Suryaa.co.in

Editorial

పువ్వు.. ఫ్యాను.. ఒక పవిత్రబంధం!

– కేంద్ర క్యాబినెట్‌లో వైసీపీ చేరుతుందా?
– ముగ్గురికి మంత్రి పదవులంటూ ప్రచారం
– కేంద్రంలో చేరటం ఖాయమంటూ జాతీయ మీడియా కథనాలు
– ఇంతవరకూ ఖండించని వైసీపీ నేతలు
– చేరితే మంచిదేనంటున్న వైసీపీ సీనియర్లు
– రాజకీయంగా అదనపు బలం వస్తుందన్న ధీమా
– కేంద్రనిధులతో మరింత వేగంగా జనంలోకి వెళ్లవచ్చన్న ఆశ
– కొత్త సంక్షేమపథకాలకు ఆసరా దొరుకుతుందన్న భరోసా
– మైనారిటీ లు, క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్లతో భయం లేదన్న అంచనా
– ఆ ముగ్గురూ కలిసినా తొలి ఎన్నికల్లో తమకే ఓటు వేశారన్న విశ్లేషణ
– అందుకే 5 లక్షల తేడాతో ఓడామంటున్న సీనియర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

హీరోహీరోయిన్లు తమ అవసరాల కోసం ఒక ఒప్పందం చేసుకుంటారు. దాని ప్రకారం ఇద్దరూ కాంట్రాక్టు పెళ్లి చేసుకుంటారు. హీరోయిన్‌ తాను కాంట్రాక్టు భార్యనని కూడా మరిచి, కాంట్రాక్టు మొగుడికి సపర్యలు చేస్తుంది. నటించడం బదులు జీవిస్తుంది. హీరో ప్రమాదానికి గురైనప్పుడు, నిజమైన భార్యమాదిరిగానే సేవలందిస్తుంది.దానితో హీరో మనసులో కాంట్రాక్టు భార్యపై మమకారం ప్రారంభమవుతుంది. ఇద్దరం పెళ్లిచేసుకుందామని ప్రపోజ్‌ చేస్తాడు. కానీ కాంట్రాక్టు భార్య అందుకు ఒప్పుకోదు. సూటిపోటిమాటలతో కాంట్రాక్టు భర్తను పొడుస్తుంది. చివరాఖరకు వారిద్దరి పెళ్లితో శుభం కార్డు పడుతుంది. ఇది వెంకటేష్‌-సౌందర్య నటించిన, ‘పవిత్రబంధం’ సినిమాలోని కథ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇప్పుడు కొంచెం అటు ఇటుగా, వైసీపీ-బీజేపీ సంబంధాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి. కేంద్రమంత్రి అమిత్‌షా నుంచి.. కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నేతలు ఏపీకి వెళ్లి.. జగన్‌ సర్కారుపై విరుచుకుపడతారు. ఆంధ్రాలో జరుగుతున్నంత అవినీతి, ఇంతవరకూ తామెక్కడా చూడలేదని ధ్వజమెత్తుతారు. రేషన్‌ బియాన్ని రీసైక్లింగ్‌ చేసి, విదేశాలకు అముతున్నారని ఆరోపిస్తారు. కేంద్రనిధులతో పథకాలకు, జగన్‌ స్టిక్కర్లు వేసుకుంటున్నారని విమర్శిస్తారు. అప్పులు చేసి సర్కారు నడిపించడం గొప్పా అని నిలదీస్తారు. జగన్‌ సర్కారుకు చివరిరోజులు దాపురించాయని శపిస్తారు.

మళ్లీ ఇవే గళాలు, జగన్‌ సర్కారు కష్టకాలంలో ఉంటే నిధులిచ్చి ఆదుకుంటాయి. జగన్‌ కోరిన వెంటనే ఐఏఎస్‌లకు, పదవీకాలం పెంచుతూ ఉత్తర్వులు వచ్చేస్తాయి. మోదీ గారు జగన్‌పై పుత్రవాత్సల్యం ప్రదర్శిస్తారని, కేంద్రమంత్రులు కొనియాడతారు. తమ సొంత సీఎం, మంత్రులు, ఎంపీలకే అపాయింట్‌మెంట్లు ఇవ్వని మోదీ-అమిత్‌షాలు, జగన్‌కు అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్‌ ఇచ్చేస్తారు.

ఇప్పటికి జగన్‌కు 24 సార్లు మోదీషా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారంటే, వారి పవిత్రబంధం ఏ స్థాయిలో ఉందో సుస్పష్టం. బహుశా అన్నిసార్లు.. ఏ బీజేపీ సీఎం గానీ, ఏ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు గానీ వారిద్దరూ అపాయింట్‌మెంటు ఇచ్చి ఉండరన్నది రాజకీయ విశ్లేషకుల వ్యాఖ్య. ఇది బీజేపీ నేతలు సైతం ఈర్ష్యపడే వ్యవహారమే.

అంతేగానీ… తాము ఇంతవరకూ చూడని అవినీతికి పాల్పడుతున్న మీకు, అపాయింట్‌మెంట్‌ ఇచ్చేదిలేదని గానీ.. బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేస్తున్న మీ ముఖం చూసేది లేదని, మా నిధులతో మీ స్టిక్కర్లు వేసుకుంటున్న మీతో మాట్లాడేదిలేదని, ఇకపై మీకు దమ్మిడీ కూడా ఇచ్చేది లేదని మాత్రం, తమ వద్దకు వచ్చే జగన్‌కు చెప్పరు. జగన్‌ ఏపీకి వెళ్లిన తర్వాత, మళ్లీ బీజేపీ నేతల తిట్లు-శాపనార్థాలు డిటో.. డిటో!

దానితో సహజంగానే గల్లీలో కుస్తీ-ఢిల్లీలో దోస్తీ అంటూ మీడియా, విపక్షాల విమర్శలు. జగన్‌ అవినీతి పరుడని ఆరోపించిన అమిత్‌షా, మరి చర్యలెందుకు తీసుకోరని ప్రశ్నలు. కేంద్రమే అప్పులిస్తూ, ఏపీ బీజేపీ నేతలతో అప్పుల అప్పారావని తిట్టించడం ఎందుకని నిలదీత. బీజేపీలో కొందరు జగన్‌కు అనుకూలం-ఇంకొందరు అనుకూలం. జగన్‌కు సీబీఐ కోర్టు మినహాయింపు, అవినాష్‌రెడ్డి కేసు సాగదీయం వీటి వెనుక ఉన్న చీకటి ఒప్పందాలు ప్రజలకు తెలుసన్నది విపక్షాల సన్నాయినొక్కులు.

ఈ క్రమంలో కేంద్ర క్యాబినెట్‌లో వైసీపీ చేరబోతోందని, గత రెండు రోజుల నుంచి ఢిల్లీ కేంద్రంగా మీడియాలో పెద్ద చర్చ. అందులో భాగంగా విజయసాయిరెడ్డి, నందిగం సురేష్‌, మోపిదేవి రమణకు కేంద్రమంత్రి పద వులు వడ్డిస్తున్నారన్నది సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త.

ఎన్డీఏలో వైసీపీ చేరబోతోందన్న పుకార్లు షికారు చేస్తున్నా, వైసీపీ నేతలెవరూ పెదవి విప్పకపోవపడమే ఆశ్చర్యం. మంత్రి బొత్స ఒక్కరే ఖండించినప్పటికీ.. అధినేత జగన్‌ మాత్రం మౌనంగా ఉండటం, ఆయన మౌనం అంగీకారానికి సంకేతంగా స్పష్టమవుతుంది.

ఎన్డీఏలో వైసీపీ చేరుతుందా? లేదా? అన్నది ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయం. అయితే.. ప్రతిరోజూ బీజేపీ బంధంపై అనుమానాలు పెరుగుతున్నందున, వాటికి తెరదించడమే మంచిదన్నది వైసీపీ సీనియర్ల వాదన. బీజేపీతో తెరచాటు స్నేహం చేస్తొంందని వచ్చిన పేరు, పడిన మరక ఎలాగూ పోనందున.. ఎన్డీఏలో చేరితే వ్రతం చెడ్డా, సుఖం దక్కుతుందన్నది వైసీపీ నేతల మనోగతం. ఎలాగూ వైసీపీ-బీజేపీ తెరచాటు దోస్తీ కొనసాగిస్తున్న నిజం బట్టబయలయినందున, ఇంకా దానిని రహస్యంగా దాచిపెట్టుడకోవడం అనవసరమన్నది సీనియర్ల అభిప్రాయం.

కేంద్ర సహకారం లేకపోతే జగన్‌ ఇప్పటివరకూ, కోర్టుకు హాజరవకుండా ఉండే ప్రసక్తి లేదని.. అవినాష్‌రెడ్డి కేసు తెలుగుటీవీ సీరియల్‌ జీడిపాకం మాదిరిగా సాగే అవకాశం ఉండదని.. అప్పులు పుట్టే సమస్య ఉండదని వైసీపీ నేతలు విశ్లేషిస్తున్నారు.

ఎన్డీఏ సర్కారులో చేరితే ముస్లిం, క్రైస్తవ, దళిత క్రైస్తవులు దూరమవుతాయన్న భయం అనవసరమని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ-బీజేపీ-జనసేన కలసి పోటీ చేసినప్పటికీ, వైసీపీ 67 సీట్లు సాధించిన విషయాన్ని విస్మరించకూడదంటున్నారు. తమకు-టీడీపీకి కేవలం ఐదున్నర లక్షల ఓట్లే తేడా అని గుర్తు చేస్తున్నారు. బీజేపీతో కలిస్తే ఆ వర్గాలు దూరమవరని, జగన్‌పై అభిమానంతో వారు ఆ కలయికను స్వాగతిస్తారని వైసీపీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ దళిత-క్రిస్టియన్‌-దళిత క్రిస్టియన్లు జగన్‌ వైపే ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

ఈ ముసుగులో గుద్దులాటలు, విపక్షాల విమర్శలు ఎదుర్కొని అభాసుపాలయ్యే కంటే.. ఎన్డీఏలో చేరడమే ఉత్తమమన్న అభిప్రాయం, వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎలాగూ బీజేపీ-వైసీపీ దోస్తులేనన్న భావన జనక్షేత్రంలోకి వెళ్లింది కాబట్టి, ఎన్డీఏలో చేరడమే మంచిదని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల టీడీపీని మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు, ఆయుధం దొరికినట్టవుతుందని అభిప్రాయపడుతున్నారు.

LEAVE A RESPONSE