర్వహిస్తుంటే, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ కంపెనీ యజమానిగా చెరుకూరి కిరణ్ కొనసాగుతున్నారు. ఈ రెండు కంపెనీలు వేరువేరన్న బుద్ధి అధికారులకు లేదా?, ఆస్తులను అటాచ్మెంట్ చేశామని సంకలు గుద్దుకుంటున్నారు. రేపు కోర్టులో ఈ కేసు కొట్టివేయడం ఖాయమన్నారు.
స్టే ఇచ్చిన న్యాయస్థానం
చిట్ నిర్వహణకు సిఐడి అధికారులు ఆటంకాలను సృష్టించడాన్ని మార్గదర్శి సంస్థ న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లగా , కోర్టు స్టే ఇచ్చింది. ఏ ఒక్క చందాదారుడు ఫిర్యాదు చేయకుండానే, సిఐడి పోలీసులు చిట్ ల నిర్వాహనకు ఆటంకాలను సృష్టించడం పట్ల గుంటూరు నగరానికి చెందిన ఒక వైద్యుడు కోర్టును ఆశ్రయించారు. దీనితో ఆ వైద్యుడిపై ఆగ్రహించిన సిఐడి పోలీసులు, డి ఆర్ ఐ ని రంగంలోకి దించి సదరు వైద్యుడి ఆస్పత్రి పై పెనాల్టీ వేయాలని ఒత్తిడి తెచ్చారు.
నీకు తెలియకుండానే నీ పేరుతో కేసు వేశారని చెప్పాలని ఆ వైద్యుడిపై సిఐడి పోలీసులు ఒత్తిడి తీసుకురావడంతో, చేసేది లేక తాను సంతకం పెట్టిన మాట వాస్తవమేనని కానీ అందులో రాసిన మ్యాటర్ చదవలేదని చెప్పాడట. ఒక వ్యక్తి కోర్టులో కేస్ ఫైల్ చేస్తే, అతడి ఇంటికి సిఐడి పోలీసులు వెళ్లాల్సిన పని ఏమిటి?. న్యాయం కోసం కోర్టుకు వెళ్లిన వారికి రక్షణ ఏది?? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని గతంలో నేను కోర్టును ఆశ్రయించగా, అరెస్టు చేసి లాకప్ లో చితకబాదారు. నన్ను చిత్రహింసలకు గురి చేసేటప్పుడు కూడా ముఖ్యమంత్రి బెయిల్ రద్దు చేయమని కోర్టుకు వెళ్తావా అని అడిగి మరి కొట్టారు. నన్ను లాకప్ లో చిత్రహింసలకు గురి చేసిన అధికారుల తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ఏడాదిన్నర తర్వాత హైకోర్టుకు వెళ్ళమని సూచించగా, హైకోర్టును కూడా ఆశ్రయించాను. దురదృష్టవశాత్తు అన్ని వ్యవస్థలు అలాగే ఉన్నాయి . రెండేళ్లలో న్యాయం జరుగుతుందని ఆశించినప్పటికీ న్యాయం జరగలేదు. ప్రజా న్యాయస్థానంలో ఈ ముష్కరులను ఓడించి శిక్షించి తీరుతానని రఘురామకృష్ణం రాజు అన్నారు.
అక్రమాలను వెల్లడిస్తే పత్రిక నడిపే సంస్థని సీజ్ చేస్తారా?
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలకు తెలియజేసే పత్రిక ను నిర్వహించే సంస్థని సీజ్ చేస్తారా?, రేపు పొద్దున్నే సిబిఐ కోర్టు దొంగ డబ్బులతో సాక్షి దినపత్రిక ఏర్పాటు చేశారని అంటే, సాక్షి పేపర్ ను కూడా మూసి వేయమని ఇన్ డైరెక్ట్ గా సందేశాన్ని ఇస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. గతంలో నన్ను కొట్టావు… అచ్చం నాయుడు ఇబ్బంది పెట్టావు. అప్పుడు ప్రజల్లో ధైర్యం లేదు .
ఇప్పుడు నేరుగా రామోజీరావు జోలికి వెళ్లావు. జే ఆర్ డి టాటా తరహాలో నిస్వార్ధంగా వ్యాపారాలను నిర్వహిస్తున్న అతికొద్ది మందిలో రామోజీరావు ఒకరు. అటువంటి రామోజీరావుని వేధిస్తే, రాష్ట్రంలో ఇంకా ఎవరైనా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులను పెడతారా?, రాష్ట్రం నుంచి అమర్ రాజా బ్యాటరీ కంపెనీ తరిమేశావు. రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం చేయడమే నీ లక్ష్యమా జగన్మోహన్ రెడ్డి అంటూ నిలదీశారు.
రాజమండ్రిలో ప్రజలకు కేటాయించిన జగనన్న ఇంటి స్థలాలను స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 150 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని 80 శాతం జగనన్న కాలనీలు ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగాయి. ఉషోదయ ఎంటర్ప్రైజెస్ వారు ఇటువంటి ఘాతుకాలు గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. అందుకే వారిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు .
ఎందరో గొప్ప అధికారులు ఉన్నారు… వారి స్ఫూర్తితో పని చేయండి
రాష్ట్ర ప్రజలకు ఎంతో మంది గొప్ప అధికారులు గతంలో సేవలు అందించారు. వారి స్ఫూర్తితో జూనియర్ అధికారులు పనిచేయాలి. అంతేకానీ రాజకీయ నాయకులకు భయపడో, తుచ్చమైన డబ్బుకు ఆశపడో వ్యవస్థలను నాశనం చేసే పరిస్థితికి జూనియర్ అధికారులు రావడం బాధాకరం. రాజకీయ నాయకులు చెప్పారని తోకడా కేసులు పెట్టడం సరికాదు. రేపు అధికారం నుంచి దిగిపోయే రాజకీయ నాయకులు చెప్పిన మాటలు వినవలసిన అవసరం అధికారులకు లేదని గ్రహిస్తే మంచిదని రఘురామకృష్ణం రాజు హితవు పలికారు .
జగనాసురుని నుంచి ఇక నుంచైనా పిల్లలకు విముక్తి
రాష్ట్రంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులకు జగనాసురుని నుంచి ఇకనుంచైనా విముక్తి లభించనుంది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలే ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదు. ఈ విషయాన్ని జై భీమ్ శ్రావణ్ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ నిర్వహించే సభలకు విద్యార్థులను తరలించడంపై ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ప్రవీణ్ ప్రకాష్ తో పాటు మరో అధికారికి నోటీసులు జారీ చేసింది.
కోర్టు నోటీసులపై విద్యాశాఖ మంత్రి సత్తి బాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. అమ్మ ఒడి కార్యక్రమానికి విద్యార్థులు కాకపోతే సినిమా నటులు వస్తారా అంటూ ఆయన చేసిన లేకి వ్యాఖ్యలు దురదృష్టకరం. స్కూల్ విద్యార్థులను కేవలం ఆగస్టు 15వ తేదీ, జనవరి 26వ తేదీన జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ ఉత్సవ కార్యక్రమాలలో మాత్రమే భాగస్వాములను చేయాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.
ప్రశ్నించిన వారు సంతకం పెట్టలేదన్నది నిజం
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేటప్పుడు ప్రశ్నించిన వారు, ఆ పత్రాలపై సంతకం చేయలేదన్నది నిజం. వాంగ్మూలం పత్రాలపై ప్రశ్నించే ఉన్నతాధికారి కాకుండా, కేసును పర్యవేక్షిస్తున్న ఇన్చార్జ్ అధికారి సంతకం చేస్తారన్న విషయం అజయ్ కల్లం కు తెలియనిది కాదని రఘురామకృష్ణం రాజు అన్నారు.
అజయ్ కల్లం సమర్థుడైన ఐఏఎస్ అధికారి. మృదుస్వభావి. కాకపోతే దుష్టుడితో సావాసం చేయడం వల్ల ఇబ్బందుల్లో పడ్డారు. వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ నమోదు చేసిన తన వాంగ్మూలాన్ని వక్రీకరించారని, రికార్డుల నుండి తన వాంగ్మూలాన్ని తొలగించాలని అజయ్ కల్లం కోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేక హత్య జరిగిన రోజు తెల్లవారుజామున ఉదయం ఐదు గంటలకు లోటస్ పాండ్ లోని జగన్మోహన్ రెడ్డి ఇంటికి చేరుకున్నట్లు అజయ్ కల్లం అంగీకరించారు. అరగంట తర్వాత ఫోన్ వచ్చినట్లుగా చెప్పారు.
అటెండర్ వచ్చి మేడం పిలుస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చారని పేర్కొన్న ఆయన ఇప్పుడు మాట మారుస్తున్నారు. భారతి రెడ్డికి ఫోన్ వచ్చిందన్నది నిజం కాదు. ఆమెను ఇందులోకి అనవసరంగా లాగుతున్నారని అది కరెక్ట్ కాదని పేర్కొంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా స్పష్టతను ఇచ్చారు. వైఎస్ వివేకా హత్య అనంతరం గంగిరెడ్డి తోనే కాకుండా అవినాష్ రెడ్డి మరొకరితో మాట్లాడినట్లుగా సిబిఐ పేర్కొంది.
ఆ మాట్లాడింది ఎవరితోనో తెలిసినప్పటికీ, అమెరికా ఏజెన్సీ సాంకేతిక ఆధారాలతో నివేదిక అందజేసిన తర్వాత స్పష్టం అవుతుంది. సిబిఐ ని ఎంత తిట్టినా, సరైన సమయంలో ఉచ్చు బిగించడం ఖాయమన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరిపై రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను రఘురామకృష్ణం రాజు తీవ్రంగా తప్పు పట్టారు. ఒకవైపు కాళ్లు పట్టుకుంటూనే మరొకవైపు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు.