Suryaa.co.in

Telangana

ఘనంగా బోనాల ఉత్సవాలు

– మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్: మన సంస్కృతి, సాంప్రదాయాలను మరింత పెంపొందించే విధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

శనివారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని 268 దేవాలయాలకు బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం కోటి 62 లక్షల రూపాయల విలువైన ఆర్ధిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ లు, అధికారులతో కలిసి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటిచెప్పే బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని ఉమ్మడి రాష్ట్రంలో డిమాండ్ చేసినా అమలుకు నోచుకోలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు గుర్తు చేశారు.

బోనాలను వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశం తో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకే కాకుండా ప్రయివేట్ ఆలయాలకు కూడా ఆర్ధిక సహాయం అందించినట్లు వివరించారు. అదే పరంపర ను కొనసాగిస్తూ ప్రస్తుత ప్రభుత్వం దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందిస్తుండటం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని ఆలయాల అలంకరణ, బోనాల ఉత్సవాల కోసం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 13 వ తేదీన జరిగే మహంకాళి జాతర, 14 న నిర్వహించే రంగం, అంబారీ పై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలకు లక్షలాది మంది భక్తులు వస్తారని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

అమ్మవారి ఆశీస్సులు ప్రజలు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు జరిగేలా అందరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కుర్మ హేమలత, టి.మహేశ్వరి, దీపిక, సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్, దేవాదాయ శాఖ అధికారులు శ్రీనివాస్ శర్మ, శ్రీదేవి, మహంకాళి ఆలయ చైర్మన్ కామేష్, వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE