Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ అధినేత గొప్ప ఈవెంట్ మేనేజర్

– ఎంపీ విజయసాయి రెడ్డి

జూలై 29: ఈవెంట్ మేనేజ్మెంట్ లో టీడీపీ అధినేతను మించిన వారెవ్వరూ ఉండరని, చేపట్టిన ప్రతి కార్యక్రమానికీ ఏదో ఒక ‘ఆకర్షణ’ జతచేసి జనాన్ని సమీకరించడం ఆయనకు మొదటి నుంచీ అలవాటేనని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు.

సోషల్ మీడియా వేదికగా శనివారం ఆయన పలు అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. చినబాబు చేపట్టిన యువగళం యాత్రకు స్పందన కరువవ్వడంతో యాత్రకు గ్లామర్ అద్దేందుకు టీవీ యాంకర్ ను హైదరాబాద్ నుంచి రప్పించారని, ఇక నుంచి యాత్రలో సినీ నటులు సందడి మొదలవ్వబోతోందని అర్థమవుతుందని ఆయన అన్నారు.

ఫ్లెక్సీలు హడావిడి మాని రాష్ట్ర ప్రయోజనాలకు పని చేయాలి
బీజేపీ నూతన అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేనిపోని హడావిడి చేసే బదులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాటం చేస్తే కాస్తయినా ప్రజలకు ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకని ప్రశ్నించారు.

ఉదారంగా వరద సాయం
అధికార యంత్రాంగం మానవీయ కోణంలో వ్యవహరించి వరద బాధితులకు ఉదారంగా సహాయం అందించాలని వరదలు, సహాయ పునరావాస చర్యలపై కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని విజయసాయి రెడ్డి తెలిపారు. శిబిరాల నుంచి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2000, వ్యక్తులైతే రూ.1000 అందించాలని అలాగే దెబ్బతిన్న కచ్చా గృహాలకు తక్షణ సాయంగా రూ.10000 అందించాలని సీఎం ఆదేశించారని అన్నారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారని అన్నారు.

విపక్షాలు కేంద్రానికి మద్దత్తుగా కలిసి రావాలి
దేశ సరిహద్దుల్లో ఉన్న మణిపూర్ లోని వివాదాస్సద అంశంపై సరిహద్దు దేశాల కుట్రల దృష్ట్యా అందరూ సమిష్టిగా ఉండాల్సిన అవసరం ఉందని, విపక్షాలు కేంద్రానికి మద్దత్తుగా కలిసి రావాలని విజయసాయి రెడ్డి కోరారు.

LEAVE A RESPONSE