– పురందీశ్వరి, కిషన్‌రెడ్డి ఎంపికలో తప్పులో కాలేసిందా?
– వైసీపీ, బీఆర్ఎస్కు లబ్ది చేకూర్చే వ్యూహమా?
– ఏపీలో కమ్మ, తెలంగాణలో రెడ్ల నియామకం వెనుక కారణం అదేనా?
– కమ్మ-రెడ్డి ఓట్లు చీల్చి కేసీఆర్-జగన్‌కు లబ్ది చేకూర్చే ఎత్తుగడ?
– ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ వైపు రెడ్ల చూపు
– బీజేపీలోని రెడ్డి నేతలతో కాంగ్రెస్ మంతనాలు
– కిషన్‌రెడ్డి ఎంపిక ద్వారా రెడ్ల ఓట్లలో చీలిక చిచ్చు?
– ఏపీలో పురందీశ్వరితో కమ్మ ఓట్లకు ఎసరు ఎత్తు
– సంజయ్ తొలగింపుతో బీజేపీకి బీసీలు దూరం
– రెండు అసెంబ్లీ, ఒక ఎమ్మెల్సీ, 40కి పైగా గ్రేటర్ స్థానాలు సాధించిన సంజయ్
– పురందీశ్వరి ఎంపిక వెనుక ఆ సంఘ్ ప్రముఖుడు?
– పురందీశ్వరి నియోజవర్గంలో బీజేపీకి వచ్చిన ఓట్లు 705
– సొంత పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లు మూడు
– కమ్మ నియోజకవర్గంలోనే డి పాజిట్లు రాని బీజేపీ
– మరి రాష్ట్రంలోని కమ్మ వర్గంపై ఆమె ప్రభావం చూపిస్తారా?
– బీజేపీ నిర్ణయం వెనుక కాంగ్రెస్-టీడీపీ రాకూడదన్న వ్యూహం
– బీఆర్ఎస్-వైసీపీతోనే బీజేపీ పరోక్ష పయనం?
– వారిది సంజయ్ స్దాయి సమరమా? బంతిపూల యుద్ధమా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎన్నికలకు ముందు బీజేపీ తీసుకున్న రెండు కీలక నిర్ణయాలు.. ఇప్పటిదాకా వేసుకుని ముసుగు తొలగి, ఆ పార్టీ భవిష్యత్తులో ఎవరితో తెరచాటు దోస్తీ కొనసాగిస్తుందన్న అంశాన్ని తేల్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీకి అధికారంలోకి వచ్చే ఉద్దేశం లేదని.. ఉన్న వారినే తన బృందంగా మార్చుకునేందుకే.. ఆ పార్టీ
నిర్ణయించుకుందన్న లోగుట్టును బట్టబయలు చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్-ఆంధ్రాలో వైసీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్లు, తాజా నియామకాలు స్పష్టం చేశాయన్నది, ఇప్పుడు బీజేపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ అధ్యక్షురాలిగా కేంద్ర మాజీ మంత్రి పురందీశ్వరిని నియమిస్తూ, పార్టీ జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయం పార్టీలో విమర్శలకు గురవుతోంది. కులసమీకరణ కోణంలో నాయకత్వం తీసుకున్న నిర్ణయం బూమెరాంగయి.. అది పరోక్షంగా తెలంగాణలో బీఆర్ఎస్-ఏపీలో వైసీపీ విజయానికి సహకరించేలా ఉన్నాయన్నది మెజారిటీ శ్రేణుల మనోగతం.
కర్నాటక ఫలితాల తర్వాత తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి. తాజా ఖమ్మంలో రాహుల్ సభకు సర్కారు ఎన్ని ఆంక్షలు విధించినా జనం పోటెత్తింది. బీజేపీలో చేరాలనుకున్న వెలమ వర్గానికి
చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెడ్డి వర్గానికి చెందిన మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనసు మార్చుకుని, కాంగ్రెస్‌లో చేరడం బీజేపీకి షాక్ ఇచ్చినట్లయింది.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న రెడ్డి నేతలు కూడా, బీజేపీ అస్పష్ట వైఖరి కారణంగా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ను వ్యతిరేకించే వారంతా, ఆ పార్టీతో బీజేపీకి ఉన్న మానసిక సంబంధాన్ని గుర్తించి, కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నది బహిరంగ రహస్యం. తెలంగాణలోని మెజారిటీ రెడ్డి వర్గం.. మానసిక ంగా కాంగ్రెస్‌కు మద్దతుదారిన నేపథ్యంలో, అదే వర్గానికి చె ందిన కిషన్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం, బీజేపీ శ్రేణులను విస్మయపరిచింది. దానివల్ల కొత్తగా సాధించేదేమిటన్న చర్చ తెరపైకొచ్చింది.
ఇప్పటికే బీఆర్ఎస్-బీజేపీ కలసి పయనిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. తాజా నియామకం దానిని నిజం చేసినట్లయిందన్నది, బీజేపీ శ్రేణుల మనోగతం. రెడ్డి వర్గాన్ని కాంగ్రెస్ వైపు వెళ్లకుండా నిలువరించి.. రెడ్ల ఓట్లలో చీలిక తెచ్చి, పరోక్షంగా బీఆర్ఎస్కు మేలు చేసేందుకే నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నది బీజేపీ శ్రేణుల అనుమానం.
రెడ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేని.. కిషన్‌రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా, కాంగ్రెస్‌కు వెళ్లే రెడ్ల ఓట్లను చీల్చవచ్చన్న తమ నాయకత్వం అంచనా, ఘోరంగా విఫలమవుతుందని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నాయకత్వ అంచనాకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతనే లేదన్నది వారి వాదన.
రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చినంత మాత్రాన, కాంగ్రెస్ వైపు చూస్తున్న రెడ్లు.. బీజేపీ వైపు మళ్లుతారనుకోవడం భ్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఇదంతా బీఆర్ఎస్కు లబ్ది చేకూర్చే నిర్ణయంగా, పార్టీ క్యాడర్ అనుమానించడం విశేషం.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు.. బీఆర్ఎస్తో జరిగిన పరోక్ష ఒప్పందాన్ని, బీజేపీ అగ్రనేతలు గుర్తు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిథిలోని ఐదు నియోజకవర్గాల్లో, బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్ధులను నిలబెట్టేలా బీజేపీ-బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నది, అప్పుడు పార్టీ వర్గాల్లో వినిపించిన చర్చ. ఓ ప్రముఖుడికి ఇంగ్లీషు లెటర్లు రాసి ఇచ్చే ఓ ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఇంట్లోనే, ఈ ఒప్పందాలు జరిగాయన్నది అప్పటి చర్చల సారాంశం.
అయితే దురదృష్టవశాత్తూ, ఆ ఐదుగురు బలహీన బీఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు. ఓడిన ఇద్దరు అగ్రనేతలు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. దీనిపై కొందరు సీనియర్లు బీజేపీ నాయకత్వానికి ఫిర్యాదు చేయగా, దానిపై వేసిన విచారణ కొండెక్కిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నగరంలో వాజపేయి విగ్రహం ఏర్పాటుచేయాలని కోరుతూ .. సీఎంను కలిసిన సమయంలోనే, ఈ ఒప్పందాలు జరిగాయన్నది అప్పట్లో బీజేపీ వర్గాల్లో వినిపించిన ఆరోపణ.
దీనిని బట్టి తాజా నిర్ణయాలతో.. బీజేపీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, అది ఎవరిపై ప్రేమతో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదని బీజేపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీఆర్ఎస్ గెలిచినా ఫర్వాలేదు గానీ కాంగ్రెస్ రాకూడదన్న లక్ష్యంతోనే ఈ నియామకం జరిగిందన్నది సీనియర్ల మనోగతం.
పార్టీ కోసం అనేక సార్లు జైళ్లకు వెళ్లిన బండి సంజయ్‌ను, నాయకత్వం బలిపశువు చేసిందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన, కాపు వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను.. ఏవిధంగా బలిపశువుగా చేసిందో, ఇప్పుడు అదే మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్‌ను కూడా.. తెలంగాణలో అదేవిధంగా బలిపశువును చేసిందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. అంటే అధికారంలో ఉన్న బీఆర్ఎస్-వైసీపీపై పోరాడే వారు, బలిపశువులవుతారన్న విషయాన్ని, నాయకత్వం పరోక్షంగా స్పష్టం చేసినట్లయింది.
ఏపీలో రెండు అసెంబ్లీ-ఒక పార్లమెంటు ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల్లో ఘోరంగా ఓడిపోయినందుకు కారణమైన, నోటిదురుసు సోము వీర్రాజును తొలగించారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల చరిత్రలో 40కి పైచిలుకు స్థానాలు, రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు, ఒక ఎమ్మెల్సీని సాధించిన సంజయ్‌ను ఎందుకు మార్చారో తెలియడం లేదని, పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజా నిర్ణయంతో బీసీలు బీజేపీకి దూరమయ్యే ప్రమాదం లేకపోలేదంటున్నారు.
సంజయ్ దూకుడుతో మూడో స్థానంలో ఉన్న బీజేపీ రెండోస్థానంలోకి రాగా, తాజా నిర్ణయంతో.. కాంగ్రెస్‌ను తమ పార్టీనే, స్వయంగా రెండో స్థానానికి తీసుకువెళ్లిందన్న వ్యాఖ్యలు, బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కొత్తగా పగ్గాలు చేపట్టిన కిషన్‌రెడ్డి కూడా.. సంజయ్ స్థాయిలో బీఆర్ఎస్పై యుద్ధం చేస్తారో లేదో చూడాలంటున్నారు.
ఇక ఏపీలో కాపు వర్గానికి చెందిన సోము వీర్రాజును తొలగించి, కమ్మ వర్గానికి చెందిన పురందీశ్వరిని నియమించడం కూడా.. వైసీపీకి మేలు చేకూర్చే ఎత్తుగడేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీకి మానసిక మద్దతుదారుగా ఉన్న కమ్మ సామాజికవర్గంలో చీలిక తెచ్చి, తద్వారా వైసీపీకి లాభం చేకూర్చాలన్న వ్యూహమే, ఈ నిర్ణయంలో కనిపిస్తోందని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్ల పాలనలో జగన్ సర్కారు.. కమ్మ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకున్న నిర్ణయాలతో, ఆ వర్గం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఆర్ధిక-రాజకీయ-వ్యాపార-పారిశ్రామిక రంగాల్లో కమ్మ వర్గాన్ని దెబ్బకొడుతున్న వైనంపై, ఆ వర్గం ఏకీకృతమవుతోంది. గత ఎన్నికల్లో స్థానిక వర్గ రాజకీయాల కారణాలతో.. వైసీపీకి దన్నుగా నిలిచిన కమ్మ వర్గం కూడా, ఈసారి టీడీపీ అధికారంలోకి రావాలని కసితో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో అదే వర్గానికి చెందిన పురందీశ్వరికి, అధ్యక్ష పదవి ఇవ్వడం తెలివితక్కువ నిర్ణయమేనని కుండబద్దలు కొడుతున్నారు.
ఎన్టీఆర్ వారసత్వ కార్డుతో.. కమ్మవర్గంలో ఓట్ల చీలిక తెచ్చి, పరోక్షంగా వైసీపీకి సహకరించాలన్న బీజేపీ వ్యూహం బూమెరాంగవుతుందని, ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. టీడీపీలో ఉన్న కమ్మవారినే అసలు కమ్మ వారిగా, వైసీపీలో రెడ్లనే అసలైన రెడ్లుగా భావిస్తున్న క్రమంలో.. పురందీశ్వరిని చూసి కమ్మవర్గమంతా, గంపగుత్తగా బీజేపీలోకి వస్తుందన్న అంచనా భ్రమే అవుతుందని స్పష్టం చేస్తున్నారు.
గత ఎన్నిక ల్లో ఆమె విజయానికి, ఎన్టీఆర్ కార్డు అక్కరకు రాని వైనాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. కమ్మ వర్గ ప్రభావం విపరీతంగా ఉండే.. తన సొంత పరుచూరు నియోజకవర్గంలో, పురందీశ్వరి నిలబెట్టిన చెరుకూరి రామ యోగీశ్వర్రావుకు కేవలం 703 ఓట్లు రాగా, నోటాకు 1181 ఓట్లు, ఇండిపెండెంట్‌కు 900 ఓట్లు, కాంగ్రెస్‌కు 1368 ఓట్లు, బీఎస్పీకి 5,649 ఓట్లు వచ్చిన విషయాన్ని బీజేపీ వర్గాలు గుర్తు చేస్తున్నారు.
చివరకు పురందీశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న కారంచేడులోని 144 బూత్ నెంబర్లో, బీజేపీకి కేవలం 3 ఓట్లే పోలయిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ ఆమె సొంత కారంచేడులో బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు, మండల కమిటీలు, సభ్యత్వాలు బలహీనంగానే ఉన్నాయని చెబుతున్నారు.
నిజంగా ఆమెకు కమ్మవర్గంలో అంత ఇమేజ్ ఉంటే.. సొంత పోలింగ్ బూత్‌లో 3 ఓట్లు మాత్రమే, ఎలా వస్తాయని బీజేపీ వర్గాలు ప్రశ్నిస్తున్నారు. పైగా కమ్మవర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉండి, పురందీశ్వరి పలుకుబడి ఎక్కువగా ఉన్న పరుచూరులో .. పార్టీకి కేవలం 705 ఓట్లు మాత్రమే ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.
మరి కేంద్రమంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె ప్రభావం ఏమైంద ని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఎన్నిక ల్లో అభ్యర్ధులంతా కమ్మ వారే అయినప్పటికీ, టీడీపీ కమ్మ అభ్యర్ధి గెలిచారంటే.. కమ్మవర్గం ఆ పార్టీకే దన్నుగా ఉన్న విషయం అర్ధం అవుతోందని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
ఆరకంగా తన సొంత నియోజకవర్గంలోనే కమ్మవర్గంపై పట్టులేని ఆమె.. పార్టీ అధ్యక్షురాలిగా రాష్ట్రంలోని కమ్మవర్గంపై, ఎలా ప్రభావితం చేస్తారన్న ప్రశ్నలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్ కార్డు ఆయన కుమారుడు దివంగత హరికృష్ణ, రెండవ భార్య లక్ష్మీపార్వతికే పనిచేయనప్పుడు.. రెండు పార్టీలు మారిన పురందీశ్వరికి మాత్రం, ఎలా పనిచేస్తుందని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ నేతలు కొన్ని సంఘటనలు ఉదహరిస్తున్నారు. మజ్లిస్ పార్టీ అభ్యర్ధిగా హిందువును నిలబెడితే, హిందువులంతా ఆ పార్టీకి ఓటు వేస్తారనుకోవడం ఎంత భ్రమనో.. తెలంగాణలో రెడ్లు, ఆంధ్రాలో కమ్మ వర్గమంతా కాంగ్రెస్-టీడీపీని కాదని, తమ పార్టీకి ఓటు వేస్తుందనుకోవడం కూడా అంతే భ్రమ అని బీజేపీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.
కాగా ఆరెస్సెస్‌లో సుదీర్ఘకాలం ప్రముఖ స్థానంలో పనిచేసి, ఇటీవలే ప్రాధాన్యం కోల్పోయిన ఓ తెలంగాణ నేత చేసిన లాబీయింగ్ ఫలితంగా, ఆమెకు అధ్యక్ష పదవి దక్కినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సదరు నాయకుడు ఆమెకు పదవి కోసం సంఘ్‌లోని తన పలుకుబడి మొత్తం వినియోగించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే అసలు రంగంలో లేని ఆమె పేరు తెరపైకొచ్చింద ంటున్నారు.
అయితే తెలంగాలో కిషన్‌రెడ్డి.. అక్కడి సీఎం కేసీఆర్, ఏపీలో పురందీశ్వరి.. అక్కడి సీఎం వైఎస్ జగన్‌పై చేసే యుద్ధం బట్టి, వారు ఎవరి వైపు ఉన్నారన్నది స్పష్టమవుతుంద ంటున్నారు. వారిద్దరూ సంజయ్ మాదిరిగా, సర్కారుపై నిజమైన యుద్ధం చేస్తున్నారా? బంతి పూల యుద్ధం చేస్తున్నారా అన్న దానిపైనే.. వారి చిత్తశుద్ది, నియామకంలో నిజాయితీ స్పష్టమవుతుందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.