– మేఘా వెయ్యికోట్లిచ్చింది.. అందుకే కాళేశ్వరంపై విచారణ లేదు
– నా భర్త ఫోన్లపైనా ట్యాపింగ్
– కవిత అక్రమ సారా వ్యాపారం చేశారు
– మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
వరంగల్: ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్తుడైన మేఘా కృష్ణారెడ్డికి బీజేపీతో వెయ్యికోట్ల రూపాయల బంధం. ఆ కంపెనీ బీజేపీకి వెయ్యికోట్ల ఎన్నికల చందా ఇచ్చింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీజేపీ నోరెత్తడం లేద’’ని మంతి కొండా సురేఖ ఆరోపించారు.
మంత్రి కొండా సురేఖ బీజేపీ-బీఆర్‌ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ నా భర్త కొండా మురళి ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ఎవరి ఆదేశాలతో అలా చేశారో మాకు తెలుసు. కానీ దానిని విచారణలోనే తేలుస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తిలేదు. దానితో బీఆర్‌ఎస్ పతనం మొదలయింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కవిత సారా వ్యాపారం చేశారు. దానితో కేసీఆర్ కుటుంబం వందల కోట్లకు పడగలెత్తింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరుతున్న బీజేపీ డిమాండ్ పెద్ద డ్రామా.
కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టరు మేఘా కృష్ణారెడ్డి కంపెనీ బీజేపీకి వెయ్యి కోట్లు ఎన్నికల చందాగా సమర్పించుకుంది. అందుకే బీజేపీ వాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గానీ, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి గానీ మాట్లాడదు. విలువలు,ఆదర్శరాలు వల్లె వేసే బీజేపీ.. ఇలా కంపెనీలపై అవినీతిని చూసీచూడనట్లు పోయినందుకు వారి నుంచి ఎన్నికల నిధులు తీసుకుంది. సీబీఐ-ఈడీ దాడులు చేసిన కంపెనీల వివరాలు చూస్తే బీజేపీకి ఆ కంపెనీలు ఎప్పుడు ఎన్నికల నిధులిచ్చాయన్నది సులభంగా తెలిసిపోతుంది. ఆ విషయం కాళేశ్వరం ప్రాజెక్టు-మెగా కంపెనీతో తేలిపోయింది. ఫోన్ల ట్యాపింగ్ కేసును తేలిగ్గా తీసుకోం. ఏ స్థాయి నిందితులున్నా కఠినంగా శిక్షిస్తాం’’ అన్నారు.